తన కుమరుడిలా మరొకరు కావొద్దని... 32 ఏళ్లుగా ట్రాఫిక్ విధులు!
గంగారామ్ ఈ నిర్ణయం తీసుకుని, అవిరాంగంగా ఈ పనికి పూనుకోవడం వెనుక వ్యక్తిగత విషాదం దాగి ఉంది.
By: Tupaki Desk | 27 July 2025 10:53 AM ISTఈ లోకంలో మెజారిటీ జనాలు వారి కోసం వారు బ్రతుకుతుంటే.. అతి తక్కువ మంది మాత్రం సమాజానికి ఏదో ఒక మేలు చేయాలనే తపనతో బ్రతుకుతుంటారు! వారికి అవార్డులు, రివార్డులతో పనిలేదు. అనుకున్న పని మౌనంగా చేసుకుంటూ వెళ్లడమే వారికి వచ్చు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే... గంగారామ్. సుమారు 32 ఏళ్లుగా ఈయన ఉచితంగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. అలా అని ఈయన పోలీసు కాదు.. కానీ, ఈ సర్వీస్ వెనుక గుండెలు బరువెక్కించే విషయం దాగి ఉంది.
అవును... దేశ రాజధాని ఢిల్లీలోని సందడిగా ఉండే ఓ ప్రాంతంలో గంగారామ్ అనే వ్యక్తి డెబ్బై రెండేళ్ల వయసులో సుమారు మూడు దశాబ్దాలకు పైగా జీతం ఆశించకుండానే గందరగోళంగా ఉన్న సీలంపూర్ జంక్షన్ లో ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. అతను ట్రాఫిక్ పోలీసులలో భాగం కాదు, అతనిని ఎవరూ నియమించనూ లేదు. అయినప్పటికీ.. ప్రతిరోజూ యూనిఫాం ధరించి, లాఠీని పట్టుకుని, ట్రాఫిక్ ను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తున్నారు.
గంగారామ్ ఈ నిర్ణయం తీసుకుని, అవిరాంగంగా ఈ పనికి పూనుకోవడం వెనుక వ్యక్తిగత విషాదం దాగి ఉంది. ఇందులో భాగంగా... అయన ఇప్పుడు పనిచేస్తున్న అదే సీలంపూర్ సిగ్నల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగారామ్ కుమారుడు మరణించాడు. తన ఏకైక బిడ్డను కోల్పోయిన తర్వాత అతని భార్య ఈ బాధను భరించలేకపోయి, మరణించారు. దీంతో... గంగారామ్ పూర్తిగా ఒంటరి అయిపోయారు. ఈ సమయంలోనే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా... తన పరిస్థితి మరే కుటుంబానికి రావద్దని గంగారామ్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో... రోజూ 20 కి.మీ.లు ప్రయాణం చేసి వచ్చి మరీ సీలంపుర్ జంక్షన్ లో ట్రాఫిక్ ను చక్కదిద్దుతున్నారు. గంగారామ్ ఎంత కమిటెడ్ అంటే... వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా ఆయన పని మానరు. కోవిడ్ - 19 మహమ్మారి తీవ్రంగా ఉన్న సమయంలో.. వృద్ధులు తమ భద్రత కోసం ఇంటి లోపలే ఉండాలని కోరినప్పుడు కూడా గంగారామ్ ఎప్పుడూ ఇంట్లో ఉండలేదు.
అప్పుడు కూడా ట్రాఫిక్ నిర్వహణ పట్ల అతని అచంచలమైన నిబద్ధత కొనసాగింది. ఆయనను విపరీతమైన ఎండ, భారీ వర్షం, కరోనా మహమ్మారి సైతం ఆపలేకపోయింది! ఈ క్రమంలో... ఢిల్లీ పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థలు ఆయన సేవలను గుర్తించి పలుమార్లు సత్కరించాయి. ఇటీవల సోషల్ మీడియాలోనూ గంగారామ్ కథ విన్న నెటిజన్లు బరువెక్కిన హృదయాలతో ఆయనకు సెల్యూట్ చేస్తున్నారు.
