ధర్మేంద్ర ప్రధాన్...భారీ వికెట్ కే సీజేపీ గురి !
కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద హోరెత్తించింది. అలా ఇలా కాదు వేలాది మంది విద్యార్ధులతో సాగిన సీజేపీ నిరసన ఉద్యమం కేంద్ర ప్రభుత్వానికి గట్టిగానే తాకి ఉంటుందని భావిస్తున్నారు.
By: Satya P | 7 Jun 2026 4:00 AM ISTకాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద హోరెత్తించింది. అలా ఇలా కాదు వేలాది మంది విద్యార్ధులతో సాగిన సీజేపీ నిరసన ఉద్యమం కేంద్ర ప్రభుత్వానికి గట్టిగానే తాకి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటిదాకా ఆన్ లైన్ ఇక మీదట ఆఫ్ లైన్ అన్నట్లుగానే సీజేపీ తన ఉద్యమాన్ని ఘనంగానే మొదలెట్టింది. పెద్ద ఎత్తున వెల్లువలా యువత జంతర్ మంతర్ కి చేరుకోవడం విశేషం. ఈ సందర్భంగా ప్రధానమైన డిమాండ్ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని తప్పించాలని. ఆయన రాజీనామా చేయాలని. నీట్ పరీక్షా పత్రం లీక్ అయిన ఉదంతం జరిగి నెల రోజుల దగ్గర అవుతోంది. మరి దీని మీద కేంద్రం తీసుకున్న చర్యలేవీ ఉపశమనం కలిగించడం లేదు. దాంతోనే కేవలం సీట్ లీకేజ్ వార్తల తరువాత నాలుగు రోజుల వ్యవధిలో ఆన్ లైన్ వేదికగా సీజేపీ స్టార్ట్ అయింది. ఇపుడు ప్రత్యక్ష పోరాటం కూడా ప్రారంభం అయింది.
బీజేపీ ఏం చేస్తుంది :
ఇటీవల కాలంలో నీట్ లీకేజ్ తో పాటు అనేక పరీక్షల నిర్వహణలో లోపాల మీద కూడా సీజేపీ ద్వజమెత్తింది. బీజేపీనే నేరుగా టార్గెట్ చేసింది. విద్యా శాఖ మంత్రిని తప్పించాలని సీజేపీ వ్యవస్థపకుడు అభిజిత్ దీప్కే పట్టుబడుతున్నారు. మరి దీని మీద బీజేపీ ఏమి చేస్తుంది అన్నదే చర్చగా ఉంది. నిజానికి సీజేపీ డిమాండ్ మాత్రమే ఇది కాదు, విపక్షాలు అన్నీ గట్టిగానే ఈ అంశం మీద మాట్లాడుతున్నాయి. మరి ఇరవై లక్షల మంది రాసిన నీట్ పరీక్షా పత్రం లీక్ అయింది అంటే కేంద్రం తీసుకున్న చర్యల సంగతి పక్కన పెడితే బాధ్యతగా కేంద్ర మంత్రిని ఎందుకు తప్పించలేదు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇపుడు సీజేపీ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే జంతర్ మంతర్ వద్ద మళ్ళీ వచ్చే శనివారం కూడా ఆందోళన నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అంటే కేంద్ర మంత్రి రాజీనామా మీద సీజేపీ గురి పెట్టింది అని అర్ధం అవుతోంది.
వ్యూహాత్మకంగానే :
అయితే బీజేపీ విపక్షాలు డిమాండ్ చేసాయనో లేదా సీజేపీ ఆందోళ్లనలు నిర్వహిస్తోంది అనో కేంద్ర మంత్రి చేత రాజీనామా ఇప్పిస్తే తలొగ్గినట్లుగా ఉంటుందని భావించే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది అన్న చర్చ కూడా సాగుతోంది. సరైన సమయంలో ఆయనను సదరు విద్యా శాఖ నుంచి తప్పిస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది. ఈ నెల మూడో వారం తరువాత కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అపుడు ధర్మేంద్ర ప్రధాన్ శాఖను తప్పించి వేరొకరికి ఇవ్వడం ద్వారా బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేస్తుంది అని అంటున్నారు.
బలమైన నేతగా :
అయితే సాధారణంగా ఆరోపణలు వచ్చినపుడు కానీ ఏదైనా సంఘటనలు జరిగినపుడు కానీ వెంటనే సంబంధిత మంత్రులు రాజీనామా చేయడమో లేక వారిని తప్పించడంలో ఒక రివాజుగా వస్తోంది. పైగా అది నైతిక వర్తనకు సంబంధించిన అంశంగా కూడా అంతా చూస్తారు. గతంలో రైల్వే ప్రమాదాల విషయంలో లాల్ బహుదూర్ శాస్త్రి తన కేంద్ర మంత్రి పదవిని వదులుకున్నారు అన్నది తెలిసిందే. మరి బీజేపీ ఈ విషయంలో ఎందుకు ఆలోచిస్తోంది అన్నదే చర్చ. అయితే ధర్మేంద్ర ప్రధాన్ ఒడిషాలో కీలకమైన నాయకుడు. పైగా బలమైన నేత. ఆయన తండ్రి కాలం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతూ వస్తున్నారు.
ముఖ్యమంత్రి అవాల్సిన నేత :
వాజ్ పేయ్ ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి దేబేంద్ర ప్రధాన్ 1999 నుండి 2004 వరకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇక 2007 నుంచి ధర్మేంద్ర ప్రధాని పాలమెంట్ సభ్యునిగా ఉన్నారు. తొలుత రాజ్యసభ నుంచి గెలిచిన ఆయన ఆ తరువాత లోక్ సభకు నెగ్గి వచ్చారు. గతంలో పలు కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. అలాగే ఒడిషాలో బీజేపీని గెలిపించడంలో ముఖ్య భూమిక పోషించారు. ఒక విధంగా ముఖ్యమంత్రి అవాల్సిన నేత. అందుకే బీజేపీ ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఆచీ తూచీ అన్నట్లుగా వ్యవహరిస్తోందా అన్న చర్చ అయితే సాగుతోంది.
