ఢిల్లీలో కాక్రోచ్ ల అలజడి.. దీప్కే ముందస్తు అరెస్టు, 35 వేల మంది పోలీసులతో భద్రత
రాజధాని ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చేపట్టిన ‘లెహ్రా దో తిరంగా’ (జాతీయ జెండా ప్రదర్శన) మార్చ్ దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు, రాజకీయ కలకలానికి దారితీసింది.
By: Tupaki Desk | 16 Oct 2026 7:59 PM ISTరాజధాని ఢిల్లీలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చేపట్టిన ‘లెహ్రా దో తిరంగా’ (జాతీయ జెండా ప్రదర్శన) మార్చ్ దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు, రాజకీయ కలకలానికి దారితీసింది. ఈ నిరసన ప్రదర్శనకు ముందే సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు ఆయన నివాసం వద్ద ముందస్తు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, వారి మధ్య అత్యంత తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
పోలీసులు తనను అరెస్ట్ చేసే ముందు ఇచ్చిన నోటీసును అభిజీత్ దీప్కే తీవ్రంగా ఖండించారు. తాను ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతున్నానని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నానని అందులో పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. ఇది మీకు జోక్లా ఉందా అని ప్రశ్నిస్తూ, ఇష్టం వచ్చినట్లు రాసి నోటీసులు అంటించడం సరైంది కాదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో జాతీయ జెండా పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలపడం నేరం ఎలా అవుతుందని ఆయన నిలదీశారు.
పోలీసుల హెచ్చరికలపై తీవ్రంగా స్పందించిన దీప్కే, తమ పార్టీ రాజ్యాంగబద్ధమైన సూత్రాలకే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తాము మహాత్మా గాంధీ చూపిన అహింసా సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతామని పేర్కొన్నారు. తాము ఎక్కడైనా హింసకు పిలుపునిచ్చినట్లు ఒక్క వీడియో ఆధారమైనా చూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని సవాలు విసిరారు. చట్టం పేరుతో నాటకాలు ఆడటం కంటే, అంతగా ఉంటే తనను ఉరి తీయాలని పోలీసులకు తేల్చి చెప్పారు. ఓట్లు లెక్కించగానే ప్రజాస్వామ్యం ముగిసిపోదని, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కకూడదని హితవు పలికారు.
ఈ నిరసన ప్రదర్శన వెనుక బలమైన నేపథ్యం ఉంది. జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసన తెలిపారనే ఆరోపణలతో ఇటీవలే సీజేపీ కీలక నేతలు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాను పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. దీనికి తోడు, ఓటర్ల జాబితా సవరణల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. తమ నాయకుల అరెస్టులకు నిరసనగా సాయంత్రం వేళ కన్నాట్ ప్లేస్ వద్దకు అందరూ జాతీయ జెండాతో రావాలని దీప్కే లెహ్రా దో తిరంగా’కు పిలుపునిచ్చారు.
ఈ నిరసన మార్చ్ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఢిల్లీ పోలీసులు అపూర్వమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కన్నాట్ ప్లేస్, పరిసర ప్రాంతాల్లో దాదాపు 32,000 మందికి పైగా ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. ఎలాంటి అనుమతులు లేని ఈ ప్రదర్శనను అడ్డుకోవడానికి పలు అంచెల బారికేడ్లు, విస్తృత సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేసి, అనుమానితులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ పరిణామం ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ హక్కులు, శాంతిభద్రతల మధ్య జరుగుతున్న ఘర్షణగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు జాతీయ జెండాను పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉందో లేదో చెప్పాలని సిజెపి ప్రశ్నిస్తుండగా, మరోవైపు కన్నాట్ ప్లేస్ వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో వేలాదిమంది సమకూరితే తీవ్రమైన ట్రాఫిక్, ప్రజా రక్షణ సమస్యలు తలెత్తుతాయని పోలీసులు వాదిస్తున్నారు. ఈ పరిణామాలు దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయని అంటున్నారు.
