Begin typing your search above and press return to search.

ఢిల్లీ IRS అధికారి కుమార్తె హత్యాచారం: ఇంటి ప‌నివాడి దారుణం!

దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఐఆర్ఎస్ (IRS) అధికారి కుమార్తెపై జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా భద్రతా పరమైన అనేక ఆందోళనలను తెరపైకి తెచ్చింది.

By:  Sivaji Kontham   |   23 April 2026 10:50 PM IST
ఢిల్లీ IRS అధికారి కుమార్తె హత్యాచారం: ఇంటి ప‌నివాడి దారుణం!
X

దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఐఆర్ఎస్ (IRS) అధికారి కుమార్తెపై జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా భద్రతా పరమైన అనేక ఆందోళనలను తెరపైకి తెచ్చింది. నిందితుడు ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తి కావడం.. వారి దినచర్యపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ఈ ఘోరానికి ప్రధాన కారణమైంది. నిందితుడు పక్కా ప్రణాళికతో బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండే సమయాన్ని ఎంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసు విచారణలో తేలింది.

నిందితుడు గతంలో ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉండటం వల్ల.. ఇంట్లోని వ్యక్తులు ఎప్పుడు బయటకు వెళ్తారు? ఎప్పుడు తిరిగి వస్తారనే విషయాలను నిశితంగా గమనించాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..సంఘటన జరిగిన రోజున కుటుంబ సభ్యులందరూ వారి పనులపై బయటకు వెళ్లినట్లు నిర్ధారించుకున్నాకే నిందితుడు లోపలికి ప్రవేశించాడు. బాధితురాలికి తెలిసిన వ్యక్తి కావడంతో ఆమె అనుమానించకుండా తలుపు తీసిందని.. అదే ఆ బాలిక‌ ప్రాణాల మీదకు తెచ్చిందని దర్యాప్తులో వెల్లడైంది.

అత‌డు వేకువ ఝామున ఇంట్లో ప్ర‌వేశించాడు. త‌ర్వాత బాలిక‌తో ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. త‌ల‌పై చేతికి దొరికిన దానితో బాది చంపాడు. అత్యాచారం చేసాడు. ఆ త‌ర్వాత ఇంట్లో లాక‌ర్లు తెరిచి ల‌క్ష‌ల సొమ్మును త‌న బ్యాగులో స‌ర్ధుకుని వెళ్లాడు. అత‌డు దాదాపు 40 నిమిషాల పాటు ఆ ఇంట్లోనే త‌చ్చాడాడు. అత‌డు ఆ ఇంట్లోకి ఎలా ప్ర‌వేశించాడో సీసీ కెమెరాల్లో రికార్డ‌యింది. అయితే జ‌ర‌గాల్సిన దారుణం జ‌రిగిపోయింది.

ఈ కేసులో నిందితుడు కేవలం నేరం చేయడమే కాకుండా.. సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించాడు. నేరం జరిగిన తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం... తన ఉనికిని చాటే ఏ వస్తువు అక్కడ లేకుండా జాగ్రత్తపడటం ద్వారా పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూశాడు. అయితే ఫోరెన్సిక్ బృందం సేకరించిన శాస్త్రీయ ఆధారాలు- సిసిటివి ఫుటేజీ నిందితుడిని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. తెలిసిన వ్యక్తులే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం సామాజిక సంబంధాలపై నమ్మకాన్ని సడలిస్తోంది.

ప్రభుత్వ ఉన్నతాధికారుల నివాసాలు ఉండే హై-సెక్యూరిటీ జోన్లలో కూడా ఇలాంటి నేరాలు జరగడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. బయటి వ్యక్తుల కంటే కూడా.. ఇంట్లోకి ప్రవేశం ఉన్న పనివారు లేదా తెలిసిన వారి విష‌యంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన హెచ్చరిస్తోంది. కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు.. వారి రాకపోకల సమయాలు ఇతరులకు సులభంగా తెలియడం అనేది ఎంత ప్రమాదకరమో ఈ ఉదంతం నిరూపించింది.

ఈ ఘోరకలి విష‌యంలో పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చూడాలని.. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. గృహ భద్రతను మెరుగుపరుచుకోవడంతో పాటు... అపరిచితులనే కాకుండా తెలిసిన వారి ప్రవర్తనను కూడా నిరంతరం గమనించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన గుర్తు చేస్తోంది. కేవలం సీసీ కెమెరాలు మాత్రమే కాకుండా.. వ్యక్తిగత జాగ్రత్త కూడా ప్రాణాలను రక్షించగలవని మనం గుర్తించాలి.