Begin typing your search above and press return to search.

'సొంత ప్రపంచంలో జీవిస్తున్నారు'.. రాందేవ్ బాబాపై హైకోర్టు సీరియస్!

అవును... యోగా గురువు రాందేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

By:  Tupaki Desk   |   1 May 2025 6:00 PM IST
సొంత ప్రపంచంలో జీవిస్తున్నారు.. రాందేవ్  బాబాపై హైకోర్టు సీరియస్!
X

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హందార్ద్ సంస్థకి చెందిన రూహ్ అఫ్జా పై మరో వీడియో విడుదల చేయడంపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అలా చేయవద్దని ఇప్పటికే ఆదేశించినప్పటికీ మరో వీడియో రూపొందించడం కోర్టు దిక్కారం కిందకు వస్తుందని పేర్కొంది.

అవును... యోగా గురువు రాందేవ్ బాబాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హందార్ధ్ పానియం విషయంలో ఆయన మరోసారి వ్యాఖ్యానిస్తూ విడుదల చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్ పై విచారిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... "ఎవరి నియంత్రణలోనూ లేకుండా ఆయన తన సొంత ప్రపంచంలో జీవిస్తున్నారు" అని న్యాయస్థానం పేర్కొంది.

వాస్తవానికి కొనీ రోజుల కిందట హందార్ద్ పానియం గురించి రాందేవ్ బాబా పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా.. ఆ పానియం కొనుగోలు చేయడం వల్ల వారికి వచ్చే లాభాలను కంపెనీ.. మదర్సాలు, మసీదుల నిర్మాణానికి నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. దీంతో.. ఈ వ్యాఖ్యలపై సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

దీంతో.. హందార్ద్ తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యాఖ్యలు ఆ సంస్థ ఉత్పత్తిని అగౌరవపరచడం కంటే తీవ్రమైనవని.. అవి ద్వేషపూరిత వ్యాఖ్యల కిందకే వస్తాయని వాదించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఆ వ్యాఖ్యలు ఏమాత్రం సమర్ధనీయం కాదని తీవ్రంగా స్పందిస్తూ.. ఆ వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించింది.

ఈ విచారణ ఏప్రిల్ 22న జరిగింది. ఈ సందర్భంగా నాడు స్పందించిన న్యాయస్థానం.. హందార్ద్ ఉత్పత్తులపై భవిష్యత్తులో ఎలాంటి ప్రకటనలు జారీ చేయవద్దని, వీడియోలు షేర్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తాజాగా మరోసారి వీడియో విడుదల కావడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా స్పందించిన జస్టిస్ అమిత్ బన్సాల్... రాందేవ్ బాబాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఆయన తన ఆలోచనలను తనలోనే ఉంచుకోవాలని, వాటిని బయటకు వ్యక్తపరచాల్సిన అవసరం లేదని అన్నారు. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని.. కోర్టు దిక్కరణ కింద ఆయన తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తామని అన్నారు.

దీనికి సంబంధించిన అఫిడవిట్ ను వారంలోపు దాఖలు చేయాలని.. ఈ పిటిషన్ పై శుక్రవారం మరోసారి వాదనలు వింటామని జస్టిస్ అమిత్ బన్సాల్ తెలిపారు.