Begin typing your search above and press return to search.

బీజేపీని భయపెడుతున్న సీజేసీ : ఢిల్లీలో హైటెన్షన్.. రంగంలోకి 23 వేల మంది పోలీసులు

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు చేస్తున్న ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది.

By:  Tupaki Desk   |   9 Oct 2026 3:27 PM IST
బీజేపీని భయపెడుతున్న సీజేసీ : ఢిల్లీలో హైటెన్షన్.. రంగంలోకి 23 వేల మంది పోలీసులు
X

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు చేస్తున్న ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ అట్టుడికిపోతోంది. ఈ నెల 6వ తేదీ నుంచి నిరసనలు తీవ్రం కావడంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. మరోవైపు విపక్షాలకు తోడుగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కూడా నిరసనలకు సిద్ధమవడంతో రాజధాని నగరంలో హైటెన్షన్ నెలకొందని చెబుతున్నారు. సీజేపీ ప్రదర్శనలకు అనుమతి లేదని ప్రభుత్వం తేల్చిచెప్పగా, ఎట్టిపరిస్థితుల్లోనూ జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు నిర్వహిస్తామని సీజేపీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడిక్కిపోయిందని అంటున్నారు.

కేంద్రం హైఅలర్ట్

సీజేపీ నిరసనలను అడ్డుకునే లక్ష్యంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. రాజధానికి 23 వేల మంది భద్రతా బలగాలను తరలించింది. ఢిల్లీకి వచ్చే అన్ని మెయిల్, ఎక్సప్రెస్ రైళ్లను రద్దు చేసింది. మరోవైపు నగరంలోని 53 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి 9 గంటల వరకు మూసివేయాలని పోలీసులు కోరారు. ఈ నేపథ్యంలో సీజేపీ ఆందోళనలపై ప్రభుత్వం టెన్షన్ పడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సీజేపీ దెబ్బకు కేంద్ర మంత్రి వర్గం నుంచి సీనియర్ నేత ధర్మేంద్ర ప్రధాన్ ను ప్రభుత్వం తప్పించాల్సివచ్చింది. ఇప్పుడు సీజేపీ కార్యకర్తలు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ను టార్గెట్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయిందని అంటున్నారు.

సీజేపీ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా దేశ రాజధాని వ్యాప్తంగా దాదాపు 23 వేల మంది భద్రతా బలగాలను రంగంలోకి దించాయి. సున్నిత ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా సిబ్బంది, ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలిరాకుండా రవాణా వ్యవస్థపై కూడా కఠిన ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా ఢిల్లీ, నిజాముద్దీన్ స్టేషన్ల వైపు వచ్చే పలు మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. అలాగే భద్రతా అధికారుల ఆదేశాల మేరకు మొత్తం 57 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను రాత్రి 9:00 గంటల నుంచి మరుసటి రోజు రాత్రి 9:00 గంటల వరకు పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు.

ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో పాటు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలంటూ కాంగ్రెస్, ఇండియా కూటమి నాయకులు గత కొన్ని రోజులుగా వరుస ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనల సమయంలో చోటుచేసుకున్న అరెస్టులు, ఉద్రిక్తతల నడుమ తాజాగా సీజేపీ కూడా ఆందోళనకు దిగుతుండటంతో ఢిల్లీలో తీవ్ర భయాందోళనలు, హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.