Begin typing your search above and press return to search.

ఢిల్లీలో దంచికొట్టిన వాన.. దెబ్బకు 100 ఫ్లైట్లు ఆలస్యం

ఓవైపు దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మండే ఎండలతో దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి.

By:  Tupaki Desk   |   2 May 2025 12:44 PM IST
Delhi’s Unexpected Downpour Disrupts Flights, Traffic
X

ఓవైపు దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మండే ఎండలతో దేశ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ దేశ రాజధాని ఢిల్లీలో అనూహ్య వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. గంటకు 70-80 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.

భారీ ఎత్తున ఈదురుగాలులతో కుండపోతగా వాన కురిసింది. ఈ వర్షంతో ఢిల్లీ - ఎన్ సీఆర్ ప్రాంతం మొత్తం కాస్త ఉపశమనం లభించినప్పటికీ భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ వర్షాలతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో విమానాల రాకపోకలకు అంతరాయం చోటు చేసుకుంది. తీవ్రమైన గాలి దుమారంతో పాటు దంచికొడుతున్న వానలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

దాదాపు వంద విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో విమానాలు నలభై వరకు దారి మళ్లించారు. మరికొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో విమాన ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్నవేలాది మంది అవస్థలకు గురవుతున్నారు. ట్రావెల్ అలర్టుల్ని విమానయాన సంస్థలు ప్రయాణికులకు పంపుతున్నాయి. తాము ప్రయాణించాల్సిన విమానాల అప్డేట్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని చెబుతున్నారు.

రానున్న కొన్ని గంటల్లో ఉరుములు.. మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలోని పలు ప్రాంతాల్ని వర్షపు నీరు ముంచెత్తింది. ఢిల్లీకి సమీపాన ఉన్న హర్యానాలోనూ భారీ వర్షాలు కురిసాయి. అనూహ్యంగా మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు.