ఢిల్లీ హైకోర్టులో ‘కాక్రోచ్ పార్టీ’ విజయం.. ఎక్స్ లో మళ్లీ సందడి స్టార్ట్!
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఎక్స్ అకౌంట్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు ఎత్తివేసింది.
By: Tupaki Political Desk | 7 July 2026 3:21 PM ISTకాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఎక్స్ అకౌంట్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఢిల్లీ హైకోర్టు ఎత్తివేసింది. నీట్ యూజీ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో నెలకొన్న గందరగోళం కారణంగా సీజేపీ ఎక్స్ ఖాతాను నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలపగా, ప్రస్తుతం ఆ పరీక్షలు పూర్తయినందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కాక్రోచ్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణ సమయంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల సీజేపీ అకౌంటును నిషేధించినా ప్రస్తుతం ఆ పరిస్థితిని కొనసాగించాల్సిన అవసరం లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
గత మే నెలలో నీట్-యూజీ పరీక్షల పేపర్ లీక్ అవడం, ఆ తర్వాత దేశంలోని విద్యా వ్యవస్థలోని లోపాలు ఒక్కొక్కటిగా వెలుగుచూడటంపై సీజేపీ ఎక్స్ వేదికగా భారీ ఉద్యమం నిర్వహించింది. ప్రభుత్వంపై విమర్శలతో మొదలైన ఉద్యమం రోజుల వ్యవధిలోనే విస్తృత ప్రచారం, గుర్తింపు తెచ్చుకోవడంతో రాజకీయంగా వేడి పుట్టించింది. ఇదే సమయంలో నీట్ పేపర్ లీకు ఘటనతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది. ప్రభుత్వంపై మరింత ప్రెజర్ పెంచేలా కాక్రోచ్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై కేంద్రం కన్నెర్ర జేసిందని అంటున్నారు. దీంతో విద్యార్థుల్లో అయోమయం సృష్టిస్తున్నారన్న కారణంతో సీజేపీ అకౌంటును దేశంలో నిషేధించారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ తరఫున ఐటీ చట్టం సెక్షన్ 69(A) కింద సీజేపీ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేయించారు.
కాగా, కేంద్రం చర్యలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఏకపక్షంగా తన ఖాతాను నిలిపివేసిందని, ఇది భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. గత విచారణల్లో కోర్టు తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించినప్పటికీ, తాజా విచారణలో కీలక మలుపు చోటుచేసుకుంది. న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారించగా, కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ‘నీట్ పరీక్షలకు ముందు విద్యార్థుల మధ్య అలజడి సృష్టించే అవకాశం ఉన్నందున ఈ చర్య తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం పరీక్షలు ముగిసినందున అకౌంట్ అన్‌బ్లాక్ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ప్రాథమిక కారణాలు సమసిపోయినందున, ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను పరిష్కరించింది.
సీజేపీ అకౌంట్ నిలిపివేత తర్వాత, ఆ సంస్థ ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ పేరుతో కొత్త అకౌంట్ ద్వారా తన కార్యకలాపాలను కొనసాగించింది. ప్రస్తుతం లక్షలాది మంది అనుచరులతో, నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఈ వేదిక ఒక బలమైన యువజన ఉద్యమం కొనసాగిస్తోంది. ఇప్పుడు పాత అకౌంట్ కూడా పునరుద్ధరణ కావడంతో, ఈ డిజిటల్ ఉద్యమం మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
