స్కూల్స్ లో రీల్స్, షాట్ వీడియోస్ పై ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యా వ్యవస్థలో క్రమశిక్షణను పునరుద్ధరించే దిశగా ఒక గొప్ప అడుగు.
By: Tupaki Political Desk | 9 April 2026 3:23 PM ISTఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యా వ్యవస్థలో క్రమశిక్షణను పునరుద్ధరించే దిశగా ఒక గొప్ప అడుగు. ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ వాడకం ఎంత పెరిగిపోయిందంటే.. అది చివరికి విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పాఠశాలలను కూడా 'షూటింగ్ స్పాట్స్'గా మార్చేస్తోంది. విద్యార్థులే కాదు, బాధ్యతగా ఉండాల్సిన కొందరు ఉపాధ్యాయులు కూడా ఈ రీల్స్ మాయలో పడి బోధనను పక్కన పెడుతున్నారన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కొత్త నిబంధనలను జారీ చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో రీల్స్, షాట్స్ బ్యాన్..
చదువుల తల్లి కొలువైన పాఠశాల అంటే క్రమశిక్షణకు మారుపేరు. కానీ, ఇటీవలి కాలంలో సోషల్ మీడియా క్రేజ్ పుణ్యమా అని క్లాస్ రూమ్ బోర్డుల ముందు డ్యాన్సులు, బెంచీలపై వెకిలి చేష్టలతో కూడిన వీడియోలు నెట్టింట షేర్ అవుతున్నాయి. వ్యూస్ కోసం, లైక్స్ కోసం విద్యార్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేయడమే కాకుండా, పాఠశాల గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకున్న ఢిల్లీ ప్రభుత్వం, పాఠశాల సమయాల్లో సోషల్ మీడియా వీడియోల చిత్రీకరణపై కఠిన నిషేధం విధించింది. ఇకపై స్కూల్లో ఫోన్ తీసి రీల్స్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
టీచర్లకు కూడా
ఈ నిబంధన విద్యార్థులకే పరిమితం చేయలేదు, టీచర్లకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తరగతి గదుల్లో పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఉపాధ్యాయులు రీల్స్ చేస్తూ కనిపించడంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని, కానీ ఇలాంటి వెకిలి చేష్టల వల్ల విద్యా వాతావరణం దెబ్బతింటుందని ప్రభుత్వం భావిస్తోంది. స్కూల్ ఆవరణలో ఎవరైనా వీడియోలు చేస్తూ పట్టుబడితే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
విద్యా ప్రమాణాల పెంపునకే నిర్ణయం
విద్యాలయాలు అంటే జ్ఞాన సముపార్జన కేంద్రాలని, అక్కడ రీల్స్, షాట్స్ వంటి వినోద కార్యక్రమాలకు తావు లేదని ఢిల్లీ విద్యాశాఖ పేర్కొంది. తరచుగా వీడియోలు చేయడం వల్ల విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోందని, ఇది వారి పరీక్షల ఫలితాలపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం వల్ల తరగతి గదిలో అల్లరి పెరగడమే కాకుండా, సైబర్ బుల్లీయింగ్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ నిషేధం వల్ల విద్యార్థులు మళ్లీ చదువుపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రుల హర్షం
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘మా పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కి వెళ్తున్నారా లేక వీడియోలు తీసుకోవడానికి వెళ్తున్నారా అని మాకు భయంగా ఉండేది. ఈ నిబంధన వల్ల కనీసం స్కూల్ లో ఉన్నంత సేపైనా వారు ఫోన్లకు దూరంగా ఉంటారు’ అని పలువురు పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల్లో స్మార్ట్ ఫోన్ల వాడకంపై మరింత కఠినమైన నిబంధనలు ఉండాలని వారు కోరుతుండడం విశేషం.
ఇతర రాష్ట్రాల్లోనూ ..
ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇదే తరహా నిబంధనలను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పాఠశాలలను కేవలం చదువుకే పరిమితం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. టెక్నాలజీని అవసరానికి వాడుకోవాలి కానీ, అది మన సంస్కృతిని, క్రమశిక్షణను దెబ్బతీసేలా ఉండకూడదని విశ్లేషకులు సూచిస్తున్నారు.
పాఠశాలల్లో రీల్స్ అనేది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ, ఇది విద్యార్థుల భవిష్యత్తుకు అవసరం. ఆకర్షణలకు లోనయ్యే వయసులో విద్యార్థులు దారి తప్పకుండా చూడడం ఉపాధ్యాయుల, ప్రభుత్వాల బాధ్యత. ఢిల్లీ ప్రభుత్వం వేసిన ఈ అడుగు విద్యా రంగంలో మంచి మార్పునకు నాంది పలకాలని ఆశిద్దాం. ఈ నిబంధన ఎంతవ రకు పటిష్టంగా అమలు అవుతుందో వేచి చూడాలి.
