ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది మృతి, పలువురు గాయాలు.. భవనం పైనుంచి దూకిన మహిళ
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ విషాదం నెలకొంది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ రెస్టారెంట్ భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
By: A.N.Kumar | 3 Jun 2026 3:46 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం ఒక్కసారిగా భారీ విషాదం నెలకొంది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ రెస్టారెంట్ భవనంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 21 మంది సజీవదహనమవ్వగా, మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
ప్రాథమిక సమాచారం ప్రకారం.. మాలవీయ నగర్‌లోని ఒక ఐదంతస్తుల భవనం బేస్‌మెంట్‌లో ఉన్న ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’లో మొదట మంటలు ప్రారంభమయ్యాయి. చూస్తుండగానే ఈ మంటలు పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో భవనంలోని హోటల్ గదుల్లో దాదాపు 40 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. మంటలు, దట్టమైన పొగ కారణంగా వారు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు.
ప్రాణాలు కాపాడుకునేందుకు ఐదో అంతస్తు నుంచి దూకిన మహిళ
ఈ ప్రమాదంలో ఒక హృదయవిదారక దృశ్యం చోటుచేసుకుంది. లోపల మంటల తీవ్రతను తట్టుకోలేక, ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక మహిళ ఐదంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె భవనం పైనుంచి దూకుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బాధితుల్లో ఎక్కువ మంది విదేశీయులే!
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ముఖ్యంగా మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన పర్యాటకులు ఈ హోటల్ గదుల్లో బస చేశారని, దురదృష్టవశాత్తూ వారు ఈ ప్రమాదానికి బలియ్యారని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక రెస్టారెంట్‌లో భద్రతా ప్రమాణాలు పాటించలేదా? అనే కోణంలో పోలీసులు, ఫైర్ సిబ్బంది విచారణ జరుపుతున్నారు.
ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు.. గాయపడిన వారికి ₹50 వేలు పరిహారం ప్రకటించారు.
ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
