ఢిల్లీని ఈవీ రాజధానిగా మార్చే దిశగా మరో ముందడుగు!
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 May 2025 8:00 PM ISTప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రేఖా గుప్త ప్రభుత్వం త్వరలో ప్రజలకు ఒక పెద్ద శుభవార్త అందించబోతోంది. ఇది రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయనుంది. రాబోయే రెండు నెలల్లో రాజధాని రోడ్లపై 500 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయని ఢిల్లీ రవాణా శాఖ మంత్రి పంకజ్ సింగ్ శుక్రవారం తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రజా రవాణా వ్యవస్థలో చేర్చడంపై జరిగిన సమీక్షా సమావేశం తర్వాత రవాణా మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రాబోయే రెండు నెలల్లో 500 బస్సులు రానున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 1000 బస్సులను రోడ్లపైకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు.
రవాణా శాఖ మంత్రి పంకజ్ సింగ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. "మేము ప్రజా రవాణా వ్యవస్థను వేగంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాం. రాబోయే రెండు నెలల్లో ఢిల్లీ రోడ్లపై 500 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతాయి. ఈ ఏడాది చివరి నాటికి మరో 1,000 బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇది అందరికీ శుభ్రమైన, మరింత సౌకర్యవంతమైన రవాణా ఆప్షన్లను అందిస్తుంది" అని అన్నారు.
"కొత్త ఎలక్ట్రిక్ బస్సులను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. తద్వారా ప్రజలు ఆలస్యం లేకుండా వాటి బెనిఫిట్స్ పొందగలరు. ఈ బస్సులను ప్రజా రవాణాలో చేర్చడం ద్వారా ఢిల్లీని దేశంలోని ఈవీ రాజధానిగా మార్చే దిశగా మేము ఒక నిర్ణయాత్మకమైన అడుగు వేస్తున్నాము" అని ఆయన చెప్పారు. ఇటీవల ఢిల్లీ ప్రజా రవాణా వ్యవస్థలో దేవీ ఎలక్ట్రిక్ బస్సులు చేరాయి. ముఖ్యంగా వీటిని చిన్న రూట్లలో (సుమారు 12 కిలోమీటర్లు) నడుపుతున్నారు. పెద్ద బస్సులు తిరగడానికి ఇబ్బందిగా ఉండే ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి.
ఈ సమావేశంలో రవాణా శాఖకు చెందిన సీనియర్ అధికారులు, బస్సులను సరఫరా చేసే కంపెనీల ప్రతినిధులు (కన్సైనర్‌లు) పాల్గొన్నారు. పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీ, స్విచ్ మొబిలిటీ, జేబీఎం వంటి ప్రముఖ బస్సు కంపెనీల ప్రతినిధులు, రవాణా శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాను వేగవంతం చేయాలని, ఈ బస్సుల మెయింటెనెన్స్ కు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు అన్ని ప్రధాన డిపోలలో ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయాలని పంకజ్ సింగ్ బస్సు కన్సైనర్‌లను కోరారు.
వివిధ డిపోలలో నిర్మాణ పనులు, విద్యుదీకరణ ప్రక్రియ చివరి దశలో ఉందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం ఢిల్లీని దేశంలోని ఈవీ రాజధానిగా మార్చే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని మంత్రి అన్నారు. ప్రజలకు మంచి రవాణా సౌకర్యం త్వరగా అందుబాటులోకి వచ్చేలా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత ఏజెన్సీలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
