Begin typing your search above and press return to search.

మమత స్టాలిన్ చేతికి బ్రహ్మాస్త్రం చిక్కిందా ?

దేశంలో మరి కొద్ది నెలలలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అస్సాం బీజేపీ పాలనలో ఉంది, మిగిలినవి అన్నీ ఇండియా కూటమి ఏలుబడిలోనే ఉన్నాయి.

By:  Satya P   |   1 March 2026 4:00 AM IST
మమత స్టాలిన్ చేతికి బ్రహ్మాస్త్రం చిక్కిందా ?
X

దేశంలో మరి కొద్ది నెలలలో అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అస్సాం బీజేపీ పాలనలో ఉంది, మిగిలినవి అన్నీ ఇండియా కూటమి ఏలుబడిలోనే ఉన్నాయి. వీటిలో రెండు పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. మొదటిగా చెప్పాల్సి వస్తే పశ్చిమ బెంగాల్ అందులో ఉంది. ఏకంగా 294 సీట్లతో దేశంలో కీలకమైన స్టేట్ గా ఉంది. ఆ తరువత 234 సీట్లతో తమిళనాడు మరో కీలక రాష్ట్రంగా ఉంది. ఇక కేరళలో 140 సీట్లు ఉంటే అస్సాంలో 126 సీట్లు పాండిచ్చేరిలో 30 సీట్లు ఉన్నాయి. ప్రధానంగా పోరు చూస్తే బెంగాల్ తమిళనాడులోనే ఎన్డీయే వర్సెస్ ఇండియా కూటమిగా ఉంది.

ఢిల్లీ తీర్పుతో :

ఇదిలా ఉంటే ఒకనాడు దేశమంతా తీవ్ర సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ట్రయల్ కోర్టు ఈ కేసులో క్లీన్ చిట్ ని ఆప్ అధినేత మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా 21 మందికి ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ముఖ్యమైనవిగా ఉన్నాయి. సీబీఐ ఈ కేసులో దర్యాప్తు చేసిన విధానాన్ని తప్పు పట్టడం విశేషం. ఈ కేసులో ముందుగా నిర్ధారణకు వచ్చి ఒక పధకం ప్రకారం జరిగిన ప్రక్రియగా కోర్టు పేర్కొనడమే విశేషం. కేవలం కొందరు అప్రూవర్లుగా మారి ఇచ్చిన వాంగ్మూలాలే తప్పించి కేసులో కీలకమైన ఆధారాలను చూపించలేకపోయారు అని తప్పు పట్టింది. అయితే ఈ తీర్పుని సీబీఐ హైకోర్టులో సవాల్ చేసిన విషయం వేరేగా చూడాల్సి ఉంది.

కొండంత బలమేనా :

విపక్షాలను టార్గెట్ గా చేసుకుని కేంద్రంలోని పెద్దలు తమ చేతిలో ఉన్న దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు అని ఇప్పటిదాకా విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ట్రయల్ కోర్టు తీర్పుతో ఈ విమర్శలకు కొత్త బలం చేరినట్లుగా ఉందని అంటున్నారు. సీబీఐ ఈడీ సహా కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తుల విషయంలో ఇండియా కూటమి పార్టీలతో సహా విపక్షాలు అన్నీ మండిపడుతున్న నేపథ్యం ఉంది. దాంతో ఈ తీర్పు విపక్షాలకు మంచి ఆయుధంగా మారనుంది అని అంటున్నారు.

ఈసీ మీద పోరుతో :

ఇక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కానీ తమిళనాడు సీఎం స్టాలిన్ కానీ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సర్ పేరుతో చేపడుతున్న ఓట్ల ప్రక్షాళనలో విపక్ష ఓటర్లనే టార్గెట్ గా చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు మమతా బెనర్జీ అయితే ఒక అడుగు ముందుకేసి ఏకంగా తానే న్యాయవాది అవతారం ఎత్తి సుప్రీం కోర్టులో కేసుని వాదించారు. ఇపుడు అంది వచ్చిన అస్త్రంగా ఈ తీర్పు వచ్చింది. దాతో సీబీఐ మీద కూడా విపక్షాలు ఆరోపణలు చేయడమే కాదు కేంద్రంలో బీజేపీని కూడా లక్ష్యంగా చేసుకుని జనంలోకి దూసుకుని పోయే అవకాశాలు అధికంగా ఉంటాయని అంటున్నారు.

ఎన్నికల ముంగిట :

మరో వైపు చూస్తే ఎన్నికల ముంగిట కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఈ తీర్పు ఒకింత ఇబ్బందిగా మారనుంది అని అంటున్నారు. రాజకీయ ప్రేరేపితమైన కేసులలో విపక్షాలను ఇరికిస్తున్నారు అని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు కూడా జనంలో చర్చగా ఉన్నాయి. వాటిని ఆసరాగా చేసుకుని మమతా స్టాలిన్ రేపటి ఎన్నికల ప్రచారంలో కచ్చితంగా వాడుకుంటారు అని అంటున్నారు. అదే జరిగితే బీజేపీ ఏ విధంగా వాటిని తిప్పుకొడుతుంది అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా ఈ తీర్పు కీలకమైన రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ముందు రావడంతో విపక్షాలకు పదునైన ఆయుధమే అవుతుందని విశ్లేషణలు ఉన్నాయి.