సీఎంపై దాడిచేసిన వ్యక్తి మామూలోడు కాదు..
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పై షాకింగ్ దాడి జరిగింది. ఆమె అధికారిక నివాసంలో ప్రతి వారం జరుగుతున్న జనసున్వాయి కార్యక్రమం (ప్రజలతో ముఖాముఖి) సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 20 Aug 2025 3:37 PM ISTఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై షాకింగ్ దాడి జరిగింది. ఆమె అధికారిక నివాసంలో ప్రతి వారం జరుగుతున్న జనసున్వాయి కార్యక్రమం (ప్రజలతో ముఖాముఖి) సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.ఈ ఉదయం 9 గంటల సమయంలో రేఖా గుప్తా తన నివాసంలో ప్రజల సమస్యలు విన్నారు. విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ క్రమంలో 30 సంవత్సరాల వయసున్న రాజేష్ భాయ్ ఖీమ్జీ భాయ్ సకారియా అనే వ్యక్తి వినతిపత్రం ఇచ్చే నెపంతో ముందుకు వచ్చాడు. తన సమస్యలను వివరించిన తర్వాత అకస్మాత్తుగా సీఎం రేఖా గుప్తాపై దాడి చేశాడు.
మొదట ఆమె చెంపపై కొట్టడం, తర్వాత జుట్టు పట్టుకుని లాగడం జరిగింది. ఈ అనూహ్య పరిణామంతో అధికారులు, పోలీసులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
- దాడి వెనక కారణం
ప్రాథమిక దర్యాప్తులో రాజేష్ భాయ్ గుజరాత్‌లోని రాజ్ కోట్ కు చెందిన వాడని పోలీసులు గుర్తించారు. అతని బంధువులలో ఒకరు జైలులో ఉన్నారని, అతన్ని విడుదల చేయాలని పిటిషన్‌తో ఢిల్లీకి వచ్చాడని సమాచారం. అతని వద్ద నుండి కోర్టు సంబంధిత పత్రాలు కూడా లభించాయి.
గుజరాత్ మీడియా నివేదికల ప్రకారం రాజేష్ భాయ్ ఒక జంతు ప్రేమికుడు. వీధికుక్కల సమస్యపై కోర్టు తీర్పు వెలువడిన తర్వాత అతను ఢిల్లీకి ప్రయాణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో కూడా పలుమార్లు ఢిల్లీకి వెళ్లినట్లు అతని తల్లి తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా అతనికి మానసిక సమస్యలు ఉన్నట్లు సమాచారం.
- అధికారుల స్పందన
ఈ ఘటనపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రికి తలకు గాయమైందని బీజేపీ వర్గాలు ఆరోపించాయి. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
