Begin typing your search above and press return to search.

డాక్టర్‌ టెర్రరిజం.. దేశంలో ఉగ్రనెట్ వర్క్ తో వైద్యుల గూఢచర్యం

ఈ నెట్‌వర్క్‌లో మరో కీలక పేరు డా. షాహిన్‌ షాహిద్‌. ఆమె లఖ్‌నవూకు చెందిన వైద్యురాలు. జైషే మహ్మద్‌ సంస్థ మహిళా విభాగమైన జమాత్‌ ఉల్‌ మొమినాత్‌లో ఆమె ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.

By:  A.N.Kumar   |   11 Nov 2025 6:55 PM IST
డాక్టర్‌ టెర్రరిజం.. దేశంలో ఉగ్రనెట్ వర్క్ తో వైద్యుల  గూఢచర్యం
X

దేశ రాజధాని దిల్లీ మరోసారి ఉగ్రవాద భయంతో కకావికలమైంది. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటన వెనుక ఉన్న నెట్‌వర్క్‌ ఇప్పుడు భయానక చిత్రాన్ని బయటపెడుతోంది. వైద్య రంగంలో ఉన్న పలువురు డాక్టర్లు ఉగ్రవాద భావజాలంలో చిక్కుకుని తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్టు ఆధారాలు బయటకొస్తున్నాయి.

* డాక్టర్‌ ఉమర్‌ మహ్మద్‌ : ‘మానవ సేవ’ నుంచి ‘మరణ మిషన్‌’ వరకు

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన డాక్టర్‌ ఉమర్‌ మహ్మద్‌ ఒకప్పుడు రోగుల జీవితాలను రక్షించేవాడు. శ్రీనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌, అనంతనాగ్‌లో ఎండీ పూర్తి చేసిన ఈ యువ డాక్టర్‌ కొన్నేళ్లుగా ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలాహ్‌ మెడికల్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కానీ అదే సమయంలో సోషల్‌ మీడియా వేదికగా ఉగ్రవాద భావజాలానికి బలయ్యాడు.

జమ్మూ కశ్మీర్‌ పోలీసుల ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద ఆపరేషన్‌లో అరెస్టైన డాక్టర్‌ అదీల్‌తో ఉమర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలింది. అదీల్‌, ముజమ్మిల్‌, షాహిన్‌ వంటి వైద్యుల అరెస్ట్‌తో ఉమర్‌ తీవ్ర ఆందోళనకు గురై పరారీలోకి వెళ్లి చివరికి ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో కీలక పాత్ర పోషించినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

* ఎర్రకోట పేలుడు.. 48 గంటల్లో వెలుగులోకి వచ్చిన డాక్టర్‌ టెర్రర్‌ నెట్‌వర్క్‌

దిల్లీలో జరిగిన భారీ పేలుడు కేవలం ఒక్క ఘటన మాత్రమే కాదు. ఈ ఘటనతోపాటు దేశవ్యాప్తంగా 48 గంటల్లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లో ఐదుగురు వైద్యులు పాల్గొన్నట్టు కేంద్ర సంస్థలు కనుగొన్నాయి. వీరంతా జైషే మహ్మద్‌, అన్సార్‌ గజ్వత్‌ ఉల్‌ హింద్‌ వంటి నిషేధిత సంస్థలతో సంబంధం కలిగిన వారేనని అధికారులు చెబుతున్నారు.

జమ్మూ కశ్మీర్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన ఎనిమిది మందిలో ముగ్గురు డాక్టర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరి వద్ద నుంచి సుమారు 2,900 కిలోల పేలుడు పదార్థాలు, అమ్మోనియం నైట్రేట్‌, పొటాషియం నైట్రేట్‌, సల్ఫర్‌ స్వాధీనం చేసుకున్నారు.

* అదుపులో ఉమర్‌ కుటుంబం.. డీఎన్‌ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి

పేలుడు తర్వాత పోలీసులు ఉమర్‌ కుటుంబ సభ్యులను విచారణకు తీసుకున్నారు. ఆయన సోదరులు జహూర్‌, ఆషిక్‌ నబీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు కారణమైన కారులో కనుగొన్న శరీర భాగాలు ఉమర్‌వేనా అనే దానిపై డీఎన్‌ఏ పరీక్షలు జరుగుతున్నాయి.

* మహిళా విభాగంలో జైషే కుట్ర.. డా. షాహిన్‌ షాహిద్‌ కీలకం

ఈ నెట్‌వర్క్‌లో మరో కీలక పేరు డా. షాహిన్‌ షాహిద్‌. ఆమె లఖ్‌నవూకు చెందిన వైద్యురాలు. జైషే మహ్మద్‌ సంస్థ మహిళా విభాగమైన జమాత్‌ ఉల్‌ మొమినాత్‌లో ఆమె ముఖ్య బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. మసూద్‌ అజార్‌ సోదరి సాదియా అజార్‌ నేతృత్వంలో మహిళా ఉగ్రవాద బ్రిగేడ్‌లను ఏర్పాటు చేస్తున్న ఈ విభాగంలో షాహిన్‌ ప్రధాన నిర్వాహకురాలిగా పనిచేసిందని సమాచారం.

* దేశవ్యాప్తంగా కూంబింగ్‌ ఆపరేషన్‌.. ‘డాక్టర్‌ టెర్రరిజం’పై దృష్టి

ఫరీదాబాద్‌, లఖ్‌నవూ, కశ్మీర్‌, సహరన్‌పూర్‌ ప్రాంతాల్లో పోలీసులు భారీ తనిఖీలు చేపట్టారు. ఫరీదాబాద్‌లో 800 మందికిపైగా పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. మరో మహిళా వైద్యురాలు డాక్టర్‌ పర్వేజ్‌ అన్సారీని కూడా ఉగ్ర నెట్‌వర్క్‌తో సంబంధాలపై అరెస్టు చేశారు.

* భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ ప్రభావం.. ఉగ్ర మాడ్యూల్‌ తారుమారైంది

ఇటీవల భారత భద్రతా దళాలు నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌లో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబం కూలిపోయింది. ఈ నేపథ్యంలోనే ఉగ్ర సంస్థలు కొత్తగా మహిళా విభాగాలను రూపొందించి, వైద్యుల ద్వారా సొసైటీ లోపల చొరబడే ప్రయత్నం చేస్తున్నాయి.

ఒకప్పుడు “జీవితాలను రక్షించే దేవుళ్లు”గా పిలువబడిన వైద్యులు ఇప్పుడు “మరణ మిషన్లు”గా మారడం దేశానికి ఆందోళనకర సంకేతం. ఉగ్రవాదం కొత్త రూపం ఎత్తుకుంది. ఇది తుపాకీతో కాదు, స్టెతస్కోప్‌తో వచ్చే ముప్పుగా మారింది..

దేశ భద్రతా సంస్థలు ఇప్పుడు ఈ “డాక్టర్‌ టెర్రరిజం” నెట్‌వర్క్‌ను చెరిపేసేందుకు యుద్ధ స్థాయిలో చర్యలు ప్రారంభించాయి.