Begin typing your search above and press return to search.

చీకటి తెర వెనుక ‘వైట్ కాలర్’ కుట్ర.. ఢిల్లీ పేలుడు దర్యాప్తులో వణుకు పుట్టించే నిజాలు

ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో వెలుగు చూస్తున్న ప్రతి కొత్త కోణం దేశ భద్రతా వ్యవస్థకు పెను సవాల్ విసురుతున్నాయి.

By:  Tupaki Desk   |   21 Nov 2025 1:18 PM IST
చీకటి తెర వెనుక ‘వైట్ కాలర్’ కుట్ర.. ఢిల్లీ పేలుడు దర్యాప్తులో వణుకు పుట్టించే నిజాలు
X

ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో వెలుగు చూస్తున్న ప్రతి కొత్త కోణం దేశ భద్రతా వ్యవస్థకు పెను సవాల్ విసురుతున్నాయి. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలు సాధారణంగా తక్కువ చదువుకున్న వారు.. లేదంటే చదువులేని వారు చేస్తుండేవారు. ఇప్పుడు ఆ విధానం మారింది. డాక్టర్ ముసుగులో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ఉమర్ నబీ వంటి ఉన్నత విద్యావంతుల ప్రమేయం ఉగ్రకుట్రలకు ఉన్న విస్తృతమైన, అగాధమైన మూలాలను సూచిస్తోంది. దేశానికి సేవ చేయాల్సిన ‘వైట్ కాలర్’ వ్యక్తులు ఉగ్రవాద భావజాలాన్ని అంగీకరించి, విద్రోహక చర్యలకు పాల్పడడం నేటి ఉగ్రవాద నెట్‌వర్క్‌ల ప్రమాదకరమైన పరిణామానికి దర్పణం పడుతోంది.

బాంబుల తయారీకి 42 వీడియోలు..

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ హ్యాండ్లర్ హంజుల్లా నేరుగా డాక్టర్ ఉమర్‌కు బాంబుల తయారీకి సంబంధించిన 42 వీడియోలను పంపారన్న దర్యాప్తు వివరాలు.. అంతర్జాతీయ సరిహద్దుల గుండా ఉగ్రవాద శిక్షణ ఎంత సులువుగా అందుబాటులోకి వచ్చిందో స్పష్టం చేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం ఉగ్రవాదానికి శిక్షణా కేంద్రంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో, పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్ర సంస్థలు కేవలం సైద్ధాంతిక ప్రేరణతో ఆగకుండా, ప్రత్యక్ష కార్యాచరణకు అవసరమైన సాంకేతిక నైపుణ్యాన్ని డిజిటల్ మార్గాల ద్వారా అందజేస్తున్న తీరు ఆందోళనకరం. సైబర్ ప్రపంచం ఉగ్రవాద విస్తరణకు ఎంతటి బలమైన సాధనంగా మారిందో ఈ ఘటన నిరూపిస్తోంది.

బిర్యానీ, దావత్.. అంటే ఏంటి?

ఈ ఉగ్ర బృందం ఉపయోగించిన సీక్రెట్ కోడ్లు వారి కుట్రల నిర్వహణలో ఉన్న నైపుణ్యాన్ని, పకడ్బందీ ప్రణాళికను తెలియజేస్తున్నాయి. తమ కార్యకలాపాలు ఎవరికీ అనుమానం రాకుండా, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ‘బిర్యానీ’ (పేలుడు పదార్థాలు), ‘దావత్’ (ఉగ్ర ఘటనల అమలు) వంటి కోడ్ వర్డ్స్ ఉపయోగించడం వారి గోప్యత పద్ధతులను తేటతెల్లం చేస్తోంది. ఈ ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ తమ కార్యకలాపాలను అత్యంత వ్యూహాత్మకంగా, చట్టబద్ధమైన ముసుగులో నడిపిందనే వాస్తవం భద్రతా సంస్థలకు పెను సవాల్ విసురుతోంది. ముజమ్మిల్ షకీల్ ద్వారా ఉమర్‌తో సహా పలువురు వైద్యులు ఈ నెట్‌వర్క్‌లో చేరడం, ఉన్నత వర్గాల్లోనూ ఉగ్రవాదం చొచ్చుకుపోతున్న తీరును ఎత్తిచూపుతోంది.

తుర్కియేలో ఆపరేటింగ్ మీటింగులు..

ఉగ్రదాడులకు కొన్నేళ్లుగా ప్రణాళికలు రచిస్తూ.. ఏకంగా తుర్కియేలో సిరియా ఆపరేటివ్‌తో సమావేశాలు నిర్వహించడం, వారి అంతర్జాతీయ నెట్‌వర్క్‌ బలం, దాడులపై వారి నిబద్ధతను తెలియజేస్తుంది. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లోని అత్యంత కీలకమైన, రద్దీగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా పేలుడు జరగాలని వారు అనుకున్నారు. అంతేకాకుండా, ఈ దాడుల కోసం ఏకంగా 200 శక్తివంతమైన IEDలను సిద్ధం చేయడం, కార్లను కొనుగోలు చేయడం వంటి చర్యలు.. కుట్ర తీవ్రతను, వినాశకరమైన ఉద్దేశాలను బహిర్గతం చేస్తున్నాయి. ఈ కుట్రను భగ్నం చేయడంలో దర్యాప్తు సంస్థల కృషి అభినందనీయమే.. అయినప్పటికీ, అల్-ఫలా విశ్వవిద్యాలయం వంటి సంస్థలపై దర్యాప్తు జరపడానికి సిట్ ఏర్పాటు చేయడం, ఈ ఉగ్రవాద నెట్‌వర్క్ విద్యాసంస్థల్లోకి కూడా చొచ్చుకుపోయిందనే అనుమానాన్ని బలపరుస్తోంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఈ చీకటి కుట్రల మూలాలను పూర్తిగా పెకిలించేందుకు నిరంతర నిఘా, కఠినమైన చర్యలు అనివార్యం.