Begin typing your search above and press return to search.

అక్కడ మంత్రివర్గంలో చోటు అంటే జాక్ పాటే !

దేశంలోని రాష్ట్రాలలో మంత్రివర్గం కూర్పునకు మొత్తం సీట్లలో 15 శాతాన్ని తీసుకుని నియమించుకుంటారు. అది అక్కడ నిబంధన.

By:  Tupaki Desk   |   18 Feb 2025 5:00 AM IST
అక్కడ మంత్రివర్గంలో చోటు అంటే జాక్ పాటే !
X

సగటు రాజకీయ నేతలకు ముందు అసెంబ్లీకి దారి కావాలి. అంటే టికెట్ దక్కాలి. తీరా గెలిచిన తరువాత మంత్రివర్గంలో చోటు దక్కాలి. అపుడే వారు అనుకున్న టార్గెట్ ని రీచ్ అయినట్లు. ఇక ఎక్కువ మంది ఆశావహులు ఉన్నా అనేక దఫాలుగా అధికారానికి నోచుకోకుండా ఒకసారి పవర్ చేతిలో పడినా ఆశావహుల లెక్క పీక్స్ లో ఉంటుంది.

ఇపుడు ఢిల్లీలో అదే జరుగుతోంది అని అంటున్నారు. బీజేపీ 1998 తర్వాత మళ్ళీ 2025లో అధికారం దక్కింది. అంటే ఏకంగా 27 ఏళ్ళ తరువాత అన్న మాట. చెప్పాలంటే ఇది సుదీర్ఘమైన సమయం. అనేక ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలు అయినా మొక్కవోని దీక్షలో బరిలో ఉండడం, అలాగే తమ నియోజకవర్గాలలో బలం కాపాడుకుంటూ ఉండడం అంటే ఎంతటి శ్రమ పరిశ్రమ వెనకాల ఉన్నాయో చెప్పాల్సింది లేదు.

ఆ విధంగా చూస్తే బీజేపీ నుంచి మొత్తం 48 మంది ఎమ్మెల్యేలు ఈసారి గెలిచారు. డెబ్బై మంది సభ్యులు కలిగిన ఢిల్లీ శాసనసభలో మంత్రులుగా ఎంతమందిని తీసుకోవచ్చు అంటే దానికి కచ్చితమైన నిబంధనలు ఉన్నాయని తెలుస్తోంది. దేశంలోని రాష్ట్రాలలో మంత్రివర్గం కూర్పునకు మొత్తం సీట్లలో 15 శాతాన్ని తీసుకుని నియమించుకుంటారు. అది అక్కడ నిబంధన.

కానీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఢిల్లీ అసెంబ్లీ విషయంలో చూస్తే కనుక ఇక్కడ మొత్తం సీట్లలో పది శాతం మాత్రమే మంత్రులుగా నియమించుకోవాల్సి ఉంటుంది. ఇది కేంద్ర పాలిత ప్రాంతాలలోని అసెంబ్లీలకు ఉన్న నిబంధన. ఆ విధంగా చూస్తే కనుక ఢిల్లీ అసెంబ్లీకి 70 మంది ఉంటే ఏడుగురు మాత్రమే మంత్రులుగా ఉంటారు అన్న మాట.

ఇందులో ఒకరు ముఖ్యమంత్రిగా ఉంటే ఆరుగురికి మంత్రులుగా అవకాశం లభిస్తుంది. దీంతో బీజేపీలో ఆశావహులు చాలా పెద్ద ఎత్తున ఉండడంతో ఎవరికి ఈ అదృష్టం దక్కుతుంది అనంది చర్చగా ఉంది. బీజేపీ నుంచి గెలిచిన మొత్తం 48లో మెజారిటీ ఎమ్మెల్యేలు సీనియర్ నేతలుగా ఉన్నారు. వారంతా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. దాంతో ఈ లెక్క తేల్చడం అధిష్టానానికి కష్టమైన పనే అని అంటున్నారు.

మొత్తం 48లో ఆరుగురు మంత్రులు అంటే ప్రతీ ఏడుగురిలో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందన్న మాట. ఆ విధంగా కేబినెట్ బెర్త్ ని దక్కించుకున్న వారు జాక్ పాట్ కొట్టినట్లే అని అంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులోనూ చాలా మంది ఉండడం ఈసారి విశేషం. అందుకే ఈ నెల 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ భారీ కసరత్తునే చేస్తోంది అని అంటున్నారు.

ఇక ఈ నెల 20న రాం లీలా మైదానంలో ఢిల్లీ కొత్త ప్రభుత్వం ప్రమాణం చేస్తుందని తెలుస్తోంది. మంత్రులు మొత్తం అదే రోజున ప్రమాణం చేస్తారు. ఇందులో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారని చెబుతున్నారు. అంగరంగ వైభవంగా ఈ ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్డీయే పాలిత ముఖ్యమంత్రులతో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరు కాబోతున్నారు.