Begin typing your search above and press return to search.

నగ్న నిరసన సరే.. నిఘా ఫెయిల్యూర్ కాదా మోడీజీ?

ఈ తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఏమిటీ నగ్న రాజకీయాలు అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

By:  Garuda Media   |   24 Feb 2026 5:00 PM IST
నగ్న నిరసన సరే.. నిఘా ఫెయిల్యూర్ కాదా మోడీజీ?
X

పలువురు దేశాధినేతలు.. దిగ్గజ ఐటీ.. ఏఐ కంపెనీలకు చెందిన సీఈవోలు.. అధినేతలు హాజరైన ఏఐ సమిట్ లో యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలైన నలుగురు తాము చేపట్టిన నిరసనలో భాగంగా అర్థనగ్న ప్రదర్శన చేయటం షాకింగ్ గా మారింది. ఎందుకంటే.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమానికి భద్రతా ఏర్పాట్లు ఎంత కట్టుదిట్టంగా.. భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఒక జాతీయ పార్టీకి చెందిన నలుగురు సింఫుల్ గా ఎంట్రీ ఇచ్చేయటమే కాదు.. నేరుగా ఏఐ సమిట్ జరిగే ప్రదేశానికి వచ్చి.. అతిధులకు కూతవేటు దూరంలో నిరసన చేపట్టటం.. తమ చొక్కాలు విప్పదీసి నినాదాలు చేయటం కలకలాన్ని రేపింది.

ఈ తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఏమిటీ నగ్న రాజకీయాలు అంటూ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. పోలీసులు సైతం ఈ నలుగురిని.. వీరికి సహకారం అందించిన మరో ముగ్గురితో పాటు మొత్తంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ ప్రశ్నేమంటే.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన కార్యక్రమానికి ఇంత సింఫుల్ గా ఎలా వెళ్లగలిగారు? అదెలా సాధ్యమైంది? అన్నప్పుడు నకిలీ క్యూఆర్ కోడ్ లు.. నకిలీ పాస్ లతో ఎంట్రీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఒక్కసారి యూత్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల స్థానంలో కరుడుగట్టిన తీవ్రవాదుల్ని ఊహించుకోండి. వారు సైతం ఇదే తరహాలో లోపలకు ఎంట్రీ ఇచ్చారనే అనుకోండి. వారు తాము అనుకున్న లక్ష్యానికి చేరుకొని.. తాము ఏదైతే విధ్వంసాన్ని క్రియేట్ చేయాలని చూస్తే..? అన్న ప్రశ్నకు తడారిపోతుంది. టెన్షన్ పుట్టుకురావటం ఖాయం. ఇదంతా ఎందుకు చెప్పినట్లు? అన్న క్వశ్చన్ రావొచ్చు. దానికి సమాధానం ఏమంటే.. యూత్ రాజకీయ నేతలు, కార్యకర్తలు కాబట్టి.. అనూహ్య నిరసనలు చేపట్టారు. అదే.. ఆ ముసుగులో భారత శత్రువులు ఎంట్రీ ఇచ్చి ఉంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వస్తేనే హడలిపోవటం ఖాయం.

ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? దీనికి కారకులు ఎవరు? అన్న ప్రశ్నలు మదిలో మెదిలితే.. కేంద్రంలోని మోడీ సర్కారు గుర్తుకు రాక మానదు. ఎందుకంటే..ఈ తరహా నిరసనను నిఘా వర్గాలు ఎందుకు పసిగట్టకలేకపోయాయి? అన్నది ఒక ప్రశ్న అయితే.. మరో అంశం తప్పుడు క్యూఆర్ కోడ్ లతో ఎలా ఎంట్రీ అయ్యారు? అలాంటి తప్పుల్ని.. మోసాల్ని గుర్తించాల్సిన వ్యవస్థలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అన్నది ప్రశ్నలు. ఇంత సింఫుల్ గా.. ఎంతో ప్లాన్ తో వేసిన ఈ పథకం అమలును చూస్తే.. మన నిఘా వ్యవస్థ.. మన సెక్యూరిటీ వ్యవస్థలోని లోపాలు ఇట్టే కనిపిస్తాయి. అలాంటప్పుడు ఈ వైఫల్యానికి బాధ్యులుగా ఎవరిని నియమించారు? అన్నది అన్నింటికంటే పెద్ద ప్రశ్న. రాజకీయ శత్రువులపై విమర్శలు గుప్పించటం.. వారి తీరును ప్రశ్నించే కన్నా.. భద్రతా లోపాలు కుప్పలుకుప్పలుగా ఉన్న విషయాన్ని ప్రధాని నరేందర మోడీ ఫోకస్ చేస్తే మంచిది. అదే సమయంలో భద్రతా లోపాలకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా వివరణ ఇవ్వటం మంచిదిగా చెప్పక తప్పదు.