డీహైడ్రేషన్ చికిత్సకు ఎలక్ట్రల్ పౌడర్ అవసరం లేదు.. మంచి నీళ్లు చాలు!
మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో మూత్రపిండాలు కీలకం. ఇవి రక్తాన్ని వడపోసి, వ్యర్థాలను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
By: Sivaji Kontham | 5 April 2026 1:00 AM ISTఎలక్ట్రల్ పౌడర్ ద్రావణం తీసుకుంటేనే డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోగలం! అనే ఒక ప్రచారాన్ని ఊకదంపుడుగా సాగుతోంది. కానీ అది నిజమా? అలా చేయకపోతే మనిషి చనిపోతాడా? అంటే.. అందులో నిజం లేదు. అసలు డీహైడ్రేషన్ ఎందుకు అవుతుంది? అంటే శరీరంలో నీరు లేకపోవడం వల్లనే అనే విషయం తెలుసుకుంటే చాలు. నీరు తగినంత స్వీకరించడం మనిషి అలవాటు చేసుకోవడం ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు. మండే వేసవి కాలం అలవాట్లు సరిగా ఉండటం ముఖ్యం.
మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాలలో మూత్రపిండాలు కీలకం. ఇవి రక్తాన్ని వడపోసి, వ్యర్థాలను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ కిడ్నీలు సజావుగా పనిచేయడానికి ప్రధానంగా కావాల్సింది నీరు. ఉదయాన్నే నిద్రలేవగానే గ్లాసు నీటిని తాగడం వల్ల రాత్రంతా నీరు లేక డీహైడ్రేషన్ కు గురైన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది కిడ్నీలు తమ దైనందిన పనిని సమర్థవంతంగా ప్రారంభించడానికి అవసరమైన ప్రేరణను ఇస్తుంది.
నీరు తగినంతగా తాగడం వల్ల కిడ్నీల్లోని నెఫ్రాన్లు రక్తాన్ని వడపోసి.. వ్యర్థాలను, అదనపు ఖనిజాలను మూత్రం ద్వారా సులభంగా బయటకు పంపుతాయి. ఒక వ్యక్తి రోజుకు కనీసం మూడు లీటర్ల మూత్ర విసర్జన చేసేలా నీరు తీసుకోవడం ఆరోగ్యకరమైన కిడ్నీలకు సంకేతం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు (డీహైడ్రేషన్), కిడ్నీలు వ్యర్థాలను వడపోసే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇది కాలక్రమేణా కిడ్నీ వ్యాధులకు .. ముఖ్యంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి కి దారితీసే ప్రమాదం ఉంది.
నీటి కొరత వల్ల రక్తపోటుపై కూడా ప్రభావం పడుతుంది. డీహైడ్రేషన్ సమయంలో కిడ్నీలు `రెనిన్` అనే ఎంజైమ్‌ను విడుదల చేసి రక్తపోటును పెంచుతాయి. ఇది కిడ్నీలపై అదనపు భారాన్ని మోపుతుంది. అలాగే తగినంత నీరు తాగడం వల్ల మూత్రంలో లవణాలు పేరుకుపోకుండా ఉండి.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ముప్పు తగ్గుతుంది. నీరు రక్త పరిమాణాన్ని స్థిరంగా ఉంచి.. గుండెపై ఒత్తిడిని తగ్గించి.. కిడ్నీలకు రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది.
నీరు తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం ఎంతో ముఖ్యం. దీని కోసం `హాబిట్ స్టాకింగ్` పద్ధతిని అనుసరించవచ్చు. అంటే.. బ్రష్ చేయడం వంటి పనులతో పాటు నీరు తాగడాన్ని మరువకూడదు. అలాగే ఉదయం వేళ కాఫీ లేదా గ్రీన్ టీ వంటివి తీసుకునే వారు.. వాటితో పాటు తగినంత నీరు తాగడం మర్చిపోకూడదు. ముఖ్యంగా గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల ఆరోగ్యానికి తోడ్పడతాయి. అయితే కృత్రిమ చక్కెరలు ఉండే సోడాలు, స్వీట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండటం కిడ్నీలను డయాబెటిస్ ముప్పు నుండి కాపాడుతుంది.
కిడ్నీల ఆరోగ్యం అనేది మన జీవనశైలి, ఆహార నియమాలపై ఆధారపడి ఉంటుంది. సమతుల్య ఆహారం ముఖ్యం. పండ్లు, కూరగాయలు కిడ్నీలకు మేలు చేస్తాయి. వయసు పైబడిన వారు, డయాబెటిస్ , అధిక రక్తపోటు ఉన్నవారు క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఖరీదైన హెల్త్ డ్రింక్స్ కంటే స్వచ్ఛమైన నీరే కిడ్నీలకు అత్యుత్తమ ఔషధమని గుర్తించి తగినంత హైడ్రేషన్ నియమాలు పాటించడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
