రక్షణ సిబ్బంది బుక్స్ రాయాలంటే....సరికొత్త నిబంధనలు ?
ఏ దేశానికి అయినా రక్షణ రంగం అత్యంత కీలకమైనది. రక్షణ రంగం సక్రమంగా ఉంటే మిగిలినవి అన్నీ బాగా ఉంటాయి.
By: Satya P | 13 Feb 2026 5:00 AM ISTఏ దేశానికి అయినా రక్షణ రంగం అత్యంత కీలకమైనది. రక్షణ రంగం సక్రమంగా ఉంటే మిగిలినవి అన్నీ బాగా ఉంటాయి. ముందు దేశం భద్రంగా ఉండాలి. ఆ తరువాతనే అన్నీ వస్తాయి. అత్యంత సున్నితమైన అంశంగా జాతీయ భద్రత ఉంటుంది. అయితే రక్షణ రంగంలో ఉన్నత స్థానాలలో పనిచేసిన వారికి అన్ని విషయాలూ తెలుస్తాయి. వారు పదవీ విరమణ చేసిన తరువాత తమ అనుభవాలను ఆత్మకథ రూపంలోనో మరో దాని పేరిటనో బుక్స్ తీసుకుని వస్తున్నారు. ఈ బుక్స్ ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ఎందుకంటే దేశ రక్షణ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు, మీడియాకు కూడా సమాచారం ఎక్కడా పొక్కదు, అంత రహస్యంగా ఉంచగలిగితేనే దేశ రక్షణ అంత సజావుగా సాగుతుంది.
అత్యంత సున్నితమైనవి :
అయితే పదవీ విరమణ చేసిన తరువాత కొందరు మంచి ఉద్దేశ్యంతో లేదా అతి ఉత్సాహంలో లేదా రాసే పుస్తకాలకు డిమాండ్ ఉంటుంది. అయితే రక్షణ రంగానికి సంబంధించి కీలక వ్యవహారాలు ఆ విధంగా బయటకు కొన్ని అన్యాపదేశంగా వచ్చేస్తూంటాయి. కొన్ని సార్లు ప్రభుత్వాలనే ఇబ్బంది పెడుతూంటాయి. తాజాగా చూస్తే మాజీ సైన్యాధిపతి జనరల్ ఎం ఎం నరవణె రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం లోక్ సభలో ఎంతటి వివాదం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ పుస్తకం ప్రచురణకు అనుమతి లభించలేదని ప్రభుత్వం ఒక వైపు చెబుతోంది, కానీ విపక్షం చేతిలో పుస్తకం ఉంది. దాన్ని ఆసరాగా చేసుకుని పార్లమెంట్ లో అధికార పక్షం మీద రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దాంతో ఎన్డీయే ప్రభుత్వం ఇరకాటంలో పడిపోవాల్సి వచ్చింది.
బడ్జెట్ సెషన్ లో రచ్చ :
ఈ క్రమంలో బడ్జెట్ సెషన్ అంతా రాజకీయ రచ్చగా మారింది. జాతీయ భద్రతను రాజకీయాలకు వాడుకోవాలని చూడడం బాధాకరమని కేంద్ర ప్రభుత్వం పెద్దలు అంటున్నారు. అయితే తాను ప్రస్తావించిన అంశాలకు ప్రభుత్వం జవాబు చెప్పాలని ప్రతిపక్షం అంటోంది. ఈ విధంగా లోక్ సభలో ప్రతిష్టంబన ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంటోంది అని ప్రచారం అయితే సాగుతోంది.
కచ్చితమైన మార్గదర్శకాలు :
ఇక మీదట రక్షణ శాఖకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న వారు కానీ లేదా పదవీ విరమణ చేసిన వారు కానీ తాము పుస్తకాలు రాయాలని అనుకుంటే మాత్రం వారు కచ్చితంగా పాటించాల్సిన కొన్ని నిబంధనలు మార్గదర్శకాలను రూపొందించాలని రక్షణ శాఖ భావిస్తోంది అని అంటున్నారు. దేశ భద్రత అత్యంత కీలకం సున్నితమైన వ్యవహారం కావడంతో వాటికి సంబంధించిన వ్యవహారాలు ఏవీ లీక్ కాకుండా ఉండేలా ఒక దృఢమైన కార్యాచరణను ఒక స్పష్టమైన గైడ్ లైన్స్ ని రూపొందించాలని కేంద్ర రక్షణ శాఖ ఆలోచిస్తోంది అని ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే మాత్రం దేశానికి దేశ రక్షణకు ఎంతో మేలు చేస్తుంది అని అంటున్నారు. అధికారులు, పదవులు అన్నీ అశాశ్వతం కానీ దేశ రక్షణ ఎప్పటికీ శాశ్వతం కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సి ఉంది.
