Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... "డీప్‌ ఫేక్‌"ని ఇలా గుర్తించండి.. అలా జాగ్రత్త పడండి!

అవును... ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంతమందిని పెడదారి పట్టిస్తే.. మరికొంతమంది పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తుంది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 4:18 AM GMT
వైరల్ ఇష్యూ... డీప్‌  ఫేక్‌ని ఇలా గుర్తించండి.. అలా జాగ్రత్త పడండి!
X

గత రెండు రోజులుగా ప్రముఖ నటి రష్మిక మార్ఫింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఏది రియల్.. ఏది ఫేక్ అనేది అతిపెద్ద ప్రశ్నగా మార్చిన వీడియోగా ఇప్పుడు ట్రెండ్ అవుతుంది! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజె న్స్‌ (ఏఐ) చేసే జిమ్మిక్కుల్లో ఇదొకటి అని కొట్టిపారేయలేని పరిస్థితి ఇప్పుడు సభ్యసమాజంలో నెలకొంది. దీంతో సెలబ్రిటీల నుంచి సామాన్య మహిళల వరకూ ఇప్పుడు ఈ కొత్త "డీప్ ఫేక్" టెన్షన్ చుట్టుముడుతుంది!

అవును... ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొంతమందిని పెడదారి పట్టిస్తే.. మరికొంతమంది పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తుంది. దీనికి తాజా సాక్ష్యమే రష్మిక మార్ఫింగ్ వీడియో! దీనిపై అమితాబ్ వంటివారూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రిత్వ శాఖ సీరియస్ కామెంట్స్ చేసింది. దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఈ సమయంలో అసలు డీప్ ఫేక్ అంటే ఏమిటి.. దీని బారిన పడకుండా తీసుకొవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం!

ఏమిటీ డీప్ ఫేక్:

సాధారణంగా ఫోటోషాప్ వంటి టూల్స్ తో ఒకరి బాడీకి మరొకరి ఫేస్ పెట్టి మార్ఫింగ్ చేయడం తెలిసిందే! అది అప్పుడు!! ఇప్పుడు ఏఐ ఎఫెక్ట్ తో పూర్తిస్థాయిలో నకిలీ వీడియోలు చెయ్యొచ్చు! ఫెర్ఫెక్ట్ గా ఒక వ్యక్తికి డూప్ వీడియోని నచ్చినట్లుగా తయారుచేయొచ్చన్నమాట. ఇది ఏఐ వంటి టెక్నాలజీతో చాలా ఇజీ అయిపోయిందని అంటున్నారు.

అయితే... రియాలిటీకి ఎంత దగ్గరగా ఈ నకిలీలను రూపొందించాలని ప్రయత్నించినప్పటికీ నకిలీలను గుర్తుంచడం మరీ కష్టమైన పనేమీ కాదని అంటున్నారు నిపుణులు. ఈ విషయంలో కాస్త సూక్ష్మ పరిశీలన అవసరం అనేది వారి మాటగా ఉంది.

డీప్ ఫేక్ లో ఒరిజినల్ తేడాలు ఎలా పసిగట్టాలి?:

సాధారణంగా ఎవరైనా తమకు సంబంధించిన ఏదైనా అసభ్యకరమైన వీడియో కానీ ఫొటో కాని కనిపిస్తే పానిక్ అయిపోతారు. మరికొంతమంది సూసైడ్ దిశగా కూడా ఆలోచిస్తారు. అయితే అలా కాకుండా... ఒక్క క్షణం ఆగి కాస్త నిశితంగా ఆలోచించగలిగితే నకిలీలో ఉన్న విషయాలు గమనించవచ్చని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... కళ్ల కదలికల్ని బట్టి డీప్‌ ఫేక్‌ వీడియోల్ని సులువుగా గుర్తింంచ వచ్చు అని అంటున్నారు నిపుణులు. సాదారణంగా మనిషి మాట్లాడె వీడియోల్లో మాటలు, చేతుల కదలికలు, కళ్ల కదలికలు ఒకే అర్ధాన్ని సూచించేవిగా ఉంటాయి. కానీ... డీప్ ఫేక్ వీడియోలో కాస్త విభిన్నంగా ఉంటాయి. మాటలకూ కళ్ల కదలికలకూ పొంతన ఉండదు. దీంతో నకిలీలను అలా గుర్తించొచ్చు!

ఇదే సమయంలో ఆడియో విషయంలో కూడా ఓరిజినల్ కు నకిలీకి తేడా కనిపెట్టొచ్చని అంటున్నారు నిపుణులు. డీప్‌ ఫేక్‌ వీడియోలకు జత చేసిన ఆడియోను కాస్త సునిశితంగా పరిశీలిస్తే.. ఆడియోలోని క్వాలిటీకి, వీడియో లోని కంటెంట్‌ కు తేడాలుండడం గమనించచ్చంటున్నారు నిపుణులు. డీప్ ఫేక్ లో ఈ రెండూ కచ్చితంగా కలవడమనేది దాదాపు అసాధ్యమని అంటున్నారు.

ఇదే సమయంలో ఆ వీడియోలోని ఉన్న శరీర భాగాలకు, అమర్చిన మరొకరి ముఖానికీ పొంతన కుదరదని చెబుతున్నారు. ఉదాహరణకు లావుగా ఉన్న బాడీకి సన్నగా ఉన్నవారి ముఖం పెట్టడం.. సన్నగా ఉన్నవారికి బొద్దుగా ఉన్న ముఖం పెట్టడం వంటివి! ఈ సమయంలో కూడా కాస్త నిశితంగా పరిశీలిస్తే ఆడ్ గా ఉన్న విషయం అర్ధమైపోతుందని చెబుతున్నారు.

ఫేక్ అని గమనించాక ఏమి చేయాలి?:

ఇలా అన్నీ గమనించిన తర్వాత ఆ వీడియో ఫేక్‌ అనే అనుమానం కలిగినా, ఆల్ మోస్ట్ నిర్ధారణకు వచ్చేసినా... దాన్ని రుజువు చేసుకోవడానికి ఒక ఉపాయం చెబుతున్నారు నిపుణులు. ఇందులో భాగంగా... గూగుల్‌ లో "సెర్చ్‌ బై ఇమేజ్‌" ఆప్షన్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

దీనికోసం ఆ వీడియోని స్క్రీన్‌ షాట్‌ తీసి.. ఆ ఇమేజ్ ని అప్‌ లోడ్‌ చేస్తే దానికి సంబంధించిన వీడియోలన్నీ కనిపిస్తాయి. దీంతో ఏది ఒరిజినల్ ఏది డూప్లికెట్ అనేది స్పష్టమవుతుందని చెబుతున్నారు. అనంతరం ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, కంగారు పడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి!

ముందు జాగ్రత్త చర్యలు ఏమిటి?:

మారుతున్న సమాజంలో ఒక వ్యక్తి ఫోటోలు హైడ్ చేయడం కష్టమైపోయిందనేది చాలా మంది చెబుతున్న మాట. ఒకప్పుడు ఇతరుల ఫోటో కనిపించాలంటే ఇంట్లో పేరెంట్స్ దగ్గర మాత్రమే ఉండేది! ఇప్పుడు ఎక్కడబడితే అక్కడ దర్శనమిస్తున్న పరిస్థితి. అందుకు ప్రధాన కారణం... సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం! ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు మస్ట్ అండ్ షుడ్ అంటున్నారు నిపుణులు.

ఇందులో భాగంగా... ప్రధానంగా సోషల్‌ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్స్‌ చేసుకోవడం ముఖ్యం. అందులో... నమ్మకమైన వ్యక్తులకు, బాగా తెలిసిన వారికి మాత్రమే అకౌంట్‌ డిటైల్స్ కనిపించేలా సెట్‌ చేసుకోవాలి. ఫలితంగా ఫోటోలు, వీడియోలూ మరీ బహిరంగం కాకుండా ఉంటుంది.

అంతకంటే ముందు... కొన్ని ఫోటోలను షేర్ చేస్తున్నప్పుడు అవి అందరూ చూడడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని క్లారిటీకి వచ్చిన తర్వాతే సోషల్ మీడియాలో షేర్ చేయడం అత్యంత ప్రధానం అని గుర్తించాలి. ఈ సమయంలో ఏదైనా ఫోటో లేదా వీడియోకి ఎవరైనా నెగిటివ్, వల్గర్ కామెంట్స్ పెడితే వెంటనే సంబంధిత వ్యక్తిని బ్లాక్ చేయాలి.

ఇదే సమయంలో ఉచితంగా లభించే వైఫై నెట్‌ వర్క్‌ ని వీలైనంత వరకూ సోషల్ మీడియా సైట్స్ లో లాగిన్ అయ్యేటప్పుడు వాడకపోవడం మంచిదని చెబుతున్నారు. ఫలితంగా పాస్ వర్డ్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందనేది నిపుణుల మాటగా ఉంది. అదేవిధంగా అన్ నోన్ నెంబర్స్ నుంచి వచ్చే మెసేజ్ లు ఓపెన్ చేయడం, వాటిలో ఉన్న లింక్స్ పై క్లిక్ చేయడం ఏమాత్రం సరైన ఆలోచన కాదని సూచిస్తున్నారు.

ఇలాంటి మెలుకువలు పాటిస్తూ.. ఎప్పడికప్పుడు అప్ డేట్ అవుతూ.. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే... ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని సూచిస్తున్నారు నిపుణులు!