Begin typing your search above and press return to search.

ప్రాంతీయ పార్టీలు మటాష్ !

భారత దేశం అంటేనే భిన్న పాంతాలు భిన్న మతాలు భిన్న ఆచారాలు. అందుకే ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా ఆయా చోట్ల ప్రాంతీయ పార్టీలు పుట్టుకుని వచ్చాయి.

By:  Satya P   |   15 Jun 2026 6:00 PM IST
ప్రాంతీయ పార్టీలు మటాష్ !
X

భారత దేశం అంటేనే భిన్న పాంతాలు భిన్న మతాలు భిన్న ఆచారాలు. అందుకే ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా ఆయా చోట్ల ప్రాంతీయ పార్టీలు పుట్టుకుని వచ్చాయి. దేశానికి స్వాతంత్ర్యం 1947లో వస్తే 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగితే మరో పదేళ్ళకు దేశంలో ప్రాంతీయ పార్టీలు వచ్చాయి అంటే వాటిని ప్రజల ఆకాంక్ష గానే చూడాలని అంటున్నారు. జాతీయ స్థాయిలో సమాఖ్యగా కేంద్ర ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలలో ప్రజల మనోభావాలకు తగినట్లుగా ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు కావడం సహేతుకమే అన్న వాదన కూడా ఉంది. అయితే ఇప్పటికి ఆరున్నర దశాబ్దాల క్రితం ఏర్పాటు అయిన ప్రాంతీయ పార్టీలు ఇపుడు క్రమంగా మనుగడ కోల్పోతున్నాయని వర్తమానంలో సాగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

పట్టు తప్పుతున్న తీరు :

దేశంలో ఒకనాడు ప్రాంతీయ పార్టీల హవా ఎలా ఉండేది అంటే కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో అవి కీలకమైన పాత్ర పోషించేవి. తమ బలాన్ని ఇచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టేవి. ఒక విధంగా చెప్పాలీ అంటే పాతిక నుంచి ముప్పయికి పైగా ప్రాంతీయ పార్టీలు దేశంలో కనిపించేవి. అవన్నీ ఆయా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడి బలమైన వాణిని వినిపించేవి. కానీ కాలక్రమేణ ప్రాంతీయ పార్టీలు పట్టు కోల్పోతున్నాయి. రాష్ట్రాలనే కాదు ఢిల్లీ కోటను సైతం శాసించిన ప్రాంతీయ పార్టీలు ఇపుడు కడు దైన్యంతో ఉన్నాయి. ఒకే ఒక్క ఓటమి ప్రాంతీయ పార్టీల మనుగడనే ప్రశ్నార్ధకం చేస్తోంది.

వరుసగా కూలుతున్నాయి :

దేశంలో చూస్తే యూపీలో బీఎస్పీ, పంజాబ్ లో అకాలీదళ్, ఢిల్లీలో ఆప్, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, అస్సాం లో ఏజీపీ ఇలా వరసబెట్టి లెక్క బెడితే కుప్ప కూలిన ఉదంతాలు తెలుస్తాయి. అంతే కాదు మహారాష్ట్రలో బలంగా ఉంటూ ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన శివసేన కూడా చీలిపోయింది. అలాగే శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీలోనూ భారీ చీలికలు వచ్చాయి. ఇక ఏపీలో వైసీపీ అలాగే తెలంగాణాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారం పోగానే పార్టీ నుంచి జంప్ చేస్తున్న సంగతిని అంతా చూస్తున్నారు. అంతే కాదు ప్రజలలో వచ్చిన సామాజిక భావజాల మార్పులతో సీపీఐ, సీపీఎం కూడా కనుమరుగు అయిపోయాయని గుర్తు చేస్తున్నారు.

గడ్డు కాలమేనా :

ఇపుడున్న పరిస్థితులను చూసుకుంటే ప్రాంతీయ పార్టీల మనుగడ పూర్తిగా ప్రశ్నార్ధకమే కాదు గడ్డు కాలం దాపురించింది అని కూడా చెప్పక తప్పదని విశ్లేషణలు ఉన్నాయి. స్థానిక అంశాలను ప్రభావితం చేస్తూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు ఎందుకు దెబ్బ తింటున్నాయన్నది కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు. దానికి అనేక రాజకీయ సామాజిక ఆర్ధిక కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీల పట్ల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు చూపిస్తున్న వివక్ష కారణంగా అవి ఇబ్బందుల్లో పడుతున్నాయి. అధికారంలో ఉంటూ కూడా తన సొంత రాష్ట్రాలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అసంతృప్తిని మూటకట్టుకుంటున్నాయి. ఫలితంగా ఎన్నికల్లో దెబ్బ తింటున్నాయని అంటున్నారు.

ప్రజల అంచనాలను అందుకోలేక :

ప్రాంతీయ పార్టీలను గెలిపిస్తున్న జనాలకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాటిని అవి తమ పాలన ద్వారా అందుకోలేకపోతున్నాయని అంటున్నారు. ఇక కేంద్రంలోని పార్టీలు గతంలో మాదిరిగా ఉదారంగా ఉండడం లేదు, తమ పర అన్న తేడా చూపిస్తున్నాయి. తమ ప్రభుత్వమే రాష్ట్రాలలో ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ సారధుల ఆశలు పట్టుదల మధ్యన ప్రాంతీయ పార్టీలు రాజకీయ వ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. అంతే కాదు కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఈడీ, సీబీఐ, ఐటీ వంటి వాటిని ముందు పెట్టి చేయించే దాడుల వల్ల కూడా ప్రాంతీయ పార్టీల అధినాయకత్వాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయని అంటున్నారు. ఇక ప్రాంతీయ పార్టీల ఆర్ధిక మూలాలు సైతం దెబ్బ తింటున్నాయి.

కుటుంబ పాలన సాగుతోంది :

ప్రాంతీయ పార్టీలు అంటేనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల మాదిరిగా వారసత్వం ఉంటోంది. ఒక విధంగా కుటుంబ పాలన సాగుతోంది. ఇది పార్టీలోని ఇతర నాయకూల్ను ఎదగనీయడం లేదు, దాంతో అసంతృప్తులు ప్రాంతీయ పార్టీలలో చెలరేగి వాటి క్షీణతకు మరో కారణంగా మారుతున్నాయి. అవినీతి కూడా విచ్చలవిడిగా పెరిగిపోవడం నేనే రాజు నేనే మంత్రి అన్న వైఖరితో ప్రాంతీయ పార్టీలు రాజ్యం చేయడం వల్ల కూడా వాటి మనుగడ ఇబ్బందుల్లో పడుతోంది అని అంటున్నారు. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఒకే దేశం ఒకే పార్టీ అన్న విధానాన్ని అమలు చేస్తోంది. దాంతో కాషాయం పార్టీ చాణక్యం ముందు ప్రాంతీయ పార్టీలు నిలబడలేక మాయమైపోతున్న నేపధ్యం ఉంది అని అంటున్నారు.