కుప్పం బయట పడింది.. ఇలాంటివి ఎన్నో.. బాబు సరిచేయాలి!
ఒక కుటుంబం అప్పు చేసి.. ఊరు వదిలి వెళ్లిపోయిన ఘటన సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 17 Jun 2025 12:48 PM ISTఒక కుటుంబం అప్పు చేసి.. ఊరు వదిలి వెళ్లిపోయిన ఘటన సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో తిరిగి ఆ వూరుకు వచ్చిన ఆ కుటుంబానికి చెందిన మహిళను అప్పు ఇచ్చిన వారు చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన పెను దుమారం రేపింది. అయితే.. ఈ విషయాన్ని కేవలం ఈ ఫ్యామిలీకి మాత్రమే పరిమితం చేయాలని అనుకుంటే పొరపాటే. ఇది పెద్ద ఘటన కాబట్టి.. మీడియా దృష్టికి వచ్చింది.
కానీ, మీడియా దృష్టి రానివి.. వచ్చిన హైలెట్ కానివి అనేకం ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రెండు రోజుల కిందట కూడా ఓ కుటుంబం రాజమండ్రిని వదిలి వెళ్లిపోయింది. దీంతో అప్పు ఇచ్చిన వారు ఆ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోనూ.. అప్పులు చేసిన వారు ఇళ్లు వదిలి వెళ్లిపోతున్నారు. ఈ విషయం కూడా మీడియాలో వస్తూనే ఉంది. అయితే.. అసలు దీనికి కారణంఏంటి? ఏం జరుగుతోంది? అనేది ప్రభుత్వం ఆరా తీయాల్సిన అవసరం ఉంది.
కేవలం కుప్పం ఘటన వెలుగు చూసింది కాబట్టి దీనిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకొని వదిలేస్తే.. దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి ఘటనలను నివారించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూలి పనులు చేసుకునేవారికి పనులు లేకుండా పోయాయి. ఉచిత ఇసుక పేరుకే పరిమితం అయింది. భారీ ఎత్తున సొమ్ములు పోసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పనులు నిలిచిపోయాయి.
ఈ ప్రభావం కూలి పనులు చేసుకునే వారిపై ప్రభావం చూపుతోంది. అదేవిధంగా చేతిలో రూపాయి ఆడక పేద కుటుంబాలు అల్లాడుతున్నాయి. దీంతో వారు రోజు గడపడం కోసం అప్పులు చేస్తున్నారు. ఈ పరిణామాలే వారు.. ఊళ్లకు ఊళ్లను వదిలివెళ్లిపోయేలా చేస్తున్నాయి. ఈ పరిస్థితిని సమీక్షించి.. స్థానికంగా వారికి పనులు చూపిస్తే.. ఈ తరహా పరిస్థితి తగ్గుతుందని అంటున్నారుపరిశీలకులు. అలా కాకుండా.. పైపైనే.. కన్నీళ్లు తుడిస్తే.. ప్రయోజనం లేకపోగా... ప్రభుత్వానికి కూడా ఇబ్బందేనని అంటున్నారు.
