Begin typing your search above and press return to search.

కబళించిన మృత్యువు.. అమెరికాలో తెలుగు వైద్య విద్యార్థిని దుర్మరణం!

అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వైద్య విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అందరిలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Nov 2023 8:30 AM GMT
కబళించిన మృత్యువు.. అమెరికాలో తెలుగు వైద్య విద్యార్థిని దుర్మరణం!
X

అమెరికాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వైద్య విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన అందరిలో విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే కోవలో తెలంగాణకు చెందిన మరో వైద్య విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం అందరినీ కలిచి వేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం కాంపల్లికి చెందిన వడ్డేపల్లి పుల్లయ్య కుమార్తె నీరజ(28)ది దిగువ మధ్యతరగతి కుటుంబం. ఆమె తండ్రి ఒక చిన్న రైతు. మొదటి నుంచి చదువుల్లో ముందుంటున్న నీరజ ఖమ్మం జిల్లా కేంద్రంలోని మమత మెడికల్‌ కాలేజీలో బీడీఎస్‌ పూర్తి చేసింది.

రైతు కుటుంబానికి చెందిన ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన నీరజ తన కుటుంబ అవకాశాలను మెరుగుపర్చడానికి, ఉన్నత విద్యాభ్యాసానికి అమెరికా బాటపట్టింది. అమెరికాలోని మిస్సోరిలో ఉన్న సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీలో పీజీ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఈ క్రమంలో తన బట్టల లాండ్రీ కోసం రోడ్డు దాటుతుండగా అక్టోబర్‌ 28న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలకు గురై మృత్యువాత పడింది. మృతదేహాన్ని నవంబర్‌ 12న అమెరికా నుంచి స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఉన్నత విద్యకోసం వెళ్లిన నీరజ విగతజీవిగా స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

సంప్రదాయం ప్రకారం.. జిల్లేడు చెట్టుకు వివాహం జరిపించి అంత్యక్రియలు జరిపించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత కాంపల్లికి చేరుకుని మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నీరజ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.