న్యూయార్క్ ప్రొఫెసర్ కొత్త సిద్ధాంతం.. చనిపోయినా బతికించొచ్చు!
మరణం అనివార్యం.. దాని గురించి ఆలోచించటానికి మించిన మూర్ఖత్వం మరేమీ ఉండదన్న మాటల్ని మిగిలిన వారు పాటిస్తారేమో కానీ.. మరణాన్ని అధిగమించే అవకాశం ఏముందన్న అంశంపై పలువురు ఏళ్లకు ఏళ్లుగా పరిశోధనలు చేయటం తెలిసిందే.
By: Tupaki Desk | 31 March 2025 6:10 AMమరణం అనివార్యం.. దాని గురించి ఆలోచించటానికి మించిన మూర్ఖత్వం మరేమీ ఉండదన్న మాటల్ని మిగిలిన వారు పాటిస్తారేమో కానీ.. మరణాన్ని అధిగమించే అవకాశం ఏముందన్న అంశంపై పలువురు ఏళ్లకు ఏళ్లుగా పరిశోధనలు చేయటం తెలిసిందే. ఇలాంటి వేళ.. సరికొత్త సిద్ధాంతాన్ని వినిపిస్తున్నారు న్యూయార్క్ కు చెందిన ప్రొఫెసర్ సామ్ పార్నియా. ఆయన వినిపిస్తున్న ఈ కొత్త సిద్ధాంతం ఆసక్తికరంగానే కాదు.. కాస్తంత లాజిక్ కు దగ్గరగా ఉన్నట్లుగా అనిపించక మానదు.
ఇంతకూ ఆయన చెప్పేదేమంటే.. మరణాన్ని వెనక్కి తిప్పవచ్చని చెబుతున్నారు. గుండె.. ఊపిరితిత్తులు పాడైన వారికి చికిత్సను అందించే ఎక్మా యంత్రంతో కొన్ని ఔషధాల సమ్మేళనాన్ని ఉపయోగించి పోయిన ప్రాణాన్నితిరిగి తీసుకురావొచ్చని చెబుతున్నారు. న్యూయార్క్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ సామ్ పార్నియా ఇంకేం చెబుతున్నారన్నది ఆయన మాటల్లో చదివితే మరింత ఆసక్తికరంగా ఉంటుంది.
‘‘ఎపినెఫ్రిన్.. షుగర్ వ్యాధుల బారిన వారికి చికిత్స చేసందుకు వినియోగించే మెట్ ఫార్మిన్.. విటమిన్ సీ.. వాసోప్రెసిన్.. సప్లిమెంట్ సల్ బుటమైన్ లను తగుపాళ్లలో కలిపి ఎక్మా మెషిన్ తో కలిపి అందిస్తే గుండె స్తంభించిన వారిలో కూడా తిరిగి జీవం పోయొచ్చు. ల్యాబ్ లలో జంతువుల మీద జరిపిన ప్రయోగాల్లో ఇది సాధ్యమైంది. మనిషి మరణించిన తర్వాత శరీరంలోని కణాలన్నీ వెంటనే చచ్చుబడిపోవు. దానికి కొంత సమయం పుడుతుంది. మెదడు కూడా కొన్ని రోజుల పాటు సజీవ స్థితిలో ఉంటుంది’’ అని చెబుతున్నారు.
మనిషి మరణించిన తర్వాత మెదడు కొన్ని రోజులు సజీవ స్థితిలో ఉంటుందన్న అంశం పాతదేనని చెబుతున్నారు. తాము జరిపిన పరిశోధనల్లో గుండె కొట్టుకోవటం మానేసిన తర్వాత దాదాపు గంట పాటు జ్ఖాపకాలు పదిలంగా ఉండటాన్ని గుర్తించినట్లు చెప్పారు. వారి మెదడు పని తీరును పరిశీలించినప్పుడు తామీ విషయాన్ని గుర్తించినట్లు చెప్పారు. మరణానికి గురైన వ్యక్తి శరీర కణాల్లో జీవక్రియలు పూర్తిగా నిలిచిపోనంత వరకు సదరు వ్యక్తిని బతికించొచ్చన్నది సామ్ వాదన. రానున్న రోజుల్లో ఈ వాదనకు మరింత బలాన్ని చేకూర్చే అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందని చెప్పాలి.