Begin typing your search above and press return to search.

వైట్ హౌస్ వద్ద కాల్పులు : గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను వేటాడుతున్న ట్రంప్

అమెరికా రాజధాని మరోసారి ఉద్రిక్తతలతో కొట్టుమిట్టాడింది. వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్‌పై జరిగిన కాల్పులు అమెరికా భద్రతా వ్యవస్థను కుదిపేశాయి.

By:  Tupaki Desk   |   28 Nov 2025 10:51 AM IST
వైట్ హౌస్ వద్ద కాల్పులు : గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ను వేటాడుతున్న ట్రంప్
X

అమెరికా రాజధాని మరోసారి ఉద్రిక్తతలతో కొట్టుమిట్టాడింది. వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్‌పై జరిగిన కాల్పులు అమెరికా భద్రతా వ్యవస్థను కుదిపేశాయి. ఈ ఘటన ప్రభావం రాజకీయ రంగంలోనూ పెద్దగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ను లక్ష్యంగా చేసుకుంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు.

కాల్పుల ఘటన – అగ్రరాజ్యంలో కలకలం

శ్వేతసౌధానికి దగ్గరలోనే నేషనల్ గార్డ్స్‌పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే స్పందించిన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను అఫ్గానిస్థాన్‌కు చెందినవాడని వెల్లడైంది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితులపై ప్రశ్నల వర్షం కురిపించింది.

మహిళా నేషనల్ గార్డ్ మరణం... దేశాన్ని కదిలించిన విషాదం

ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నేషనల్ గార్డ్ సిబ్బందిలో సారా బెక్‌స్ట్రోమ్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణాన్ని ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. ఇంకొక గార్డ్ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. దేశ సేవలో ఉన్న సైనికులపై జరిగిన ఈ దాడి దేశ హృదయాన్ని కదిలించింది.

గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌పై ట్రంప్ రివ్యూ ఆర్డర్

ఈ విషాదకర ఘటన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన వేగంగా స్పందించింది. గ్రీన్ కార్డ్ కలిగిన 19 దేశాల పౌరుల వివరాలను మరోసారి సమీక్షించాలని ట్రంప్ ఆదేశించారు. ఈ విషయాన్ని USCIS డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో ఎక్స్ లో ప్రకటించారు.

సమీక్షకు వచ్చే 19 దేశాలు

ఈ జాబితాలో అఫ్గానిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ ఉన్నాయి. వీటికి తోడు పాక్షిక ప్రయాణ నిషేధం ఉన్న మరో ఏడు దేశాలు కూడా ఉన్నాయి. ఈ దేశాలు గతంలో ట్రంప్ ప్రయాణ నిషేధం విధించిన జాబితాలో ఉన్నవే. ఇప్పుడు మళ్లీ అదే దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ను లక్ష్యంగా చేస్తున్నారు.

కోర్టు, ఇమ్మిగ్రేషన్ వర్గాల్లో ఆందోళన

వలసదారుల హక్కుల సమూహాలు ఈ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. “ఒక వ్యక్తి చేసిన నేరానికి మొత్తం దేశాల ప్రజలను శిక్షించడం సరికాదు” అని విమర్శిస్తున్నాయి. బిడెన్ పరిపాలన సమయంలో తగ్గించిన కఠిన నిబంధనలు మళ్లీ పునరుద్ధరించబడతాయా? అన్న ప్రశ్న ఇప్పుడు తాజా చర్చాంశమైంది. ట్రంప్ తీసుకోబోయే తదుపరి చర్యలు అమెరికా వలసదారుల భవిష్యత్తును ప్రధానంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.