లీగల్ నోటీసులు : మారన్ బద్రర్స్ మధ్య చిచ్చు పెట్టిన ఆస్తులు, వ్యాపారాలు
ప్రస్తుతం కలానిధి మారన్ సన్ టీవీ నెట్‌వర్క్‌లో 75% వాటా కలిగి ఉన్నారు. ఆయన మొత్తం సంపత్తి $2.9 బిలియన్లు (సుమారు ₹24,000 కోట్లు)గా అంచనా వేయబడింది.
By: Tupaki Desk | 20 Jun 2025 11:48 AM ISTచెన్నై కేంద్రంగా ఉన్న ప్రముఖ మీడియా సంస్థ సన్ టీవీ నెట్‌వర్క్ యజమాన్యం వర్గంలో పెద్ద దుమారం రేగింది. డీఎంకే ఎంపీ, మాజీ కేంద్రమంత్రి దయానిధి మారన్ తన అన్న కళానిధి మారన్, సన్ టీవీ నెట్‌వర్క్ చైర్మన్ పై భారీ ఆరోపణలతో లీగల్ నోటీసు జారీ చేయడం సంచలనమైంది. ఈ వ్యవహారం తమిళ రాజకీయ, మీడియా రంగాల్లో పెను దుమారం రేపింది.
ఈ నోటీసులో కళానిధి భార్య కావేరి మారన్‌తో పాటు ఏడుగురు ఇతరులు కూడా నిందితులుగా ఉన్నారు. నోటీసు ప్రకారం.. 2003లో తండ్రి మురసోలీ మారన్ మరణం తరువాత కుటుంబ మీడియా వ్యాపారంలో వాటాల తరలింపులో భారీగా చీకటి పనులు జరిగాయని దయానిధి ఆరోపించారు. తండ్రి మరణించిన వెంటనే లీగల్ హెయిర్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ లేకుండా తల్లి మల్లికా మారన్ పేరిట షేర్లు మార్చినట్టు పేర్కొన్నారు. దీని ద్వారా కళానిధికి పూర్తిగా నియంత్రణ దక్కేలా ముందస్తుగా పథకం రచించారని ఆయన ఆరోపించారు.
2003 సెప్టెంబర్ 15న కలానిధి మారన్ తక్కువ ధరకు ఒక్క షేరు రూ.10 చొప్పున 12 లక్షల ఈక్విటీ షేర్లను తన పేరిట కేటాయించుకున్నారని, ఆ సమయంలో వాటి అసలైన మార్కెట్ విలువ రూ.2,500 నుండి రూ.3,000 మధ్య ఉండేదని దయానిధి తెలిపారు. ఈ చర్య ద్వారా కంపెనీ మీద 60% వాటాను అక్రమంగా పొందినట్టు ఆయన అన్నారు. అంతేకాదు ₹8,500 కోట్లకు పైగా మొత్తం భారతదేశం విదేశాల్లోని రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టులు (REITs), మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనీలాండరింగ్ చేసినట్టు ఆరోపించారు. అలాగే SEBI, BSE, NSEకు తప్పుడు సమాచారం ఇచ్చి షేర్లను పబ్లిక్ లిస్టింగ్ చేసినట్టు నోటీసులో వివరించారు.
ప్రస్తుతం కలానిధి మారన్ సన్ టీవీ నెట్‌వర్క్‌లో 75% వాటా కలిగి ఉన్నారు. ఆయన మొత్తం సంపత్తి $2.9 బిలియన్లు (సుమారు ₹24,000 కోట్లు)గా అంచనా వేయబడింది.
దయానిధి మారన్ 2003కి ముందున్న వాటాదారుల నిర్మాణాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్రమంగా సంపాదించిన షేర్లు, డివిడెండ్లు, ఆస్తులన్నీ తిరిగి ఇవ్వాలని కోరారు. అలా చేయకపోతే పౌర, క్రిమినల్, రెగ్యులేటరీ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించారు. ఈ నోటీసును చెన్నై కేంద్రంగా ఉన్న లా ధర్మా లీగల్ ఫిర్మ్ జూన్ 10, 2025న జారీ చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో సన్ టీవీ షేరు ధరలు 0.74% తగ్గి ₹613.50 వద్ద ముగిశాయి. ఈ కుటుంబ వివాదం తమిళ రాజకీయ, మీడియా రంగాల్లో పెను దుమారం రేపుతోంది.
