Begin typing your search above and press return to search.

అండర్ వరల్డ్ డాన్ ఆస్తులు..వ్యాపారాలు తెలిస్తే అవాక్కే

అండర్ వరల్డ్ డాన్ అన్నపేరుకు తగ్గట్లే అతడి ఆస్తుల వ్యవహారాల లెక్క చూసినప్పుడు ఆశ్చర్యానికి గురి కాక తప్పదు.

By:  Tupaki Desk   |   19 Dec 2023 5:30 PM GMT
అండర్ వరల్డ్ డాన్ ఆస్తులు..వ్యాపారాలు తెలిస్తే అవాక్కే
X

విషప్రయోగం జరిగింది.. ప్రాణాపాయస్థితిలో కరాచీలోని ఒక ఆసుపత్రిలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్యం విషమంగా ఉందంటూ సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు రావటమే కానీ.. అధికారిక ప్రకటన ఒక్కటి కూడా వచ్చింది లేదు. సోమవారం సాయంత్రానికి దావూద్ మీద వస్తున్న కథనాలన్ని కూడా ఫేక్ అని.. అందులో వాస్తవం లేదని.. అతడి మీద విష ప్రయోగం జరిగింది లేదన్న అంశాలు బయటకు వచ్చాయి. ఇదే వేళలో.. దావూద్ ఆస్తులు.. ఆతడు చేసే వ్యాపారాలకు సంబంధించిన వివరాలు చర్చకు వచ్చాయి.

అండర్ వరల్డ్ డాన్ అన్నపేరుకు తగ్గట్లే అతడి ఆస్తుల వ్యవహారాల లెక్క చూసినప్పుడు ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. అప్పుడెప్పుడో 2015.. అంటే ఎనిమిదేళ్ల క్రితమే ఫోర్బ్స్ లెక్క ప్రకారం గ్యాంగస్టర్లలో దావూద్ సంపన్నుడిగా లెక్క కట్టటమే కాదు.. అప్పట్లో అతగాడి నికర ఆస్తుల విలువ రూ.55 వేల కోట్లుగా పేర్కొన్నారు. ఇంతకూ దావూద్ ఏం చేస్తారు? ఎలాంటి వ్యాపారాలు చేస్తారన్న విషయంలోకి వెళితే.. విస్తుపోయే అంశాలు బయటకు వస్తాయి.

1980-90 మధ్య కాలంలో వ్యభిచారం.. డ్రగ్స్.. గ్యాంబ్లింగ్ లాంటి దరిద్రపుగొట్టు వ్యాపారాలతో కోట్లు గడించాడు. ప్రపంచ ఉగ్రవాద సంస్థ డి కంపెనీకి అధినేతగా అవతరించారు. దావూద్.. అతడి అనుచరులు నిర్వహిస్తున్న కొన్ని వ్యాపారాలను చూస్తే.. చమురు.. లూబ్రికెంట్ల రంగంలో ఒయాసిస్ ఆయిల్ అండ్ లూబ్ ఎల్ సీసీ అనే దుబాయ్ కంపెనీ ఒకటి అతగాడిదన్న పేరుంది. అల్ నూర్ డైమండ్స్ అనే దుబాయ్ లోని వజ్రాల వ్యాపార సంస్థ కూడా ఇతగాడిదేనన్న పేరుంది. ఒయాసిస్ పవర్ ఎల్ సీసీ దుబాయ్ ఆధారిత కంపెనీగా పేరుంది. నిర్మాణ రంగంలో డాల్ఫిన్ కన్ స్ట్రక్షన్ పేరుతో రియల్ఎస్టేట్.. భవన నిర్మాణ రంగంలో దావూద్ అతని మనుషులు ఉంటారని చెబుతారు.

ఈస్ట్ వెస్ట్ ఎయిర్ లైన్స్ ను కూడా దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం స్థాపించారని.. ఆ సంస్థనుస్మగ్లింగ్.. పన్ను ఎగవేత ఆరోపణలతో 1996లో మూసేశారు. ఇప్పుడు పేర్కొన్న పలు కంపెనీలు దావూద్ కనుసన్నల్లో నడుస్తాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ.. అధికారిక ఆధారాలు లేవని చెబుతుంటారు. వీటన్నింటిలోనూ ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ సంబంధాలు ఉన్నాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది.