Begin typing your search above and press return to search.

పులివెందులలో గెలుపుపై దస్తగిరి కలలు మామూలుగా లేవుగా!!

వైఎస్ జగన్, అవినాష్ లపై సంచలన ఆరోపణలు చేస్తున్న దస్తగిరి... గత కొన్ని రోజుల నుంచి పులివెందులలో జగన్ ని ఓడిస్తానంటూ హల్ చల్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 March 2024 2:35 PM GMT
పులివెందులలో గెలుపుపై దస్తగిరి  కలలు మామూలుగా లేవుగా!!
X

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి మీడియా ముందు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు! వైఎస్ జగన్, అవినాష్ లపై సంచలన ఆరోపణలు చేస్తున్న దస్తగిరి... గత కొన్ని రోజుల నుంచి పులివెందులలో జగన్ ని ఓడిస్తానంటూ హల్ చల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా... ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలూ చేస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి మైకులముందుకు వచ్చారు దస్తగిరి.

అవును... వైఎస్ వివేకా మర్డర్ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి.. రానున్న ఎన్నికల్లో జై భీంరావు భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పులివెందుల నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో... కొంతమందికి నచ్చకపోయినా పులివెందుల నెక్స్ట్ ఎమ్మెల్యే తానే అని చెబుతుండటం గమనార్హం. ఇదే సమయంలో రానున్న ఎన్నికల్లో జగన్ ని తాను ఓడించడం కన్ ఫాం అని, తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గ ప్రజల భవితవ్యాన్ని మారుస్తానని అంటున్నారు.

ఈ క్రమంలోనే రాష్ట్రంలో రాజారెడ్డి, జగన్ రాజ్యాంగం నడుస్తోందని చెబుతున్న దస్తగిరి... తాను పులివెందులలో పోటీచేయడానికి ముఖ్యకారణం అక్కడ ప్రజలు జగన్ చేతిలో మోసపోవడమే అని.. అమాయక ప్రజలను మోసం చేసి తిరిగి గద్దెనెక్కాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే ముఖ్యమంత్రి దళితులకు చేసిన సామాజిక, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు దస్తగిరి!

ఇక తన తండ్రిపై దాడి జరిగిన మాట వాస్తవమే అని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు పార్టీ అధినేత శ్రావణ్‌ కుమార్‌ నాయకత్వంలో పని చేస్తా అని.. ఈ క్రమంలోనే పులివెందులో తప్పకుండా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు దస్తగిరి.

ఇలా వైఎస్ జగన్ ను పులివెందుల నియోజకవర్గంలో ఓడిస్తానని దస్తగిరి చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా... ఏమాత్రం రాజకీయ అనుభవం లేని దస్తగిరి... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని, అది కూడా పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిస్తానని చెప్పడం ఆశ్చర్యంగానే ఉందని ఒకరంటే... ఇవి పూర్తిస్థాయి పగటి కలలని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు.