Begin typing your search above and press return to search.

తగ్గేదేలేదు.. అప్పుడు కౌశిక్ రెడ్డి.. ఇప్పుడు శ్రవణ్

తాజాగా దాసోజు శ్రవణ్.. కుర్రా సత్యనారాయణ పేర్లను పంపగా.. ఈ రెండు పేర్లను రిజెక్టు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:14 AM GMT
తగ్గేదేలేదు.. అప్పుడు కౌశిక్ రెడ్డి.. ఇప్పుడు శ్రవణ్
X

ముల్లును ముల్లుతోనే తీయాలన్న నానుడికి తగ్గట్లే వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై. ఎక్కడి లెక్కలు అక్కడివే అన్న విషయాన్ని ఆమె చేతల్లో చూపిస్తున్నారు. రాజ్ భవన్ కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను సాదరంగా ఆహ్వానించటం..గౌరవ మర్యాదల విషయంలో ఏ మాత్రం తగ్గకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకునే ఆమె.. తన అనుమతి కోసం వచ్చే బిల్లుల విషయంలో మాత్రం రూల్ బుక్ ను పక్కాగా ఫాలో కావటం కనిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఇద్దరిని ఎంపిక చేసి పంపిన కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాకిచ్చారు.

గతంలోనూ పాడె కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ కోటాలో ప్రతిపాదించగా.. గవర్నర్ తిరస్కరిస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు. దీనికి సరైన కారణం చూపించటంతో కేసీఆర్ సర్కారు సైతం ఏమీ మాట్లాడలేని పరిస్థితి. తర్వాతి కాలంలో.. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేల కోటా కింద ఎన్నిక చేసి మండలికి పంపటం తెలిసిందే. కౌశిక్ రెడ్డి సమయంలోనూ సేవా కార్యక్రమాల్ని నిర్వహించిన వ్యక్తిగా పేర్కొంటూ.. మండలికి నామినేట్ చేయగా.. అధికరణం 171(5) ప్రకారం ఆయన ఎంపిక సరిపోదని పేర్కొంటూ రిజెక్టు చేవారు.

ఆయన స్థానంలో మాజీ సభాపతి మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా.. పరిశీలించిన గవర్నర్.. అందుకు ఆమోద ముద్ర వేశారు. తాజాగా దాసోజు శ్రవణ్.. కుర్రా సత్యనారాయణ పేర్లను పంపగా.. ఈ రెండు పేర్లను రిజెక్టు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం.. వారిని ప్రతిపాదించిన కోటాకు వారు సూట్ కాకపోవటమేనని చెబుతున్నారు.

తాము తీసుకునే నిర్ణయాల్ని గవర్నర్ తూచా తప్పకుండా పాటిస్తారన్న నమ్మకంతో సీఎం కేసీఆర్ వేసుకున్న అంచనా అడ్డంగా ఫెయిల్ అయినట్లుగా భావిస్తున్నారు. గవర్నర్ నుంచి ఇలాంటి స్పందన వస్తుందన్న విషయాన్ని ఏ మాత్రం అంచనా వేయలేదని చెబుతున్నారు. తాజా పరిణామాన్ని చూసిన వారంతా గవర్నర్ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. గవర్నర్ అన్నంతనే.. రబ్బర్ స్టాంప్ అన్న భావనను తొలిగించే విషయంలో తమిళ సై పక్కాగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

ఆ మధ్యన పంపిన ఆర్టీసీ బిల్లులోనూ కీలకమైన అంశాల్ని ప్రస్తావించి.. వాటిని మార్పులు చేసిన తర్వాతే ఓకే చేయటం కనిపిస్తోంది. తాను ఆలస్యం చేసింది.. ఆర్టీసీ ఉద్యోగులకు మేలు కలిగించేందుకే అన్న విషయాన్ని పేర్కొనటమే కాదు.. తనను బద్నాం చేసే వారికి తనదైన బదులుతో.. గవర్నర్ షాకిచ్చారని చెప్పక తప్పదు.