'ఆ కులం' ఆత్మ గౌరవాన్ని కాపాడిన పవన్ కల్యాణ్!
దీనిని అందరూ కోరుకుంటారు. కేవలం డబ్బుతోనే కాదు.. సామాజికంగా కులం ఆధారంగా కూడా.. ఆత్మ గౌరవం లభిస్తుంది
By: Tupaki Desk | 17 Jun 2025 5:56 PM ISTఆత్మ గౌరవం.. అనేది సామాజిక భద్రతలో ఒక కీలక అంశం. దీనిని అందరూ కోరుకుంటారు. కేవలం డబ్బుతోనే కాదు.. సామాజికంగా కులం ఆధారంగా కూడా.. ఆత్మ గౌరవం లభిస్తుంది. గతంలో కూడా ఓ సామాజిక వర్గం తమ కులానికి సంబంధించి ఆందోళన చేసింది. `కసాయి` అనే పదాన్నితొలగించాలని ఉద్యమించింది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఈ పదాన్ని రికార్డుల నుంచి తొలగించింది. అలానే తాజాగా `దాసరి` సామాజికవర్గానికి చెందిన వారు తమ ఆత్మ గౌరవంపై ఉద్యమించారు.
తమ కులానికి చెందిన వారిలో ఎక్కువ మంది యాచక వృత్తిలో ఉన్నారని.. దీంతో తమ కులం మొత్తానికి కూడా దీనిని ఆపాదిస్తున్నారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. యాచక వృత్తిలో ఉన్నంత మాత్రాన అందరినీ ఇదే గాటన కట్టడం సరికాదని వారు పేర్కొన్నారు. దీనిపై గత ఎన్నికలకు ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు వినతులు సమర్పించారు. అయితే.. పాలన ఏడాది పూర్తయినా.. ఇప్పటి వరకు దీనిపై మార్పు రాలేదు. దీంతో కొన్నాళ్ల కిందట మరోసారివారు పవన్ ను కలిసి తమ విన్నపాన్ని గుర్తుచేశారు.
దీంతో దాసరి సామాజిక వర్గం వారి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని.. వారి కులానికి పక్కన అధికారికంగా ఉన్న `యాచక వృత్తిదారులు` అనే పదాన్ని తొలగించాలని సర్కారుకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఇదివారి ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయమని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం తాజాగా దాసరి కులాల వారికి ఇచ్చే కుల ద్రువీకరణ పత్రంలో ఇక నుంచి `యాచకులు` అనే పదాన్ని తొలగిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, దాసరి కులస్తులు.. బీసీ-ఏగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.
