కంటికి కనిపించని అతిపెద్ద ఆన్ లైన్ చీకటి సామ్రాజ్యం గురించి తెలుసా?
అమెరికా నేవల్ రిసెర్చ్ లేబరేటరీ అప్పట్లో ద ఆనియన్ రూటింగ్ ప్రాజెక్ట్ (టోర్) ప్రాథమిక వెర్షన్ తో 90ల్లోనే దీనికి పునాది పడింది.
By: Tupaki Desk | 16 July 2025 6:00 PM ISTమామూలు సెర్చ్ ఇంజిన్లకు ఇది చిక్కదు.. యాక్సెస్ చేయడం అందరివల్లా కాదు.. దీన్ని యాక్సెస్ చేయాలంటే ప్రత్యేకమైన బ్రౌజర్లు కావాలి.. గూగుల్, యాహూ, ఫైర్ ఫాక్స్ వంటి ఓపెన్ వెబ్ బ్రౌజర్లతో ఇది సాధ్యం కాదు.. తమ ఐడెంటిటీ గోప్యంగా, అజ్ఞాతంగా ఉండాలని కోరుకునేవారికిది ఓ రక్షణ స్థావరాన్ని సృష్టిస్తుంద.. అదే ఆన్ లైన్ చీకటి సామ్రాజ్యం.. డార్క్ వెబ్.
అమెరికా నేవల్ రిసెర్చ్ లేబరేటరీ అప్పట్లో ద ఆనియన్ రూటింగ్ ప్రాజెక్ట్ (టోర్) ప్రాథమిక వెర్షన్ తో 90ల్లోనే దీనికి పునాది పడింది. పేరుకు తగ్గట్టుగా ఇది ఉల్లి పొరల మాదిరిగా కమ్యూనికేషన్ నెట్ వర్క్స్ లో ఎస్సెమ్మెస్ లను పొందుపరుస్తుంది. ఆన్ లైన్ గోప్యతను మరింత కట్టుదిట్టం చేసే లక్ష్యంతో రోజర్ డింగెల్ డైన్, ఆయన బృందం టోర్ ను రూపొందించింది.
ఇది డేటాను ఎన్ క్రిప్ట్ చేయటం ద్వారా యూజర్ చిరునామాను దాచి పెడుతుంది. మొదట్లో మంచి ఉద్దేశం కోసం రూపొందించినప్పటికీ క్రమక్రమంగా అక్రమ కార్యకలాపాలకు వాడుకోవటం ఎక్కువైంది.. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల వంటి పనులకు ఇది ప్రసిద్ధి చెందింది. ఇటీవల కేరళకు చెందిన ఒకరు ఇందులో డ్ర*గ్స్ అమ్ముతున్నందుకు గాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది ఇలా పూర్తిగా డ్ర*గ్స్, సైబర్ నేరాలు, తుపాకుల అమ్మకాలు మొదలైన అక్రమ కార్యకలాపాలకు పెట్టింది పేరైనట్లుగా ఉన్నప్పటికీ... ఈ డార్క్ వెబ్ కొన్ని మంచి పనులకూ ఉపయోగపడుతోంది! ఇందులో భాగంగా.. గూఢచారులు, జర్నలిస్టులు మొదలైనవారు పీడిత పాలనలో రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటానికి దీన్ని వాడుకుంటుంటారు.
తమ డేటాను కాపాడుకోవటానికి కొన్ని ఆసుపత్రులు, ఇతర సంస్థలు సైతం దీన్ని వాడుకుంటున్నాయని చెబుతున్నారు. అయితే ఈ అజ్ఞాత ధోరణే సైబర్ నేరాలకు ఊతమిస్తోందని అంటున్నారు. ప్రధానంగా... డ్ర*గ్స్, దొంగ నోట్లు, మాల్వేర్ లావాదేవీలకు ఇక్కడ ఆస్కారం కల్పిస్తోంది.
ఈ నేపథ్యంలోనే... ప్రపంచవ్యాప్తంగా చట్టపరమైన సంస్థలు డార్క్ వెబ్ వ్యవహారాలనూ ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. అయితే... అధునాతన ఎన్ క్రిప్షన్ పద్ధతుల మూలంగా నేరగాళ్లను గమనించటం ఇటీవల పెద్ద సమస్యగా నిలుస్తోందని అంటున్నారు. అయినప్పటికీ అధునాతన విధానాలతో పోలీసులు నేరగాళ్లను పట్టుకుంటున్నారు.
వాస్త్రవానికి వెబ్ సైట్ లు సాధారణంగా “.కాం” మరియు “.ఆర్గ్” వంటి రిజిస్ట్రీ ఆపరేటర్ లతో లేబుల్ చేయబడతాయి. ప్రసిద్ధ సెర్చ్ ఇంజిన్ లతో సులభంగా గుర్తించబడతాయి. అతితే... ఈ డార్క్ వెబ్ లో వెబ్ సైట్లు “.ఆనియన్” డొమైన్లను వాడు కుంటాయి. సంప్రదాయ సెర్చ్ ఇంజిన్ల ఇండెక్స్ లో ఇవి ఉండవు.
సాధారణంగా 'టోర్'ను డౌన్ లోడ్ చేసుకొని డార్క్ వెబ్ ను ఉపయోగించుకుంటారు. ఇది నోడ్స్ అని పిలుచుకునే పలు సర్వర్ల ద్వారా కనెక్షన్లను దారి మళ్లిస్తుంది. ఈ క్రమంలో ప్రతి దశలోనూ డేటాను రహస్య లిపిలోకి మారుస్తుంది. అందువల్ల డార్క్ వెబ్ లో జరిగే వ్యవహారాలను పట్టుకోవటం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవచ్చు.
