Begin typing your search above and press return to search.

కార్మికులు లేని కర్మాగారాలు.. 'డార్క్ ఫ్యాక్టరీలు' ప్రపంచాన్ని ఎలా మార్చబోతున్నాయి ?

ప్రపంచ పారిశ్రామిక రంగం ఊహించని మార్పులకు రెడీ అవుతోంది. ఇక మీదట భవిష్యతులో కర్మాగారాల్లో కార్మికులు కనిపించకపోవచ్చు.

By:  Tupaki Desk   |   22 April 2025 2:30 AM
కార్మికులు లేని కర్మాగారాలు.. డార్క్ ఫ్యాక్టరీలు ప్రపంచాన్ని ఎలా మార్చబోతున్నాయి ?
X

ప్రపంచ పారిశ్రామిక రంగం ఊహించని మార్పులకు రెడీ అవుతోంది. ఇక మీదట భవిష్యతులో కర్మాగారాల్లో కార్మికులు కనిపించకపోవచ్చు. మీరు చదువుతున్నది నిజమే. ఇప్పటికే జపాన్, అమెరికా, చైనా వంటి దేశాల్లో కొన్ని కంపెనీలు డార్క్ ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. ఈ వినూత్న విధానంలో ఉత్పత్తి ప్రక్రియ పూర్తిగా యంత్రాల ద్వారా, కృత్రిమ మేధస్సు(ఏఐ) సాయంతో రోబోటిక్స్ ద్వారా జరుగుతుంది. దీనివల్ల టైమింగ్, సెలవులు, కార్మిక చట్టాల వంటి వాటితో పనిలేదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ 'డార్క్ ఫ్యాక్టరీ' అంటే ఏమిటి? దీని వల్ల లాభాలు ఏమిటి?

'డార్క్ ఫ్యాక్టరీ' అంటే ఏమిటి?

'డార్క్ ఫ్యాక్టరీ' లేదా 'లైట్స్-అవుట్ ఫ్యాక్టరీ' అనేది పూర్తిగా ఆటోమేటెడ్ చేయబడిన ఉత్పత్తి కర్మాగారం. ఇక్కడ ముడిసరుకు ప్రవేశం నుంచి తుది ఉత్పత్తి తయారీ వరకు అన్ని పనులను రోబోట్లు, AI- బేస్డ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IoT) పరికరాల ద్వారా జరుగుతాయి. ఈ కర్మాగారాలు మానవ ప్రమేయం లేకుండా 24/7 పనిచేసేలా రూపొందించారు. కార్మికులు అవసరం లేనందున ఈ కర్మాగారాల్లో లైటింగ్ కూడా అవసరం లేదు. అందుకే దీనిని డార్క్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు.

'డార్క్ ఫ్యాక్టరీ'ల వల్ల లాభాలు:

పెరిగిన కెపాసిటీ: ఆటోమేటెడ్ సిస్టమ్స్ మానవ కార్మికుల కంటే వేగంగా, చాలా కచ్చితత్వంతో పనిచేస్తాయి. ఉత్పత్తి లోపాలను తగ్గిస్తాయి. అవుట్‌పుట్‌ను పెంచుతాయి.

తగ్గనున్న ఖర్చులు: మానవ శ్రమను తొలగించడం వల్ల వేతనాలు, ప్రయోజనాలు, కార్యాలయ భద్రతా ఖర్చులు వంటి మెయింటెనెన్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.

విరామం లేకుండా పనులు: మానవ కార్మికుల మాదిరి కాకుండా యంత్రాలకు విరామాలు, సెలవులు లేదా నిద్ర అవసరం లేదు, దీనివల్ల ఉత్పత్తి నిరంతరం జరుగుతూనే ఉంటుంది.

మెరుగైన భద్రత: ప్రమాదకరమైన పనులు, కఠినమైన పరిస్థితుల్లో కూడా రోబోట్స్ పనిచేయగలవు. తద్వారా ప్రమాదాలు తగ్గుతాయి.

మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా మార్పులు: AI- బేస్ట్ సిస్టమ్స్ భారీ శ్రామికశక్తి శిక్షణ అవసరం లేకుండా మారుతున్న మార్కెట్ డిమాండ్‌లకు త్వరగా అనుగుణంగా మారగలవు.

ప్రపంచంలోని 'డార్క్ ఫ్యాక్టరీ'లు:

ఫానక్ (జపాన్): పారిశ్రామిక దేశాల్లో ఒకటైన జపాన్ లోని ఫానక్ పూర్తిగా ఆటోమేటెడ్ ఉత్పత్తి లైన్లను ఉపయోగించి రోబోటిక్ ఆర్మ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ యంత్రాలే ఇతర యంత్రాలను తయారు చేస్తాయి. మానవ ప్రమేయం ఉండదు.

సీమెన్స్ (జర్మనీ): సీమెన్స్ తమ ఎలక్ట్రానిక్ తయారీ విభాగంలో ముఖ్యంగా జర్మనీలోని అంబెర్గ్ ప్లాంట్‌లో 99.99శాతం క్వాలిటీ రేటును నమోదు చేసింది.

టెస్లా (USA): ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ టెస్లా గిగాఫ్యాక్టరీలలో ఆటోమేషన్‌ను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో పూర్తిగా ఆటోమేటిక్ ఉత్పత్తికి మారాలని లక్ష్యంగా పెట్టుకుంది.

లైట్స్-అవుట్ CNC మ్యాచింగ్ (చైనా): చైనా CNC (కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్) మ్యాచింగ్‌లో డార్క్ ఫ్యాక్టరీలను ఎక్కువగా తీసుకొస్తున్న దేశం.అనేక చైనా కంపెనీలు ఖచ్చితమైన ఇంజనీరింగ్, భారీ ఉత్పత్తి కోసం లైట్స్-అవుట్ ఉత్పత్తికి మారారు.

భవిష్యత్తులో 'డార్క్ ఫ్యాక్టరీ'లు

ఆటోమేషన్, AI వాడకం పెరుగుతున్న దృష్ట్యా, భవిష్యత్తులో 'డార్క్ ఫ్యాక్టరీ'ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది తయారీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుంది. అయితే ఉద్యోగాల భర్తీ, కార్మిక మార్కెట్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.