'కొత్త దలైలామా..' చైనా మాట చెల్లకుంటే ప్రపంచంలో రగడే
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా. టిబెట్ ప్రజల ఆరాధ్య దైవం. అలాంటి దలైలామా దాదాపు 70 ఏళ్లుగా భారత్ లోనే ఉంటున్నారు.
By: Tupaki Desk | 2 July 2025 10:00 PM ISTబౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా. టిబెట్ ప్రజల ఆరాధ్య దైవం. అలాంటి దలైలామా దాదాపు 70 ఏళ్లుగా భారత్ లోనే ఉంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలను తన స్థావరంగా చేసుకున్నారు.
భారత్-చైనా మధ్య 1960ల ప్రారంభంలో యుద్ధానికి మూల కారణం దలైలామా అంశమే. చైనా నిర్బంధాన్ని ఎదిరించి దలైలామా తన శిష్యులతో భారత్ కు రావడం.. ఆయనను అప్పగించాలని డ్రాగన్ కోరినా తిరస్కరించడం చివరకు చైనా మన మీద యుద్ధానికి దిగడం అంతా చరిత్రే.
మళ్లీ ఇప్పుడు దలైలామా వ్యవహారం దుమారం రేపుతోంది. ప్రస్తుత దలైలామాకు 90 ఏళ్లు. దీంతో కొత్త దలైలామాను ఎన్నుకోవాల్సిన సమయం వచ్చింది. అయితే, ఇందులో చైనా ప్రమేయం ఏమాత్రం ఉండదని ప్రస్తుత దలైలామా ప్రకటించడం వివాదానికి దారితీసింది.
తన తదనంతరమూ దలైలామా సంప్రదాయం కొనసాగుతుందని, అది కూడా చైనా చెప్పినట్లు కాదని దలైలామా తేల్చిచెప్పిన గంటల్లోనే.. చైనా స్పందించింది. కొత్త దలైలామా ఎంపిక తమకు చెప్పే జరగాలని ప్రకటించింది.
దలైలామా 600 ఏళ్లుగా కొనసాగుతున్న బౌద్ధ సంప్రదాయం. ప్రస్తుత ఆధ్యాత్మిక నేత 70 ఏళ్లకుపైగా కొనసాగుతున్నారు. కొత్త నాయకుడి ఎన్నిక చేపట్టాల్సిన నేపథ్యంలో ఈ బాధ్యతను గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ కు అప్పగించారు దలైలామా. దీనిని దలైలామానే 2011లో స్థాపించారు. కొత్త దలైలామా గుర్తింపును ఈ సంస్థే చేపడుతుందని దలైలామా తాజాగా ప్రకటించారు. తన వారసత్వం కొనసాగాలని టిబెట్, మంగోలియా, రష్యా, చైనాలోని మద్దతుదారుల నుంచి అభ్యర్థనలు వస్తున్నట్లు తెలిపారు.
కాగా, టిబెట్ ఒకప్పడు స్వతంత్ర రాజ్యం. చైనా కాలక్రమంలో దాన్ని కలిపేసుకుంది. ఆ దేశ ప్రభుత్వం గోల్డెన్ అర్న్ అనే పద్ధతిలో తమ అనుకూల వ్యక్తిని దలైలామా చేయాలని చూస్తోంది. దీన్ని ప్రస్తుత దలైలామా ఖండిస్తున్నారు. అసలు ధర్మాన్నే నమ్మని కమ్యూనిస్టులు.. పునర్జన్మల మీద ఆధారపడిన తవ వ్యవస్థలో జోక్యం చేసుకోవడాన్ని ఖండిస్తున్నారు.
ఈ నెల 6న దలైలామా 90వ పుట్టిన రోజు. సరిగ్గా దీనికి నాలుగు రోజుల ముందు కొత్త వారసుడి ఎంపిక రగడ రేగింది. ప్రస్తుత ఆధ్యాత్మిక నేత పేరు టెన్జిన్ గ్యాట్సో. ఈయన 14వ దలైలామా. 1935లో టిబెట్ టాక్సేర్ గ్రామంలో పుట్టగా.. 1940లో దలైలామాగా గుర్తించారు. 1950లో టిబెట్ ను చైనా ఆక్రమించగా.. 1959లో టిబెట్ ప్రజలు తిరుగుబాటు చేశారు. దలైలామాను వేర్పాటువాదిగా చైనా ముద్ర వేసింది. అనంతర పరిణామాల్లో ఆయన తన శిష్యులతో భారత్ లోకి వచ్చేశారు. ఇక దలైలామా ఎంపికలో చైనా ప్రమేయాన్ని అమెరికా కూడా వ్యతిరేకిస్తోంది. ఇది చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
