Begin typing your search above and press return to search.

దలైలామా వారసత్వం ఎవరిది? భారత్, చైనా వాదనేంటి?

జూలై 3న భారతదేశంలోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ ఎక్స్ పోస్ట్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   6 July 2025 11:00 PM IST
దలైలామా వారసత్వం ఎవరిది? భారత్, చైనా వాదనేంటి?
X

దలైలామా వారసత్వ వ్యవహారం మరోసారి అంతర్జాతీయ చర్చకు తెర లేపింది. చైనా, టిబెట్, భారత్ మధ్య సున్నితమైన అంశంగా కొనసాగుతున్న ఈ విషయంలో దలైలామా తన వారసుడిని ఎంచుకునే ప్రక్రియపై స్వయంగా నిర్ణయం తీసుకోలేరని చైనా తేల్చిచెప్పింది. అయితే, దీనికి భారత ప్రభుత్వం ధీటుగా బదులివ్వడంతో ఈ వివాదం మరింత జటిలమైంది.

చైనా వాదన: దలైలామాకు వారసత్వ ప్రక్రియపై అధికారం లేదు

జూలై 3న భారతదేశంలోని చైనా రాయబారి షూ ఫెయిహాంగ్ ఎక్స్ పోస్ట్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. "దలైలామా పునర్జన్మ ప్రక్రియను నిర్ణయించగల అధికారం దలైలామాకు లేదని" ఆయన స్పష్టం చేశారు. టిబెట్ బౌద్ధంలో 700 సంవత్సరాల చరిత్ర కలిగిన పునర్జన్మ వ్యవస్థలో దలైలామా కేవలం ఒక భాగం మాత్రమేనని, దానిపై ఆయనకు మించిపోయే అధికారం లేదని చైనా నొక్కి చెప్పింది.

చైనా ప్రకారం, జిజాంగ్ (టిబెట్), సిచువాన్, యునాన్, గన్సు, క్వింగ్‌హాయ్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వేలాది "లివింగ్ బుద్ధ" పునర్జన్మ పద్ధతులు అమలులో ఉన్నాయి. ఇది చైనాలో కొనసాగుతున్న చారిత్రక సంప్రదాయమని చైనా పేర్కొంది. చైనా అధికారిక ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే భారత ప్రభుత్వం దీనిపై స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

భారత ప్రభుత్వ కౌంటర్: దలైలామాకు పూర్తి హక్కు ఉంది

చైనా వ్యాఖ్యలకు ప్రతిగా, భారత ప్రభుత్వ మంత్రి కిరణ్ రిజిజు జూలై 2న కీలక ప్రకటన చేశారు. "బౌద్ధ సంప్రదాయాలను కొనసాగించే హక్కు దలైలామాకు ఉంది" అని ఆయన అన్నారు. ఇది చైనా వాదనకు సరైన ప్రతిస్పందనగా మారింది. దీనితో భారత్ మొదటిసారి అధికారికంగా దలైలామా వారసత్వ అంశంపై తన వైఖరిని వెల్లడించింది. దీని ద్వారా భారత్, టిబెట్ బౌద్ధ సంప్రదాయాలకు స్పష్టంగా మద్దతుగా నిలుస్తుందని రుజువైంది. దలైలామా వారసత్వ ప్రక్రియలో బయటి జోక్యాన్ని భారత్ వ్యతిరేకిస్తోందని ఈ ప్రకటన ద్వారా అర్థమవుతుంది.

దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

దలైలామా పునర్జన్మ ప్రక్రియ చాలా విశిష్టమైనది, బౌద్ధ సంప్రదాయాల ప్రకారం జరుగుతుంది. ప్రస్తుత దలైలామా మరణించిన తర్వాత టిబెట్ లోని బౌద్ధ సన్యాసులు లామో లాత్సో సరస్సు వద్ద తపస్సు చేస్తారు. వారికి కలల్లో కొత్త అవతారం కనిపిస్తాడని నమ్మకం ఉంది. దలైలామా మృతదేహం యొక్క దిశ, లేదా అంత్యక్రియల పొగ దిశ ఆధారంగా పరిశోధన మొదలవుతుంది. ఒక బాలుడు దలైలామా పోలికలతో కనిపిస్తే, ఆయనకు దలైలామా వాడిన వస్తువులు చూపించి గుర్తింపు పరీక్ష చేస్తారు. దలైలామా స్థానాన్ని అధికారికంగా గుర్తించే అధికారం పంచెన్ లామాకు ఉంటుంది. అయితే ప్రస్తుతం చైనా నియంత్రణలో ఉన్న పంచెన్ లామాపై వివాదం ఉంది.

చైనా – టిబెట్ రాజకీయ వైషమ్యం

1950ల నుండి టిబెట్ చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. 1959లో దలైలామా భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందిన తర్వాత చైనా ఆయన్ని తమకు వ్యతిరేకిగా చూస్తోంది. దలైలామా వారసత్వంపై అధికారం తమకే ఉందని చైనా పదేపదే చెబుతూ వస్తోంది. చైనా ఒక పెంపుడు దలైలామాను నియమించి, టిబెట్ ప్రజలపై తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

దలైలామా వారసత్వ వివాదం కేవలం మతపరమైన అంశం మాత్రమే కాదు, ఇది మానవ హక్కులు, ధర్మ పరిరక్షణ, ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం వంటి విస్తృత పరిప్రేక్ష్యాలతో ముడిపడి ఉంది. ఈ విషయంలో చైనా లేదా దలైలామా మాత్రమే నిర్ణయించాల్సిన విషయం కాదని, ప్రపంచం మొత్తం టిబెట్ మత సంస్కృతిని గౌరవిస్తూ, రాజకీయాల ప్రమేయం లేకుండా ఈ వ్యవహారాన్ని చూడాలని అనేక అంతర్జాతీయ సంస్థలు, దేశాలు వాదిస్తున్నాయి. ఈ వివాదం భవిష్యత్తులో భారత్-చైనా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.