Begin typing your search above and press return to search.

110 ఏళ్ళు జీవిస్తానంటున్న దలైలామా...చైనాకు షాక్

అయితే కొత్త దలైలామా ఎంపిక అధికరం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని ఇటీవలే దలైలామా తేల్చి చెప్పారు.

By:  Tupaki Desk   |   6 July 2025 10:00 AM IST
110 ఏళ్ళు జీవిస్తానంటున్న దలైలామా...చైనాకు షాక్
X

మరో మూడు దశాబ్దాల పాటు తాను జీవిస్తాను అని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో చెప్పారు. ఇది తనకు ఆ కరుణామయుడైన బోధిసత్వుడు ప్రసాదించిన వరంగా చెబుతున్నారు. ఆయన నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతోనే తాను కచ్చితంగా 110 ఏళ్ళకు పైబడి జీవిస్తాను అని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే జూలై 6న 14వ దలైలామా పుట్టిన రోజు.

దాంతో ఆయన దీర్ఘాయుష్షుతో ఉండాలని భక్తులు ప్రార్ధనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దలైలామా కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితం మరిన్ని దశాబ్దాల పాటు కొనసాగడం, అంటే మానవ జాతికి సేవ చేయడం కోసమే అని అన్నారు. అంతే కాదు టిబెటన్ ప్రజలకు మరింత సేవ చేయడానికే తన జీవితం అంకితం చేస్తాను అని చెప్పారు. తనకు కరుణామయుడైన బోధిసత్వుడు ఇచ్చిన కాలాన్ని ప్రజల సేవ కోసమే ఉపయోగించుకుంటాను అన్నారు.

ఇదిలా ఉండగా 90వ పడిలోకి ప్రవేశిస్తున్న 14వ దలైలామా పుట్టిన రోజు వేడుకలు ఆధ్యాత్మిక వైభవంగా ఒక వైపు సాగుతూంటే మరో వైపు 15వ దలైలామా ఎంపిక పట్ల అంతర్జాతీయంగా చర్చ సాగుతోంది. దలైలామా వారసత్వం ఎంపిక మీద ఎవరికి అధికారం ఉంది అన్నదే చర్చగా సాగుతోంది.

అయితే కొత్త దలైలామా ఎంపిక అధికరం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని ఇటీవలే దలైలామా తేల్చి చెప్పారు. దానికి మద్దతు ఇస్తూ భారత్ ప్రకటన చేసింది. అయితే చైనా ఈ విషయం మీద ఫైర్ అయింది. తమ అంతర్గత వ్యవహారాలలో భారత్ జోక్యం చేసుకుంటోంది అని ఆగ్రహించింది. నిజానికి చూస్తే టిబెట్ స్వతంత్ర దేశంగా ఉన్నప్పటికీ దానికి 1959 ప్రాంతంలో చైనా దురాక్రమించింది.

ఆనాడు 14వ దలైలామా భారత్ కి వలస వచ్చేశారు. నాటి నుంచి ఆయన ధర్మశాలలోనే విడిది చేస్తూ అక్కడ నుంచే టిబెటెన్లకు ఆధ్యాత్మిక బోధను చేస్తున్నారు. అయితే ఇపుడు ఆయన వయసు 90కి చేరువ కావడంతోనే కొత్త వారసుడు ఎవరు అన్నది పెద్ద చర్చ నుంచి రచ్చగా మారుతోంది.

అయితే ఇప్పటికి చాలాకాలం క్రితమే అంటే 2011 సెప్టెంబర్ 24వ తేదీన దలైలామా టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడు ఎవరు ఆయన ఎంపిక ఎలా కొనసాగాలి అనే అంశంపై అభిప్రాయాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఎవరికీ లేదని చైనాను ఉద్దేశించి అన్నారు. ఇపుడు అదే విషయం ఆయన కచ్చితంగా చైనాకు స్పష్టం చేశారు. అంతే కాదు ఇప్పటప్పట్లో తన వారసుడి వ్యవహారం కూడా రాదని మరో 30 ఏళ్ల పాటు తానే జీవిస్తాను అని కూడా ఆయన చెబుతున్నారు. అలా చైనాకు గట్టి షాక్ ఇచ్చారు అని అంటున్నారు.

ఇక భారత్ నుంచే గత కొన్ని దశాబ్దాలుగా తాను ప్రవాసంలో ఉంటున్నాను అని దలైలామా పేర్కొన్నారు. తాను . ధర్మశాల నుంచి తాను అనేక మందికి ప్రయోజనం చేకూర్చగలిగానని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవ చేయాలని తాను కోరుకుంటున్నట్లుగా పుట్టిన రోజున ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశంలో ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉంటే దలైలామా మానవ సేవకు దర్పణంగా నిలిచారు. ఆయన శాంతిని సౌభాతృత్వాన్ని కోరుకుంటూ సమాజాన్ని ఆ దిశగా నడిపిస్తున్నారు. ప్రపంచమంతా శాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన అహింసా మార్గం కానీ ఆయన బోధనలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మందికి స్పూర్తిగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు భక్త కోటి ఉంది. 90 ఏళ్ల దలైలామా ఆయన చెప్పినట్లుగానే మరో మూడు దశాబ్దాల కాలం జీవించాలని అంతా కోరుకుంటున్నారు.