Begin typing your search above and press return to search.

చిన్న‌మ్మ‌.. కేరాఫ్ రాజ‌మండ్రి!

కానీ, చిత్రం ఏంటంటే.. బీజేపీ చీఫ్‌గా పురందేశ్వ‌రి మాత్రం.. ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌

By:  Tupaki Desk   |   6 May 2024 4:43 AM GMT
చిన్న‌మ్మ‌.. కేరాఫ్ రాజ‌మండ్రి!
X

ఏపీ బీజేపీ పార్టీలో క‌ల్లోలం క‌నిపిస్తోంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు ఎక్క‌డా అందుబాటులో లేకుండా పోయార‌నే వాద‌న వినిపిస్తోంది. సాధార‌ణంగా ఏ పార్టీ చీఫ్ అయినా.. తాను పోటీ చేస్తూ.. త‌న వారిని గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌లు ఇప్పుడు అదే ప‌నిపై బిజీగా ఉన్నారు.

కానీ, చిత్రం ఏంటంటే.. బీజేపీ చీఫ్‌గా పురందేశ్వ‌రి మాత్రం.. ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. అంతేకాదు .. ఫోన్ నెంబ‌రును కూడా మార్చేసుకున్న‌ట్టు నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. కూట‌మి పొత్తులో భాగం గా బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్ల‌మెంటు స్థానాల‌ను తీసుకుంది. వీటిలో దాదాపు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఒక్క అన‌ప‌ర్తిలో మాత్రం కూట‌మికి చిక్కులు వ‌చ్చాయి. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాలు ఓకే. మ‌రి ఇలాంటి కీల‌క స‌మ‌యంలో పార్టీ రాష్ట్ర చీఫ్‌గా వారి త‌ర‌ఫున కూడా.. ప్ర‌చారం చేయాలి.

కానీ, పురందేశ్వ‌రి ఈ బాధ్య‌త‌ల‌ను వ‌దిలేశార‌నేది.. కీల‌క నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌. క‌నీసం త‌మ‌కు అందుబాటులో కూడా లేకుండా పోయార‌ని.. ఫోన్ నెంబ‌రు కూడా మార్చుకున్నార‌ని..ఆఫీస్ కు ఫోన్ చేస్తే.. మేడం అందుబాటులో లేరని చెబుతున్నార‌ని.. ప‌లువురు నాయ‌కులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఎందుకంటే.. ఎన్టీఆర్ కుమార్తెగా ఆమె వ‌చ్చి క‌నీసం ఒక్క రోజైనా ప్ర‌చారం చేస్తే.. తమ గెలుపు ఖాయ‌మ‌ని వారు అంచ‌నా వేసుకుంటున్నారు.

అయితే.. పురందేశ్వ‌రి త‌న గెలుపు కోస‌మే శ్ర‌మించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాజ‌మండ్రి నుంచి బ‌రిలో ఉన్న పురందేశ్వ‌రి.. త‌న గెలుపు కోసం.. వ్యూహ ప్ర‌తివ్యూహాలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. దీనిలోనే ఆమె తీరిక లేకుండా ప‌నిచేస్తున్నారు. రాజ‌మండ్రి నుంచి గెలుపు బీజేపీకి అంత ఈజీకాదని ఆమె అభిప్రాయం. దీంతో క్షేత్ర‌స్థాయిలో ఆమె ప‌ర్య‌టిస్తున్నారు. ఫ‌లితంగా ఇత‌ర నేత‌ల‌కు క‌నీసం ఫోన్‌లలో కూడా అందుబాటులోకి రావ‌డం లేదు. దీంతో ఆమె ఒక‌వైపే చూస్తున్నారంటూ.. నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. మ‌రో వారంలో ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా పురందేశ్వ‌రి ఇత‌ర స్థానాల‌పైనా దృష్టి పెడ‌తారా? లేక‌.. త‌న నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం అవుతారా? అనేది చూడాలి.