మాస్టార్ ని కరుణించరా బాబూ !
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ లీడర్ గా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఉన్నారు.
By: Tupaki Desk | 21 April 2025 3:00 AM ISTఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ లీడర్ గా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఉన్నారు. ఆయన టీడీపీ నుంచే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. నాలుగు సార్లు వరసగా అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు దశాబ్దాల పాటు శాసనసభలో ఒక వెలుగు వెలిగారు. మంత్రి పదవులు అందుకున్నారు. అలా ఆయన జిల్లాలో చక్రం తిప్పారు.
ఎన్ టీఆర్ తరువాత చంద్రబాబు ఆయనకు ప్రోత్సహించి 2007లో ఏపీలో ఏర్పాటు అయిన శాసనమండలిలో ఎమ్మెల్సీని చేయడమే కాదు ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ పదవిని కట్టబెట్టారు. ఆ పదవి 2013లో పూర్తి కావడంతో రెండోసారి రెన్యూవల్ చేయలేదని అలిగి దాడి ఒక దారుణమైన రాంగ్ స్టెప్ వేశారు.
ఆనాడు జైలులో ఉన్న జగన్ కి కలసి మరీ వైసీపీలో చేరిపోయారు. అదే ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయం అయింది. వైసీపీలో ఆయన కుమారుడికి అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఆశిస్తే విశాఖ పశ్చిమ టికెట్ దక్కింది. ఆయన ఓటమి పాలు అయ్యారు. దాంతో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పట్లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
దాంతో దాడి సైకిలెక్కుదామని చూశారు కానీ వీలుపడలేదు ఇక 2019లో మళ్ళీ వైసీపీలో చేరారు. కానీ తనకు ఎమ్మెల్సీ దక్కలేదు, కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. అయిదేళ్ళ పాటు అక్కడ ఉండి 2024 ఎన్నికల ముందు మళ్ళీ టీడీపీలో చేరారు. అయితే ఇలా పార్టీలు అటూ ఇటూ మారిన దాడికి పూర్వం ఉన్న విలువ అయితే టీడీపీలో దక్కడం లేదు అని అంటున్నారు.
దాడి టీడీపీని వీడడంతో తరువాత తరం నాయకులు వచ్చేశారు. వారంతా పార్టీలో ఇపుడు కీలకంగా ఉన్నారు దాంతో టీడీపీలో దాడి మాస్టార్ ఉన్నారు అంటే ఉన్నారు కానీ ఏ రకమైన నామినేటెడ్ పదవి కుమారుడికి కానీ తనకు కానీ దక్కడం లేదు.
ఇదిలా ఉంటే చంద్రబాబు పుట్టిన రోజుని పురస్కరించుకుని దాడి ఆయనను విపరీతంగా పొగిడారు. పాలనా దక్షుడు అన్నారు. అభివృద్ధి కాముకుడు అన్నారు. గత అయిదేళ్ళూ ఏపీ విధ్వంసం అయింది అని అన్నారు. బాబు ఈజ్ గ్రేట్ అని అన్నారు. అయితే ఇదే దాడి వైసీపీలో ఉన్నపుడు బాబుని విమర్శిస్తూ వచ్చిన సంగతిని అంతా గుర్తు చేస్తున్నారు.
ఏమైనా ఏడున్నర పదుల వయసులో ఉన్న ఈ పెద్దాయన తన కుమారుడికి రాజకీయంగా అవకాశాల కోసం చూస్తున్నారు. మరి చంద్రబాబు దాడి పార్టీకి పూర్వం రోజులలో చేసిన సేవలను గుర్తు పెట్టుకుని ఆ కుటుంబానికి ఏదైనా నామినేటెడ్ పదవి అయినా ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే నామినేటెడ్ పదవులు అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి.
దాంతో పార్టీలో గతంలో ఉన్నా దాడి ఫ్యామిలీ తిరిగి కొత్తగా చేరినా వారి కిందనే చెబుతున్నారు. మరి వారికి పదవులు ఇస్తే మొదటి నుంచి పనిచేసిన వారి సంగతేంటి అన్న చర్చ వస్తుంది. పైగా పదవులు తక్కువ ఆశావహులు ఎక్కువ అన్నట్లుగా సీన్ ఉంది. దాంతో మాస్టార్ ఎంతగా స్తోత్ర పాఠాలు చదివినా బాబు కరుణిస్తారా అంటే ఏమో వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు.
