Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను పండుగ చేసుకోమంటోంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.

By:  Satya P   |   10 Feb 2026 9:26 AM IST
ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్
X

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను పండుగ చేసుకోమంటోంది బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం. భారీ నజరానా సిద్ధం చేసి మరీ వారికి ఇవ్వబోతోంది. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు అసలైన హోళీ పండుగ ఇదే అని చెబుతోంది. ఈసారి హోళీ పండుగకు కరవు భత్యాన్ని పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది.

వేతన సంఘం సిఫార్సులు :

నిజానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ సిఫార్సులతో కూడిన మధ్యంతర నివేదిక అయినా వస్తే ఒక్కసారిగా తమ జీతాలు రెట్టింపు అవుతాయని వారు ఎంతో ఊహిస్తున్నారు. అయితే ఈ నివేదిక రావడం ఆలస్యం కావచ్చు, ఎందుకంటే గత ఏడాది నుంచే ఈ నివేదికకు సంబంధించిన కసరత్తు మొదలైంది. కనీసంగా ఏడాది పట్టే వీలుంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం భారీ ఊరటను ఇస్తోంది. అది డీఏ పెంపు రూపంలో వారికి లభిననుంది.

పెంపుతో డీఏ :

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాదు లక్షలాది మంది పెన్షనర్లకు కూడా డీఏని అందిస్తారు. ఈసారి దానిని పెంచి మరీ ఇస్తారు. లేబర్ బ్యూరో డిసెంబర్ 2025 నెలకు సంబంధించిన ఏఐసీపీఐ-ఐడబ్లూ డేటాను తాజాగా విడుదల చేసింది. ఈ గణాంకాల ఆధారంగానే ఇపుడు డీఏలో పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. రెండు శాతం నుంచి మూడు శాతం పెంచుతూ ఆ పెరుగుదలతో కూడిన డీఏని కేంద్రం విడుదల చేస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు భారీ మొత్తాలు చేతికి అందే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ఏటా రెండు సార్లు :

మారుతున్న కాలానికి పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగినట్లుగా డీఏ పెంపు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ ఏడాదిలో రెండు సార్లు అంటే జనవరి, జూలై నెలలలో ఈ డీఏను రిలీజ్ చేస్తాయి. ఇక రాష్ట్రాలు ఆర్ధిక ఇబ్బందుల వల్ల డీఏ బకాయిలు పెట్టవచ్చు కానీ కేంద్రం మాత్రం ఠంచనుగా ఇస్తుంది. ఇక ఈ జనవరిలో రావాల్సిన డీఏని ఏడవ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగానే ఇస్తున్నా అందులో రెండు శాతం పెంపు ఉంటుందని అలా ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు ఆలస్యం అయినా ఆ ఇబ్బంది లేకుండా చూస్తారు అని అంటున్నారు. దీంతో ఉద్యోగులలో ఆనందం అయితే కనిపిస్తోంది. తొందరలోనే తమ వేతనాలలో పెరుగుదల కనిపిస్తుందని వారు భావిస్తున్నారు.

మధ్యంతర నివేదిక :

అదే సమయంలో ఎనిమిదవ వేతన సంఘం తుది నివేదిక ఆలస్యం అవుతుంది కాబట్టి మధ్యంతర నివేదిక అయినా ఇచ్చి ఈ ఏడాదిలోనే తమ జీతాలు పెంచేలా చూడాలని కోరుతున్నారు. ఉద్యోగుల విషయంలో ఉదారంగా ఉంటామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవచ్చు అన్న మాట కూడా ఉంది.