దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ....ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
కానీ ఇపుడు దిత్వా దూసుకుని వస్తోంది దీని ప్రభావం ఎక్కువగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల మీద ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
By: Satya P | 29 Nov 2025 6:43 AM ISTవరస తుఫాన్లతో ఏపీ అల్లాడుతోంది. గత నెల మొంథా తుఫాన్ ఏపీని వణికించింది. ఇక ఈ మధ్యలోనే సెన్యార్ తుఫాన్ విరుచుకుపడుతుంది అనుకున్నారు. కానీ ఆ ముప్పు తప్పిపోయింది. కానీ ఇపుడు దిత్వా దూసుకుని వస్తోంది దీని ప్రభావం ఎక్కువగా రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల మీద ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నయని అంటున్నారు.
నెమ్మదిగానే :
ప్రస్తుతానికి అయితే దిత్వా తుఫాన్ నెమ్మదిగానే కదులుతోంది. ఇది నైరుతి బంగాళాఖాతం ఆనుకుని ఉన్న శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతం అయి ఉంది. ఇక శ్రీలంకలోని ట్రింకోమలీకి అలాగే పుదుచ్చేరి, చెన్నైకి మధ్యన కేంద్రీకృతం అయీన్ దిత్వా రానున్న రెండు రోజులలో తన ధాటిని చూపిస్తుంది అని అంటున్నారు.
అతి భారీ వర్షాలు :
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా రాయలసీమ జిల్లాలోనే ఉండబోతోంది అని అంటున్నారు. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటే చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. ఇక కోస్తా జిల్లాలలో అయితే ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శని ఆది వారాలల్లో రాష్ట్రాంలో దిత్వా ఎఫెక్ట్ అయ్యే జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాలు కూడా అలెర్ట్ గా ఉండాలని రాష్ట్ర విపత్తుల ప్రతిస్పందన సంస్థ తెలియచేస్తోంది. మత్స్యకారులు అయితే డిసెంబర్ 2వ తేదీ వరకూ వేటకు వెళ్ళరాదని సూచిస్తోంది. అలాగే రైతులు పంట నష్టం సంభవించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది.
ఫుల్ అలెర్ట్ తోనే :
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అయ్యే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావాణ అధికారులు చెబుతున్నారు. దాంతో అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ఈ నెల 30న తెల్లవారుజామున దిత్వా తుఫాన్ నైరుతి బంగాళాఖాతం ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు చేరే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దాంతో ఎఫెక్టెడ్ జిల్లాలలో ఏకంగా 20 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
