Begin typing your search above and press return to search.

ఏపీకి వేల కోట్ల నష్టం... కేంద్రం పైనే ఆశలు

ఏపీలో ఆర్నాబ్ తుఫాన్ వేలాది కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. మూడు రోజుల పాటు ఏపీ మీద దండయాత్ర చేసింది.

By:  Satya P   |   31 Oct 2026 7:00 AM IST
ఏపీకి వేల కోట్ల నష్టం... కేంద్రం  పైనే ఆశలు
X

ఏపీలో ఆర్నాబ్ తుఫాన్ వేలాది కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది. మూడు రోజుల పాటు ఏపీ మీద దండయాత్ర చేసింది. ఒక రోజంతా ఏపీ మీదనే నిలిచి ఉంది. దాంతో ఊహకు అందని విధంగా భారీ నష్టం సంభవించింది. ప్రాథమిక అంచనాలు చూస్తే ఏపీకి 4,600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. దాంతో కేంద్రం ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వినతి చేశారు. తుఫాన్ ముగిసిన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి బాబు నష్టం గురించి వివరించారు. అంతే కాదు కేంద్ర బృందాలను వెంటనే పంపించాలని కోరారు. కేంద్రం సైతం సానుకూలంగా స్పందించింది. దాంతో రెండు రోజుల పర్యటనకు ఏపీకి కేంద్ర బృందం వస్తోంది.

భారీ నష్టమే అంటూ :

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఆర్నాబ్ తుఫాను కారణంగా ప్రాథమికంగా 4600 కోట్లు వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆయన తుఫాను బాధిత ప్రాంతాలలో పర్యటన అనంతరం మాట్లాడుతూ ఊహించని నష్టం అన్నారు. తాను అయితే క్షేత్రస్థాయిలో అర్నబ్ తుఫాను ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూశానని ఆయన చెప్పారు. భారీగానే మౌలిక సదుపాయాలకు నష్టం వచ్చిందని అన్నారు. 15 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు నేల కూలాయని ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 12,500 చెట్లు నేల కూలాయని అన్నారు. అలాగే పెద్ద ఎత్తున వరిపంట కూడా దెబ్బతిందన్నారు.

అంచనా వేయాల్సిందే :

ఇక ఏపీలో అర్నబ్ తుపాను నష్టం అంచనాకు కేంద్ర బృందం ఈ నెల 31, నవంబర్ 1 తేదీలలో ప్రభావిత జిల్లాల్లో పర్యటించనుంది. ఈ బృందం రెండుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పర్యటిస్తుందని చెబుతున్నారు. ఒక బృందం కోనసీమ కాకినాడ జిల్లాలలో మరో బృందం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో నష్టాన్ని పరిశీలిస్తుంది. ఆ మీదట ఈ బృందం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుంది. ఈ సందర్భంగా ఒక అంచనాకు ఈ బృందం వస్తుందని చెబుతున్నారు.

కరవు బృందం సైతం :

అదే విధంగా చూస్తే ఈ నవంబర్ 2వ తేదీ నుంచి ఏపీలో కరవు పరిస్థితులపై మరో బృందం అధ్యయనం చేయనుంది. 2026 ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న కరవు పరిస్థితులను అంచనా వేసేందుకు కేంద్ర బృందం రానుంది. శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో ఈ బృందం పర్యటించి రైతులు, అధికారులతో మాట్లాడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 283 మండలాలను తీవ్ర కరవు మండలాలుగా 105 మండలాలను మధ్యస్థ కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. కరువు బృందం నవంబర్ 4న ముఖ్యమంత్రితో భేటీ కానుంది.

రెండు వైపులా ఇబ్బంది :

మొత్తం మీద ఏపీకి వరదలు కరవు ఒకేసారి వచ్చాయి. ఆర్నాబ్ తుఫాను వల్ల వరదలు పెద్ద ఎత్తున కోస్తా జిల్లాలలో అతలాకుతలం చేసి పంటలను నాశనం చేస్తే ఎల్ నినో ప్రభావంతో ఖరీఫ్ సీజన్ అంతా దెబ్బ తిని రాయలసీమ మొత్తం మీద కరవు విలయతాండవం చేస్తోంది. దాంతో ఈ రెండు బృందాలు ఒకసారి ఏపీకి రావడం విశేషం. మరి ఈ కేంద్ర బృందాలు ఏ రకమైన అంచనాలు వేస్తాయి, కేంద్రం ఏ విధంగా సత్వర న్యాయం చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.