Begin typing your search above and press return to search.

లైక్ కొడితే రూ.600 అని చెప్పి రూ.59 లక్షలు కొట్టేశాడు

తాజాగా వెలుగు చూసిన ఉదంతాన్ని చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. లైకులు కొడితే డబ్బులు వస్తాయన్న ఆశను చూపేసి.. ఏకంగా రూ.59 లక్షలు దోచేసిన ఘరానా మోసం వెలుగు చూసింది.

By:  Tupaki Desk   |   26 Sep 2023 4:42 AM GMT
లైక్ కొడితే రూ.600 అని చెప్పి రూ.59 లక్షలు కొట్టేశాడు
X

‘డబ్బులు ఊరికే రావు’ అన్న చిన్న లాజిక్ ను మిస్ అవుతున్న దానికి బదులు లక్షలాది రూపాయిల్ని కోల్పోవాల్సిన దుస్థితి. గతానికి భిన్నంగా ఆన్ లైన్ లో ఈజీగా డబ్బుల్ని సంపాదించొచ్చన్న ఆశను రేపి.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టేస్తున్న సైబర్ నేరగాళ్లు అంతకంతకూ పెరుగుతున్నారు. గతంలో అయితే.. అవగాహన లేదని అనుకోవచ్చు. గడిచిన మూడు నాలుగేళ్లలో ఈ తరహా మోసాలు అంతకంతకూ పెరగిపోతున్నా.. వాటి ఉచ్చులో పడిపోవటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న.

తాజాగా వెలుగు చూసిన ఉదంతాన్ని చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. లైకులు కొడితే డబ్బులు వస్తాయన్న ఆశను చూపేసి.. ఏకంగా రూ.59 లక్షలు దోచేసిన ఘరానా మోసం వెలుగు చూసింది. పోలీసులు సైతం అవాక్కు అయిన ఈ ఉదంతంలోకి వెళితే.. మణికొండకు చెందిన ఒక యువతి బీటెక్ పూర్తి చేసి.. ఒక ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. సెప్టెంబరు తొలి వారంలో ఆమెను షైలా అనే మహిళ వాట్సాప్ లో సంప్రదించింది.

తమ సంస్థ వెబ్ సైట్ ప్రచారం కోసం కొందరిని సంప్రదిస్తున్నామని.. అందులో భాగంగా ఆమెను ఎంపిక చేసుకున్నట్లుగా పేర్కొంది. తాము పంపిన వాటికి లైకులు కొట్టి.. స్క్రీన్ షాట్లు పంపితే.. డబ్బులు ఇస్తామని ఆశ చూపించింది. దీన్ని నమ్మిన సదరు యువతి.. షైలా చెప్పిన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అయ్యింది. రోజుకు 23 టాస్కులు పూర్తి చేయాలని.. ఒక్కో టాస్కులో లైకులు కొట్టి స్క్రీన్ షాట్లను గ్రూప్ లో పోస్టు చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పింది.

సెప్టెంబరు 5న కొన్ని టాస్కులు పూర్తి చేయగానే రూ.200చొప్పున మూడు సార్లు రూ.600 మొత్తాన్ని సదరు యువతి ఖాతాకు జమ చేసింది. ఆ తర్వాత మరో వ్యక్తి బాధితురాలిని ఫోన్ ద్వారా సంప్రదించి.. ఇకపై టాస్కులు ఇవ్వాలంటే ముందస్తుగా డబ్బులు కట్టాలని.. టాస్కులు పూర్తి అయ్యాక కట్టిన డబ్బులతోపాటు మిగిలిన డబ్బులు కూడా ఇస్తామని నమ్మించాడు. దీన్ని నమ్మిన ఆమె.. నాలుగు రోజుల్లో రూ.59.2 లక్షల మొత్తాన్ని జమ చేసింది. ఎంతకూ డబ్బులు తిరిగి రావటంతో.. చివరకు తాను మోసపోయినట్లుగా గుర్తించింది.

సైబర్ పోలీసుల్ని సంప్రదించి కంప్లైంట్ చేసింది. చదువుకొని.. జాబ్ చేస్తూ కూడా.. టాస్కుల పేరుతో వచ్చే చిన్నపాటి మొత్తం కోసం ఆశ పడిన వైనం చూసిన పోలీసులు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఆన్ లైన్ లో ఆశ పడితే.. అడ్డంగా బుక్ అయిపోతారన్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు.