Begin typing your search above and press return to search.

లండన్ లో కుమారుడు - హైదరాబాద్ లో తల్లి.. సైబర్ క్రైమ్ ఎలా అంటే..!

ఈ నేపథ్యంలో తాజాగా లండన్ లో ఉన్న కొడుకు పేరు చెప్పి, హైదరాబాద్ లో ఉన్న వృద్ధురాలైన అతని తల్లిని మోసం చేశారు.

By:  Raja Ch   |   18 Oct 2025 8:15 AM IST
లండన్  లో కుమారుడు - హైదరాబాద్  లో తల్లి.. సైబర్  క్రైమ్  ఎలా అంటే..!
X

ఇటీవల కాలంలో దేశంలో సైబర్ నేరాలకు బలవుతున్న అమాయకుల సంఖ్య పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా, ప్రజలు ఎంతోకొంత అప్రమత్తంగా ఉన్నా.. సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఎమోషన్స్ తో ఆడుకుంటూ అమాయకులను అడ్డంగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ లో అలాంటి నేరమే ఒకటి వెలుగు చూసింది.

అవును... అవగాహన లేక, అమాయకత్వంతోనో, ఆ పరిస్థితుల్లో ఏమీ చేయలేకో తెలియదు కానీ ఇటీవల సైబర్ నేరాల బాధితులుగా మిగులుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది! ఈ నేపథ్యంలో తాజాగా లండన్ లో ఉన్న కొడుకు పేరు చెప్పి, హైదరాబాద్ లో ఉన్న వృద్ధురాలైన అతని తల్లిని మోసం చేశారు. ఈ క్రమంలో ఆమె నుంచి విడతలవారీగా రూ.35.23 లక్షలు దోచుకున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్‌ కు చెందిన 61 ఏళ్ల వృద్ధురాలికి వాట్సప్‌ కాల్‌ వచ్చింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి.. తన పేరు స్టీవ్‌ అని, తాను లండన్‌ లో డాక్టర్‌ గా పనిచేస్తున్నాని పరిచయం చేసుకున్నాడు. అనంతరం.. లండన్‌ విమానాశ్రయంలో మీ కుమారుడికి ప్రమాదం జరిగింది, తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పాడు. దీంతో సదరు వృద్ధురాలు ఒక్కసారిగా ఆందోళన చెందింది!

ఈ క్రమంలో మరింత కబుర్లు మొదలుపెట్టిన ఆ వ్యక్తి... మీ కుమారుడి లగేజీ మిస్‌ అయ్యిందని.. అతనికి సంబంధించిన ఎలాంటి ఐడెంటిటీ లేదని.. అందువల్ల ఏ ఆసుపత్రిలోనూ చేర్చుకోవటం లేదని ఆమెను నమ్మించాడు. దీంతో.. అతడి మాటలు పూర్తిగా నమ్మిన ఆ వృద్ధురాలు.. తన కుమారుడికి ఎలాగైనా చికిత్స అందించాలని ప్రాథేయపడింది.

ఈ విధంగా ఆమెను పూర్తిగా నమ్మించిన సదరు సైబర్ నేరగాడు.. ఆమె అమాయకత్వాన్ని, తల్లి ప్రేమను క్యాష్ చేసుకునే పనికి పూనుకున్నాడు. ఇందులో భాగంగా... ఆమె నుంచి విడతలవారీగా రూ.35.23 లక్షలు కొల్లగొట్టాడు!

ఈ క్రమంలో తన కుమారుడు ఎలా ఉన్నాడో చూసేందుకు ఫొటో కానీ, వీడియో గానీ పంపించాలని ఫోన్ లో వ్యక్తిని కోరగా.. కాల్‌ చేసిన వ్యక్తి అందుకు నిరాకరించాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితురాలు అప్పుడు కుమారుడిని కాంటాక్టు చేసింది. అయితే.. తాను క్షేమంగా ఉన్నానని, ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పడంతో విషయం అర్ధం చేసుకుంది.

ఈ సందర్భ్గంగా.. తాను మోసపోయానని గ్రహించిన వృద్ధురాలు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు! ఇలాంటి ఫోన్ కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే తమను సంప్రదించాలని పోలీసులు చెబుతున్నారు!