Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో సీడబ్య్లూసీ మీటింగా ?

తెలంగాణా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

By:  Tupaki Desk   |   1 Sep 2023 6:29 AM GMT
హైదరాబాద్ లో సీడబ్య్లూసీ మీటింగా ?
X

తెలంగాణా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 16, 17 తేదీల్లో పార్టీ వర్కింగ్ కమిటి సమావేశాలు హైదరాబాద్ లో జరిగే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు చెప్పాయి. అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించకపోయినా పార్టీ నేతలు మాత్రం అవుననే అంటున్నారు. ఇదే జరిగితే పార్టీ చరిత్ర సృష్టించినట్లే అనుకోవాలి. ఎందుకంటే ఇంతవరకు హైదరాబాద్ లో పార్టీ వర్కింగ్ కమిటి సమావేశం జరగలేదు.

తొందరలో జరగబోయే తెలంగాణా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సీడబ్య్లూసీ సమావేశం నిర్వహిస్తే పార్టీకి బాగా బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించారట. ఈమధ్యనే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ కోసమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చారు. చేవెళ్ళలో బహిరంగసభ భారీఎత్తున జరిగింది. ఆ సందర్భంగా ఖర్గేతో మాట్లాడిన రేవంత్ సీడబ్య్లూసీ మీటింగ్ హైదరాబాద్ లో పెట్టే విషయాన్ని ఆలోచించమని చెప్పినట్లు సామాచారం.

తర్వాత ఢిల్లీ వెళ్ళిన ఖర్గే ఇదే విషయాన్ని సోనియాగాంధి, రాహుల్, ప్రియాకంతో పాటు ముఖ్యనేతలతో చర్చించారట. దానికి అందరూ సానుకూలంగానే స్పందించారని పార్టీవర్గాలు చెప్పాయి. 16వ తేదీన సీడబ్య్లూసీ మీటింగ్ జరుపుకుని 17వ తేదీన తెలంగాణఆ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. అలాగే 18వ తేదీన భారీ బహిరంగసభ నిర్వహించాలన్నది ప్లాన్. ఈలోగానే ఎన్నికల్లో పాల్గొనబోయే మొదటి జాబితాను ప్రకటించాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారట.

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసినట్లే అన్నది రేవంత్ అండ్ కో భావన. అందుకనే ఇంత జోష్ గా ఉన్నారు. పార్టీకి 70 సీట్లలో విజయం ఖాయమని రేవంత్ అనుకుంటున్నారు. సీనియర్లందరినీ ఏకతాటిపైకి తీసుకురావటం, అభ్యర్ధుల ప్రకటనలో ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకోవటం, ప్రచారాన్ని కట్టుదిట్టంగా చేస్తే పార్టీ గెలుపు ఖాయమని సీనియర్లు అనుకుంటున్నారు. ఇదంతా సవ్యంగా జరగాలంటే సీడబ్ల్యూసీ మీటింగ్ హైదరాబాద్ లో జరిగి, భారీ బహిరంగసభ నిర్వహిస్తే ఎన్నికల శంకారావాన్ని పూరించినట్లే అని రేవంత్ అనుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.