అమరావతికి ముప్పేట ముప్పులా పెద్ద నగరాలు !
అలా చూస్తే కనుక రాయలసీమకు చెందిన సీవీ రెడ్డి అనే ఒక మేధావి రాజకీయ విశ్లేషకుడు తాజాగా అమరావతికి ఎదురు కాబోయే సవాళ్ళ గురించి వివరించే ప్రయత్నం చేశారు.
By: Tupaki Desk | 12 Jun 2025 12:59 AM ISTఅమరావతి రాజధాని మీద టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా కూటమి పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే అమరావతి రాజధానిని ప్రపంచ రాజధానిగా చేయాలని గత పదేళ్ళుగా తపిస్తున్నారు. మధ్యలో ఆయనకు అధికారం జారినా అమరావతి భాగ్యమో లేక చంద్రబాబు పుణ్యమో తెలియదు కానీ మళ్ళీ 2024లో పవర్ చేతికి వచ్చింది.
ఈసారి సోదిలోకి లేకుండా విపక్షం తీసికట్టు అయింది. కేంద్రంలో మోడీ సహకారం ఉంది. ఇకనేం అమరావతికి భవ్యమైన రాజధాని నిర్మాణం జరిగినట్లే అని అంతా అనుకుంటున్నారు. ఏపీకి అమరావతి మొత్తం దేశాన్నే తలదన్నేలా ఉండాలను అభివృద్ధికి కోరుకునే ఆంధ్రులు అంతా ఆశిస్తున్నారు.
అంతా బాగానే ఉంది కానీ అమరావతి భారీ కాన్వాస్ మీద భారీ డిజైన్లతో రూపుదిద్దుకోబోతున్న మహా నగరం. అమరావతి రాజధాని అన్నది నిజంగా అనుకున్నది అనుకున్నట్లుగా నిర్మాణం అయినా కూడా దానికి ముందూ వెనకా ఎన్నెన్ని సవాళ్ళు ఉన్నాయో పలువురు మేధావులు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. విశ్లేషిస్తూనే ఉన్నారు.
అలా చూస్తే కనుక రాయలసీమకు చెందిన సీవీ రెడ్డి అనే ఒక మేధావి రాజకీయ విశ్లేషకుడు తాజాగా అమరావతికి ఎదురు కాబోయే సవాళ్ళ గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఆయన మాట్లాడుతూ అమరావతికి ముప్పెటలా ముప్పే అన్ని చెప్పారు.
జియాగ్రికల్ గా చూసుకుంటే అమరావతి మధ్యలో ఉంది. ఒక వైపు హైదరాబాద్, మరో వైపు బెంగళూరు, ఇంకో వైపు చెన్నై ఉన్నాయి. మరి ఈ మూడు మెగా సిటీస్ ఆల్ రెడీ ఎస్టాబ్లిష్డ్ బిగ్ కాపిటల్స్ ఉండగా వాటిని దాటుకుని మరీ అమరావతికి వచ్చేది ఎవరు అని ఆయన ఒక లాజిక్ తో కూడిన ప్రశ్న సంధించారు.
అమరావతిలో పెట్టుబడులు పోనీ ఆంధ్రులే ప్రేమతో పెడతారు అనుకున్నా లాభాలు కోసమే ఎవరైనా వ్యాపారాలు చేస్తారు కదా అలాంటిది పెద్ద నగరాలను దాటుకుని ఎందుకు అమరావతికి వస్తారు అన్నది ఆయన సంధించిన కీలకమైన మరో ప్రశ్న.
ఈ మూడు నగరాలను మించి వసతులు కల్పిస్తే తప్ప ఎవరూ రాలేరని చెప్పారు. ఈ మూడు పెద్ద నగరాలను మించి అమరావతిని చేయడం అంటే అది అవకాశం లేదనే ఆయన అంటున్నారు. ఇక ఏపీకి మంచి సానుకూలమైన అవకాశం ఉంది. అది ఏమిటి అంటే మెగా సిటీస్ విజయవాడ, విశాఖపట్నంలలో ఉన్నాయి.
ఇక ఇవి కాకుండా ఏపీకి డీ సెంట్రలైజ్డ్ అర్బన్ సిస్టం ఉందని అన్నారు. కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు వంటివి 12 దాకా ఉన్నాయి. ఇది మంచిగా డెవలప్మెంట్ చేసుకునే చాన్స్ ఉంది. పదమూడు ఓడరేవులు తీరం వెంబడి ఉన్నాయి. కొన్ని ఇప్పటికే నడుస్తున్నాయి. అలాగే అయిదు విమానాశ్రయాలు ఉన్నాయి. కర్నూల్, కడప రాజమండ్రి కూడా ఉన్నాయి.
ఈ ఉన్న వాటిని అభివృద్ధి చేసుకుంటే అవే సంపదను సృష్టిస్తాయి. డీ సెంట్రలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఈ రాష్ట్రానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాల్సి ఉంది అని ఆయన చెప్పారు. ఇక వీటిని పక్కన పెట్టి అమరావతి వంటి అతి పెద్ద రాజధాని తప్ప ఏపీకి మరో గతీ గత్యంతరం లేదని ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్తది మొదలు పెట్టి మీడియా ద్వారా ప్రజల బ్రెయిన్ వాష్ చేస్తే వేలాది ఎకరాలను సమీకరించడం వాటితోనే అంతా చేయడమే ఒక ఆలోచనగా ఉంది అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అమరావతి అంటే అమరేశ్వరుడు ఉండే పాత ప్రాంతం అని దానిని తీసుకుని వచ్చి కొత్త ప్రాంతానికి పేరు పెట్టడం ఎంత వరకూ నీతిమంతం అవుతుందని ఆయన ప్రశ్నించారు.
మొత్తానికి ఆయన చెప్పేది ఏంటంటే ఏపీలో మహా నగరంగా అమరావతిని నిర్మించినా అది సస్టైనబిలిటీ సాధించలేదని. అదే సమయంలో వికేంద్రీకరణ విధానం ద్వారా అభివృద్ధి చేయవచ్చునని. అంతే కాదు ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని, దానికి ప్రాధాన్యత ఇవ్వమని. ఇంతకీ ఈ సీవీ రెడ్డి ఎవరంటే పదవీ విరమణ చేసిన విశ్రాంతి ఉద్యోగి. ఆయన ఇపుడు వ్యవసాయమే చేస్తున్నారు ఏపీకి సాయం చేసేది కూడా వ్యవసాయమే అంటున్నారు. మరి ఆయన మాటలు ఏలిన వారిని వినిపిస్తాయా అన్నదే చూడాల్సి ఉంది.
