కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా అక్రాన్ ప్రాంతంలో బుధవారం బైక్‌పై వచ్చిన దుండగులు సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపారు. సుమారు 30 రౌండ్లు కాల్చడంతో ముగ్గురు జవాన్లు రాకేష్ దాస్, సంతోష్ చంద్రు, సోమవీర్ సింగ్ గాయపడ్డారు. దుండగులు పరారవడంతో భద్రతా బలగాలు డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టాయి. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
By: Tupaki Desk | 11 Nov 2026 10:04 PM ISTజమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. మీర్ బజార్ సమీపంలోని అక్రాన్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఓ బ్రిడ్జి వద్ద భద్రతా విధులు నిర్వహిస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకుని బైక్‌పై వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలో సుమారు 30 రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం.
ఈ దాడిలో కానిస్టేబుళ్లు రాకేష్ దాస్, సంతోష్ చంద్రు, హెడ్ కానిస్టేబుల్ సోమవీర్ సింగ్ గాయపడ్డారు. కాల్పుల శబ్దంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది గాయపడిన ముగ్గురినీ అనంతనాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తొలుత ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వచ్చినా, తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడినట్లు తెలిసింది.
కాల్పులు జరిపిన అనంతరం దుండగులు మోటార్ సైకిల్‌పై అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాదుల హస్తం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు.
మరోవైపు దాడి జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. డ్రోన్ల సాయంతో అనుమానితుల కదలికలను పరిశీలిస్తున్నారు. ప్రధాన రహదారులు, గ్రామాల్లోకి వెళ్లే మార్గాల్లో తనిఖీలు పెంచారు. దుండగులు తప్పించుకోకుండా దక్షిణ కశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
