Begin typing your search above and press return to search.

జర్నలిస్టులుగా సీఆర్పీఎఫ్ అధికారికి గాలం.. పాక్ కు అందిన కీలక సమాచారం ఇదే!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ లోని పాకిస్థాన్ గూఢచారులకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   30 May 2025 3:02 PM IST
జర్నలిస్టులుగా సీఆర్పీఎఫ్  అధికారికి గాలం.. పాక్  కు అందిన కీలక సమాచారం ఇదే!
X

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ లోని పాకిస్థాన్ గూఢచారులకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీవీ జర్నలిస్టుల ముసుగులో కొంతమంది పాకిస్థాన్ గూఢచారులు.. సీఆర్పీఎఫ్ అధికారికి గాలం వేసిన విషయం తెరపైకి వచ్చింది. ఆయనను విచారించే కొద్దీ కీలక విషయాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది.

అవును... టీవీ జర్నలిస్టుల ముసుగులో సీఆర్పీఎఫ్ అధికారులకు పాక్ గూఢచారులు గాలం వేశారనే విషయం తెరపైకి వచ్చింది. వారికి కీలక లీకులు ఇస్తే ప్రోత్సాహకాలు ఇచ్చినట్లు గుర్తించారని అంటున్నారు. ఈ సమయంలో.. సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ మోతీరామ్ జాట్ ను విచారించే కొద్దీ సంచలన విషయాలు వెలువడుతున్నాయని అంటున్నారు.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఎన్ని సీఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి, వాటి కదలికలు ఏమిటి.. పహల్గాం ఉగ్రవాదులు ఎక్కడ నక్కినట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.. పహల్గాం ఘటన అనంతరం అమిత్ షా పర్యటన వివరాలు, 50 పర్యాటక ప్రాంతాల మూసివేత మొదలైన కీలక సమాచారాన్ని మోతీరామ్ జాట్ పాక్ కు చేరవేసినట్లు గుర్తించారని అంటున్నారు.

ఇదే సమయంలో... సుమారు రెండేళ్లుగా టీవీ జర్నలిస్టు ముసుగులో ఉన్న పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లకు మోతీరామ్మ్ నిరంతరం టచ్ లో ఉన్నట్లు గుర్తించారని.. పహల్గాం ఉగ్రదాడికి సుమారు ఐదు రోజుల ముందు వరకూ అతడు అక్కడి సీఆర్పీఎఫ్ బెటాలియన్ లోనే విధులు నిర్వహించినట్లు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి.

ఇలా పాకిస్థాన్ లోని వ్యక్తులతో సంబంధాలు మొదలైనప్పటినుంచీ ప్రతీ నెలా నాలుగో తేదీన రూ.3,500 అతడికి అందాయని.. ఇక, ఇంటెలిజెన్స్ నివేదికలకు సంబంధించిన కీలక సమాచారం అందజేసిన ప్రతీసారీ రూ.12,000 చేరాయని.. అవన్నీ మోతీరామ్ భర్య అకౌంట్ లో జమ అయ్యేవని తేలిందని చెబుతున్నారు.

ప్రధానంగా ఛండీగఢ్ కు చెందిన ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ రిపోర్టర్ గా ఓ మహిళ తనను తాను పరిచయం చేసుకుంటూ తొలుత మోతీరామ్మ్ ను సంప్రదించి, తనకు కొంత సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ క్రమంలో వీరి మధ్య కొన్ని ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, మెసేజ్ లు నడిచాయి. ఆ తర్వాత నుంచి ఆమెకు మోతీరామ్మ్ కీలక సమాచారం ఇవ్వడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది!

ఇందులో భాగంగా... సరిహద్దుల్లో భద్రతా బలగాల మొహరింపుకు సంబంధించిన కీలక సమాచారం, పలు పత్రాలను అతడు పాక్ కు అందించాడని అంటున్నారు. వీటిల్లో ప్రధానంగ దళాల కదలికలు, మల్టీ ఏజెన్సీ సెంటర్ ఇంటెలిజెన్స్ నివేదికలు, ఉగ్రవాదుల కదలికలను గుర్తించిన లొకేషన్లు ఉన్నాయని అంటున్నారు!