Begin typing your search above and press return to search.

పదేళ్లలో ఇలాంటి పని ఎందుకు చేయలేదు కేసీఆర్?

తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటేనని వ్యాఖ్యానించిన ఆయన మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మరేం చేశారు?

By:  Tupaki Desk   |   27 Jan 2024 3:39 AM GMT
పదేళ్లలో ఇలాంటి పని ఎందుకు చేయలేదు కేసీఆర్?
X

అనూహ్యంగా బాత్రూంలో చోటు చేసుకున్న ప్రమాదంతో బెడ్ రెస్టులో ఉండిపోయిన గులాబీ బాస్ కేసీఆర్.. ఇప్పుడిప్పుడే నార్మల్ లైఫ్ లోకి వస్తున్నారు. ఈ మధ్యనే నడకను ప్రాక్టీస్ చేసిన ఆయన.. ఫాంహౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ.. తన వ్యవసాయ క్షేత్రంలో పంటల బాగోగులు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆయన తన పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని కోరటం గమనార్హం.

తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటేనని వ్యాఖ్యానించిన ఆయన మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు మరేం చేశారు? అని ప్రశ్నిస్తున్నారు. చివర్లో కేంద్రంతో కాస్త తేడాలు వచ్చినప్పటికీ.. మిగిలిన కాలమంతా విభజన హామీల అమలు కోసం ఏం చేశారు? అన్నది ప్రశ్న. రేవంత్ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే కేంద్రం వద్దకు వెళ్లి.. తెలంగాణకు అదనపు ఐపీఎస్ లు కావాలని.. గణతంత్ర వేడుకల్లో తమ రాష్ట్ర శకటానికి అనుమతి ఇవ్వాలని కోరటమే కాదు.. సాధించుకు వచ్చిన తీరు చూస్తే.. అడిగే తీరులో అడిగితే మోడీ సర్కారు ఇస్తుందన్న విషయం అర్థమవుతుంది.

పదేళ్ల పాలనలో కేంద్రంలోని మోడీ సర్కారు చేత విభజన హామీల అమలు ఎందుకు చేయించలేకపోయారు? అన్న ప్రశ్నకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారు? అన్నది ప్రశ్న. తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రజల కోసం కోట్లాడేది.. పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అయితే.. విభజన హామీల అమలుకు పదేళ్లు సరిపోలేదా? అన్న సందేహానికి కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటున్నారు.

అధికారంలోకి కొత్తగా వచ్చిన రేవంత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అయినప్పటికి కేంద్రంలోని మోడీ సర్కారును అడిగి పనులు చేయించుకున్నప్పడు.. ప్రధాని మోడీకి తాను సలహాలు ఇచ్చినట్లుగా చెప్పుకున్న కేసీఆర్.. పదేళ్లు తాను అధికారంలో ఉన్నప్పుడు అన్ని పనులు క్లియర్ చేసుకోవాల్సింది కదా? ఇదంతా చూస్తున్నప్పుడు కేసీఆర్ తన మాటలతో తానే ఇరుకున పడేలా వ్యవహరిస్తున్నారని చెప్పాలి.

పదేళ్లు తాము పవర్ లో ఉన్నప్పుడు పార్లమెంటులోని ఒక్క సెషన్ అయినా తెలంగాణ ప్రయోజనాల కోసం నిజాయితీగా పోరాడి ఉంటే.. ఈ రోజున గులాబీ బాస్ నోటి నుంచి ఇప్పుడుచ్చిన మాటలు రావాల్సిన అవసరమే ఉండడేది కాదు కదా?ఎంపీలకు దిశానిర్దేశం చేసే వేళ.. అధినేత చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా తలాడించటం ఓకే. కానీ.. ప్రజాక్షేత్రంలో తాను మాట్లాడిన మాటలపై చర్చ జరుగుతుంది? ప్రశ్నలు వస్తాయన్న సోయి కేసీఆర్ లో ఎందుకు మిస్ అవుతున్నట్లు? అన్నది ప్రశ్న.