Begin typing your search above and press return to search.

ఇళ్ల ధరలు ఎంత పెరుగుతాయో చెప్పిన క్రిసిల్ రేటింగ్స్

ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే.. ఆ అంశం మీద మరింత ఫోకస్ పెట్టాల్సిందే.

By:  Tupaki Desk   |   2 July 2025 10:43 AM IST
ఇళ్ల ధరలు ఎంత పెరుగుతాయో చెప్పిన క్రిసిల్ రేటింగ్స్
X

ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే.. ఆ అంశం మీద మరింత ఫోకస్ పెట్టాల్సిందే. కారణం.. ఇళ్లు / ఫ్లాట్ల ధరలు పెరగనున్న విషయాన్ని తాజాగా క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాల్ని చూస్తే.. రానున్న కొద్ది నెలల్లో ఇళ్ల ధరలు నాలుగు నుంచి ఆరు శాతం వరకు పెరిగే వీలుందని పేర్కొంది.

గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ధరల పెరుగుదల రెండు అంకెల మేర ఉందన్న విషయాన్ని చెప్పిన క్రిసిల్.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తియ్యటి మాటను చెప్పింది. ఇళ్లు.. ఫ్లాట్లు నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ఆర్థిక సంవత్సరం (2025 ఏప్రిల్ - 2026 మార్చి)లోనూ.. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలోనూ స్థిరమైన వ్యాపారం చేయగలుగుతారన్న అంచనాను వెల్లడించారు.

కొవిడ్ పరిణామాల తర్వాత రికవరీ అయిన మూడేళ్ల తర్వాతా ఇళ్లకు గిరాకీ స్థిరంగా ఉందని.. అమ్మకాల పరిమాణం ఐదు నుంచి ఏడు శాతం.. సగటు ధరలు నాలుగు నుంచి ఆరు శాతం పెరగొచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే.. ఈ అంచనాలు ఉత్తినే చెప్పలేదని.. దేశంలోని సుమారు 75 రియల్ ఎస్టేట్ కంపెనీల అమ్మకాలను విశ్లేషించి ఈ అంచనాను తయారు చేసినట్లుగా పేర్కొంది. ఈ కంపెనీల ప్రత్యేకత ఏమంటే.. దేశంలో అమ్ముడయ్యే ఇళ్లు.. ఫ్లాట్లలో 35 శాతం వాటా వీరిదే కావటం.

సదరు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు.. రుణ చెల్లింపుల సామర్థ్యాలను పరిశీలించిన క్రిసిల్.. వారి ఆర్థిక పరిస్థితి బాగున్నట్లుగా చెప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో గిరాకీలో పెద్దగా మార్పు లేదని చెప్పింది. ఇటీవల కాలంలో వడ్డీ రేట్లు తగ్గటం.. ఇళ్ల ధరల్లో పెరుగుదల స్వల్పంగా ఉండటంతో రియల్ ఎస్టేట్ కు కలిసి రావొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ అంచనా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సానుకూలంగా ఉండగా.. ఇళ్లు కొనాలన్న ప్లాన్ లో ఉన్న వారు మాత్రం త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరాన్ని చెప్పిందని చెప్పాలి.