క్రిమియా రష్యాదే.. ఉక్రెయిన్ ను చీల్చేస్తున్న అమెరికా..
సరిగ్గా 11 ఏళ్ల కిందట ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. కారణం.. ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన ఉక్రెయిన్ కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నించడమే.
By: Tupaki Desk | 19 April 2025 10:00 PM ISTసరిగ్గా 11 ఏళ్ల కిందట ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.. కారణం.. ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన ఉక్రెయిన్ కు చెందిన క్రిమియా ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నించడమే. ఇక 2014 మార్చి 17న క్రిమియా అధికారులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. తర్వాత రష్యాలో చేరాలని చూశారు. మరుసటి రోజు నుంచి రష్యా క్రిమియాను రిపబ్లిక్ ఆఫ్ క్రిమియాగా సెవస్తపోల్ సమాఖ్య నగరంగా ప్రకటించి విలీనం చేసింది. అలా తనలో కలిపేసుకుంది. దీనిని పశ్చిమ దేశాలు మాత్రం గుర్తించలేదు. ఈ ద్వీపకల్పాన్ని సైనికీకరించి.. బయటి జోక్యాన్ని సహించేది లేదని హెచ్చరించింది.
రష్యా మళ్లీ 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టింది. పారిశ్రామికంగా కీలకమైన, సుసంపన్నమైన లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్ ప్రాంతాలను ఆక్రమించింది. అక్కడ రెండేళ్ల కిందటే ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టింది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక పూర్తిగా రష్యా పక్షం వహిస్తూ యుద్ధానికి కారణం ఉక్రెయిన్ అని నిందిస్తున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా క్రిమియా రష్యాదే అని గుర్తించడానికి కూడా అమెరికా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే.. పశ్చిమ దేశాలూ అమెరికాను అనుసరించాల్సి ఉంటుంది.
కాగా, అమెరికా ప్రతిపాదిస్తున్న శాంతి ప్రతిపాదనలతో తక్షణం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చేలా ఉక్రెయిన్, యూరోపియన్ అధికారులు చర్చిస్తున్నారు. కాగా, రష్యా ఆక్రమించుకున్న భూమిపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాల్సిందే అని ఇప్పటికే ట్రంప్ తేల్చి చెప్పారు. అలాగైతే సంధి జరుగుతుందని కూడా అన్నారు.
ఇలా కాదంటే చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ట్రంప్ స్పష్టం చేశారు కూడా. ఏదేమైనదీ, వచ్చే వారం అమెరికా.. యూరప్ దేశాలు, ఉక్రెయిన్ వచ్చేవారం లండన్ లో జరిపే చర్చల్లో తేలనుంది.
ఒకవేళ క్రిమియా గనుక రష్యాదే అని అమెరికా తేల్చేస్తే.. ఉక్రెయిన్ నిలువునా చీల్చేందుకు అంగీకరించినట్లే.
