సిక్స్ కొట్టి గుండెపోటుతో కుప్పకూలిన బ్యాటర్... షాకింగ్ వీడియో!
అవును... తాజాగా పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ కు చెందిన హర్జీత్ సింగ్ అనే లోకల్ క్రికెటర్ స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.
By: Tupaki Desk | 30 Jun 2025 9:49 AM ISTఇటీవల కాలంలో ఎవరికి ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందనేది ఏమాత్రం అంచనా వేయలేకపోతున్నారు. ఎంతో ఫిట్ గా ఉన్నవాళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఈ విషయంలో చిన్నా పెద్దా అనే తేడా లేదు! డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ, కుర్చీలో కూర్చుని ఉన్నప్పుడు సైతం ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఈ క్రమంలో ఓ క్రికెటర్ మరణం షాకింగ్ గా మారింది.
అవును... తాజాగా పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ కు చెందిన హర్జీత్ సింగ్ అనే లోకల్ క్రికెటర్ స్కూల్ మైదానంలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. సిక్స్ కొట్టిన తర్వాత పిచ్ మధ్యలోకి నడుచుకుంటూ వెళ్లిన అతను.. అలసటతో కాసేపు కూర్చునే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలోనే క్షణాల్లో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో షాకింగ్ గా మారింది.
అతడు కుప్పకూలిపోయిన విషయాన్ని గమనించిన వెంటనే మైదానంలోని ఇతర క్రికెటర్లు అతడి వద్దకు చేరుకుని సీపీఆర్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే అతడు మరణించినట్లు చెబుతున్నారు. దీంతో.. ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది.
కాగా... 2024లోనూ పూణేలోని గార్వారే స్టేడియంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో 35 ఏళ్ల క్రికెటర్ గుండెపోటుతో మరణించాడు. ఇందులో భాగంగా... ఓపెనర్ గా బ్యాటింగ్ చేయడానికి వచ్చిన ఇమ్రాన్ పటేల్ అనే ప్లేయర్... మైదానంలో కొంత సమయం గడిపిన తర్వాత ఛాతీ, చేయి నొప్పి గురించి ఫిర్యాదు చేశాడు.
ఈ విషయాన్ని అతడు ఆన్ ఫీల్డ్ అంపైర్లకు తెలియజేశాడు. దీంతో.. అతడి పరిస్థితి గమనించిన అంపైర్లు.. మైదానం విడిచి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. అనంతరం.. పెవిలియన్ కు తిరిగి వెళుతుండగా ఇమ్రాన్ కుప్పకూలిపోయాడు. దీంతో.. ఇతర ఆటగాళ్ళు అతని వైపు పరుగెత్తారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇమ్రాన్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
